కార్లను కాదు, కార్ల లోగోలను దోచుకెళ్తున్న దొంగలు

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 16:36 [IST]
కార్లను దొంగతనం చేయడం పాత స్టయిల్, కార్లను లోగోలను దొంగతనం చేయటం కొత్త స్టయిల్. ప్రస్తుతం పెరుగుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కార్ల దొంగలకు కార్లను దొంగిలించడం పెద్ద కష్టంగా మారిపోయినట్లుంది కాబోలు.. అందుకే కార్లకు బదులుగా వాటికి ముందు, వెనుక ఉండే లోగోలను దోచుకెళ్లిపోతున్నారు.

మరీ ముఖ్యంగా ఖరీదైన కార్లయిన బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్ బెంజ్, స్కొడా, ఫోక్స్‌వ్యాగన్ వంటి లగ్జరీ బ్రాండ్ కార్లను టార్గెట్ చేసి వాటి లోగోలను తస్కరిస్తున్నారు. పబ్లిక్ ఏరియాలో కారు పార్క్ చేసి అలా కాఫీ తాగొచ్చేలోపే కార్లపై అతికించిన లోగోలను మాయం చేసేస్తున్నారు, ఈ కొత్త రకం దొంగలు.

ఈ తరహా సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ, పెద్దగా ఏవీ వెలుగులోకి రాలేదు. కర్ణాటకలోని మంగళూరులో ఈ తరహా సంఘటనలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. సాధారణ కార్ల లోగోలు అయితే ఎలాగోలా సంపాధించుకోవచ్చు. కానీ ఇలాంటి లగ్జరీ కార్ల లోగోలు అంత సామాన్యంగా లోకల్ మార్కెట్లలో లభ్యం కావు.

కొత్త లోగోలను కొనుగోలు చేయాలంటే కార్ల యజమానులు వేల రూపాయల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాటి కోసం అధిక సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి లగ్జరీ కార్ డీలర్లు సదరు లోగోలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని యజమానులకు విక్రయించడం జరుగుతుంది.

ఇలా కార్ లోగోలను దొంగిలిస్తున్న వారిలో అధికభాగం యువకులే ఉన్నట్లు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇలా దొంగిలించిన లోగోలను వారికి ఉన్న హై నెట్‌వర్క్ ద్వారా విక్రయించడం జరుగుతుంది. అయితే, నకిలీ లోగోలను కూడా కొన్ని ప్లాంతాల్లో ఫుట్‌పాత్‌లపై విక్రయిస్తుండటాన్ని మనం గమనించవచ్చు.

ఇలా విక్రయించే వారు సదరు లోగోలను తక్కువ ధరకు విక్రయించినట్లయితే, అవి నకిలీ లోగోలుగా గుర్తించవచ్చు. అలా కాకుండా, అధిక మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తే అవి దొంగిలించబడిన ఒరిజినల్ లోగోలుగా గుర్తించవచ్చు. ఇది కేవలం కార్లతో మాత్రమే ఆగిపోలేదు. ద్విచక్ర వాహనాల్లో సైతం ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

త్రీడి (3D) లుక్ కోసం ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు కొత్తగా పెద్ద లోగోలను బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌పై ముద్రించడం జరుగుతోంది. వీటిని దుండగులు ఎంతో చాకచక్యంగా తొలగించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. బజాజ్ ఇంజన్లపై ఉండే ధృఢమైన స్టిక్కర్లు, యమహా లోగోలను తస్కరిస్తున్నారు. మరి వీటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీరేమైనా సలహా ఇవ్వగలరా..??

English summary
A new kind of car theft is being reported from the city of Mangalore in Karnataka. Car thieves are now targeting the logos of high end cars such as BMW, Audi, Volkswagen, Mercedes-Benz and Skoda. Cars parked in public areas are the most likely victims of this logo thefts.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .