డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి టెస్ట్ డ్రైవ్ రివ్యూ; ఓ పెద్ద హ్యాచ్‌బ్యాక్..!

నిస్సాన్‌కు చెందిన డాట్సన్ బ్రాండ్ నుంచి రానున్న రెండవ ఉత్పత్తి 'డాట్సన్ గో ప్లస్' (Datsun Go+) ఎమ్‌పివి. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసిన ఈ బడ్జెట్ ఎమ్‌పివి వచ్చే ఏడాది ఆరంభంలో మార్కెట్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి కోసం కంపెనీ ఇటీవలే రిషికేష్, ఉత్తరాఖాండ్ వద్ద ఓ మీడియా డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ టెస్ట్ డ్రైవ్ కార్యక్రమంలో మా డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా పాల్గొంది. మరి మా టెస్ట్ డ్రైవ్ పరీక్షలో డాట్సన్ గో ప్లస్ ఎన్ని మార్కులు తెచ్చుకుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

ముందుగా.. డాట్సన్ గో ప్లస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఎమ్‌పివి బాడీని జపాన్‌లో డిజైన్ చేశారు. అయితే, ఈ కారును మాత్రం పూర్తిగా ఇండియాలోనే అభివృద్ధి చేసి, తయారు చేశారు. గో ప్లస్ ఓ సబ్-ఫోర్ మీటర్ 7-సీటర్ (2+3+2) ఎమ్‌పివి. ఈ మోడల్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, తక్కువ ధరకే (రూ.5 లక్షల లోపే) అందించేందుకు వీలుగా గో హ్యాచ్‌బ్యాక్ మోడల్‌కు కొద్దిపాటి మార్పులు చేసి ఈ గో ప్లస్ ఎమ్‌పివిని తయారు చేశారు. అందుకే, ఈ రెండు మోడళ్లలో అనేక ఫీచర్లు ఒకేలా ఉంటాయి.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివికి సంబంధించిన పూర్తి రివ్యూని ఈ ఫొటో ఫీచర్‌లో చూడండి..!

పరిచయం

పరిచయం

* టెస్ట్ చేసిన మోడల్: డాట్సన్ గో ప్లస్ (టి, టాప్-ఎండ్ వేరియంట్)

* ఇంధన రకం: పెట్రోల్

* ఇంజన్: 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌

* రోడ్ టెస్ట్ చేసిన ప్రాంతం: రిషికేష్, ఉత్తరాఖాండ్

* అంచనా ధర: రూ.5 లక్షలకు దిగువన (ఎక్స్-షోరూమ్)

తర్వాతి స్లైడ్‌లలో పూర్తి రివ్యూని చదవండి.

డిజైన్ - ఫ్రంట్

డిజైన్ - ఫ్రంట్

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మరియు డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలను రెండింటిని పక్కపక్కనే ఉంచి గమనిస్తే, ఫ్రంట్ డిజైన్‌లో ఏ మాత్రం తేడా కనిపించదు. 'డి-కట్ గ్రిల్'ను కలిగి ఉండే ఫ్రంట్ బంపర్, గ్రిల్ చుట్టూ ఉండే క్రోమ్ ఫినిషింగ్ స్ట్రైప్, మరియు దాని మధ్యలో డాట్సన్ లోగో, బంపర్ క్రింది భాగంలో ఉండే ఎయిర్ ఇన్‌టేక్స్, చక్కగా డిజైన్ చేసిన హెడ్‌లైట్స్‌తో ఇది ముందు వైపు నుంచి అచ్చం గో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే ఉంటుంది. బడ్జెట్ ఎమ్‌పివి కావటంతో ఇందులో ఫాగ్ ల్యాంప్స్ ఆఫర్ చేయటం లేదు (టాప్-ఎండ్ వేరియంట్‌లో కూడా లేవు).

డిజైన్ - సైడ్

డిజైన్ - సైడ్

గో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయటం మరియు బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకోవటంతో గో ప్లస్ ఎమ్‌పివి సైడ్ డిజైన్‌లో కూడా పెద్దగా మార్పులు చేయలేదు. చివరకు వీల్‌బేస్‌ను కూడా పెంచలేదు. గో హ్యాచ్‌బ్యాక్ ఎంత వీల్‌బేస్ (2450 మి.మీ)ను కలిగి ఉంటుందో, గో ప్లస్ ఎమ్‌పివి కూడా అంతే వీల్‌బేస్ (2450 మి.మీ)ను కలిగి ఉంటుంది. ఈ ఎమ్‌పివి మొత్తం పొడవు కేవలం 3995 మి.మీ మాత్రమే. డోర్ సైజ్‌లలో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. అందుకే ఈ ఎమ్‌పివిలో రియర్ డోర్ చిన్నదిగా అనిపిస్తుంది.

డిజైన్ - రియర్

డిజైన్ - రియర్

గో ప్లస్ ఎమ్‌పివి రియర్ డిజైన్‌కి, గో హ్యాచ్‌బ్యాక్ రియర్ డిజైన్‌కి మాత్రం కొద్దిపాటి మార్పులు ఉన్నాయి. గో హ్యాచ్‌బ్యాక్‌లో నెంబర్ ప్లేట్ వెనుక బంపర్‌పై ఉంటుంది, కానీ గో ప్లస్ ఎమ్‌పివిలో మాత్రం నెంబర్ ప్లేట్ బూట్ డోర్‌పై ఉంటుంది. అలాగే బంపర్ డిజైన్స్‌లో కూడా తేడాలున్నాయి. గో ప్లస్ రియర్ బంపర్ ప్లెయిన్‌గా సింపుల్‌గా ఉంటుంది. దీనిపై కనీసం రిఫ్లెక్టర్లను అమర్చినా బాగుండేనేది మా అభిప్రాయం. ఇక టెయిల్ ల్యాంప్స్ విషయానికి వస్తే.. గో హ్యాచ్‌బ్యాక్‌లోని టెయిల్ ల్యాంప్ క్లస్టర్‌ను యధావిధిగా తీసుకొచ్చి గో ప్లస్‌లో అమర్చారు.

ఇంటిరీయర్

ఇంటిరీయర్

డాట్సన్ గో డ్యాష్‌బోర్డ్ మాదిరిగానే గో ప్లస్ ఎమ్‌పివి డ్యాష్‌బోర్డ్ డిజైన్ మోడ్రన్‌గా, సింపుల్‌గా ఉంటుంది. బడ్జెట్ ఎమ్‌పివి కావటంతో ఈ కారులో ఇంటీరియర్లు అంత హైఫైగా అనిపించవు. సింపుల్ డ్యాష్‌బోర్డ్ డిజైన్, 3-స్పోక్ స్టీరింగ్ వీల్, బీజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్‌ను ఇందులో చూడొచ్చు. ఈ కారులో మొత్తం నాలుగు ఏసి వెంట్స్ (ఒకే రకమైన డిజైన్‌తో) ఉంటాయి. ఏసి వెంట్స్ చూట్టూ సిల్వర్ ఫినిషింగ్ ఉంటుంది.

కనెక్టెడ్ సీట్స్

కనెక్టెడ్ సీట్స్

గో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే గో ప్లస్ ఎమ్‌పివిలో కూడా ముందు వైపు కనెక్టెడ్ సీట్స్ ఉంటాయి. ఇందులో గేర్ లివర్, పార్కింగ్ బ్రేక్‌లను డ్యాష్‌బోర్డుకే అమర్చబడి ఉంటాయి. కారు ఫ్లోర్‌పై ఈ రెండు కంట్రోల్స్‌ను తొలగించడం వలన ఇరుకుగా ఉండే పార్కింగ్ ప్రదేశాల్లో క్యాబిన్‌లో అటు ఇటూ కదిలేందుకు / ప్రవేశించేదుకు వీలుగా ఉంటుందని డాట్సన్ ఇంజనీర్లు చెబుతున్నారు. ఇలా చేయటం వలన ఫ్రంట్ సీట్లలో స్పేస్ కూడా విశాలంగా ఉంటుంది.

పార్కింగ్ బ్రేక్

పార్కింగ్ బ్రేక్

ఇదివరకటి స్లైడ్‌లో చెప్పుకున్నట్లుగా డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో పార్కింగ్ బ్రేక్/హ్యాండ్ బ్రేక్‌ను డ్యాష్‌బోర్డుకే అమర్చబడి ఉంటుంది. ఇది డ్రైవర్ ఎడమకాలి దగ్గర్లో ఉంటుంది. ఈ బ్రేక్‌ను అప్లయ్ చేయాలంటే, చేతితో దీనిని బయటకు లాగాల్సి వస్తుంది. ఇలా చేసినప్పుడు బ్రేక్ లివర్ చాలా వరకు ముందుకు వస్తుంది. ఫలితంగా ఇది పొడవుగా ఉండే డ్రైవర్లకు మోకాలి వద్ద ఇబ్బందిగా అనిపిస్తుంది.

మొబైల్ డాకింగ్ స్టేషన్

మొబైల్ డాకింగ్ స్టేషన్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన మరో అధునాతన ఫీచర్ 'మొబైల్ డాకింగ్ స్టేషన్' (ఎమ్‌బిఎస్). మీ స్మార్ట్‌ఫోన్‌ను నేరుగా మీ కారుతో కనెక్ట్ చేసుకునే ఫీచర్. వాస్తవానికి అనేక ఎంట్రీ లెవల్ కార్లలో ఇలాంటి ఫీచర్ అందుబాటులో లేదు.

మీ స్మార్ట్ ఫోన్ (ఎలాంటి సైజు ఫోనైనా సరే)ను డ్యాష్‌బోర్డుకే అమరి ఉంచేందుకు గాను ఓ ప్రత్యేక స్లాట్ ఉంటుంది. ఆక్స్-ఇన్ కేబుల్ ద్వారా ఫోనులోని పాటల్ని కారులోని స్పీకర్లతో వినొచ్చు. ఒకవేళ మీ ఫోన్ చార్జింగ్ ఖాలీ అవుతున్నట్లు అనిపిస్తే, పక్కనే ఉన్న యూఎస్‌బి పోర్టుతో ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు. ఈ యూఎస్‌బి పోర్ట్ కేవలం మొబైల్‌ను చార్జ్ చేసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది, ఇందులో పెన్‌డ్రైవ్ లేదా కార్డ్ రీడర్ ఉంచి పాటలు ప్లే చేయటం కుదరదు.

ఇన్ఫోటైన్‌మెంట్

ఇన్ఫోటైన్‌మెంట్

ఈ మొబైల్ డాకింగ్ స్టేషన్‌నే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్/జిపిఎస్‌గా మార్చుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో మ్యాప్స్ ఆన్ చేసి, ఆక్స్-ఇన్ పోర్ట్‌ని కనెక్ట్ చేసుకుంటే వాయిస్ బేస్డ్ కమాండ్స్‌ని స్పీకర్ల ద్వారా వినొచ్చు. ఇంకా.. ఈ సెటప్‌తో కేవలం పాటలు, రేడియో వినటం మాత్రమే కాకుండా మీ స్మార్ట్ ఫోన్‍‌లోని వీడియోలను కూడా ఇదిగో ఈ ఫొటోలో చూపించినట్లు ప్లే చేసుకోవచ్చు. భారత్‌లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని డాట్సన్ ఈ సిస్టమ్‌ను తయారు చేసింది.

ఫ్రంట్ డోర్ స్పీకర్స్

ఫ్రంట్ డోర్ స్పీకర్స్

గో ప్లస్ ఎమ్‌పివిలో వినోద ప్రియుల కోసం కంపెనీ మొబైల్ డాకింగ్ స్టేషన్‌ను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసినదే. దీని సాయంతో యూజర్లు తమ స్మార్ట్ ఫోన్‌లోని సంగీతాన్ని ఈ సిస్టమ్ ద్వారా వినొచ్చు. ఇందుకోసం కంపెనీ ఫ్రంట్ రెండు డోర్లలో రెండు స్పీకర్లను ఆఫర్ చేస్తోంది. ఈ స్పీకర్లు డీసెంట్ సౌండ్‌ని ఆఫర్ చేస్తాయి.

కీలక ఫీచర్లు (టాప్-ఎండ్ వేరియంట్‌లో లభించేవి)

కీలక ఫీచర్లు (టాప్-ఎండ్ వేరియంట్‌లో లభించేవి)

మొత్తమ్మీద చూసుకుంటే, డాట్సన్ గో కారులోని కీలక ఫీచర్లు ఇలా ఉన్నాయి:

* స్పీడ్ సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్

* ఫ్రంట్ పవర్ విండోస్

* కనెక్టెడ్ ఫ్రంట్ సీట్స్

* మొబైల్ డాకింగ్ స్టేషన్ (ఎమ్‌బిఎస్)

* సెంట్రల్ లాకింగ్ (మ్యాన్యువల్)

* యాక్ససరీ సాకెట్ (12 వోల్ట్స్)

* 2 ఫ్రంట్ స్పీకర్స్ (ముందు వైపు డోర్లలో)

* 1.5 లీటర్ బాటిళ్లను అమర్చుకోగల డోర్ పాకెట్స్

* ఇంటెలిజెంట్ వైపింగ్ సిస్టమ్ (ఐడబ్ల్యూఎస్)

ఫ్రంట్ సీట్స్

ఫ్రంట్ సీట్స్

ముందు వరుసలో కనెక్టెడ్ సీట్స్ ఉంటాయి, అలాగని ఇందులో ముగ్గురు కూర్చోవటానికి వీళ్లేదు. ఎక్కువ స్పేస్, కంఫర్ట్ కోసం మాత్రమే ఈ సీట్లను ఇలా డిజైన్ చేశారు. ఫ్రంట్ సీట్లలోని హెడ్‌రెస్ట్‌లను సర్దుబాటు చేసుకోవటం కుదరదు. డాట్సన్ ఇంజనీర్లు పేర్కొన్న సమాచారం ప్రకారం, డ్రైవర్ మరియు కో ప్యాసింజర్‌లకు వెన్నెముకకు మంచి సపోర్ట్‌నిచ్చేలా ఫ్రంట్ సీట్లను సాధారణంగా L షేపులో కాకుండా, కాస్తంత వంపుగా డిజైన్ చేశారు. ఫ్రంట్ సీట్లకు స్లైడ్, రిక్లెయినింగ్ ఫీచర్ ఉంటుంది.

సెకండ్ రో సీట్స్

సెకండ్ రో సీట్స్

ఇక రెండవ వరుసలో సీట్ల విషయానికి వస్తే.. ఈ సీట్లలో పొడవుగా ఉన్న వ్యక్తులు కూర్చున్నప్పుడు లెగ్‌రూమ్ సమస్య తలెత్తుతుంది. ముందు సీట్లను సర్దుబాటు చేసుకుంటే, ఈ సమస్యను అధిగమించుకోవచ్చు. సెకండ్ రో సీట్లను ఫ్లాట్‌గా ఫోల్డ్ (టంబల్ డౌన్) చేసుకోవచ్చు. మూడవ వరుసలోని సీట్లలోకి ప్రవేశించాలంటే, తప్పనిసరిగా రెండవ వరుస సీట్లను పూర్తిగా మడచాల్సి ఉంటుంది.

థర్డ్ రో సీట్స్

థర్డ్ రో సీట్స్

మూడవ వరుసలోని సీట్లలో చిన్న పిల్లలు తప్ప పెద్దవాళ్లు సౌకర్యవంతంగా కూర్చోలేదు. దీని ఫ్లాట్ సీటింగ్ వలన పెదవాళ్లకి కాళ్ల నొప్పి వచ్చే ఆస్కారం ఉంది. నిజానికి ఈ కారులో థర్డ్ రో సీట్లు ఉన్నా లేనట్లే అని చెప్పాలి.

బూట్ స్పేస్ - 1

బూట్ స్పేస్ - 1

మూడు వరుసలలోని సీట్లను అన్‌ఫోల్డ్ చేసి ఉన్నప్పుడు బూట్ స్పేస్ కేవలం 48 లీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే, ఇది వాటర్ బాటిళ్లను స్టోర్ చేసుకోవటానికి తప్ప ఎందుకు పనికిరాదు.

బూట్ స్పేస్ - 2

బూట్ స్పేస్ - 2

బూట్ స్పేస్‌ను పెంచుకోవాలనుకున్నప్పుడు థర్డ్ రో సీట్లను ఫోల్డ్ చేసుకోవచ్చు, అప్పుడు బూట్ స్పేస్ 347 లీటర్లకు పెరుగుతుంది.

బూట్ స్పేస్ - 3

బూట్ స్పేస్ - 3

థర్డ్ రో సీట్స్ ఫోల్డ్ చేసిన తర్వాత కూడా బూట్ స్పేస్ సరిపోదనుకుంటే, సెకండ్ రో సీట్స్‌ను కూడా ఫోల్డ్ చేసి బూట్ స్పేస్‌ను మరింత పెంచుకోవచ్చు (ఈ ఫొటోలో చూపించినట్లుగా).

ఇంజన్

ఇంజన్

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ (1198సీసీ), 3-సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌నే ఈ డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలోను ఉపయోగించారు. ప్రస్తుతానికి ఇది పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందులో డీజిల్ ఇంజన్ అందుబాటులో లేదు. ఈ 3-సిలిండర్ ఇంజన్ తేలికగా ఉండటం వలన వాహనం బరువు తక్కువగా ఉంటుంది.

గేర్‌బాక్స్

గేర్‌బాక్స్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలోని 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. మేము టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్‌గా, లైట్‌గా అనిపించింది. అయితే, ఫుల్ లోడ్‌తో కారును నడుపుతున్నప్పుడు, స్పీడ్‌ను బ్యాలెన్స్ చేసేందుకు గేర్లను తరచూ మార్చాల్సి వస్తుంది.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

ఫోర్-సిలిండర్ ఇంజన్‌తో పోల్చుకుంటే ఈ ఇంజన్ కొంచెం ఎక్కువ శబ్ధాన్ని, వైబ్రేషన్‌ను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ, పెర్ఫార్మెన్స్ విషయంలో ఇది ఫర్వాలేదనిపిస్తుంది. ఇందులోని ఇంజన్ గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిస్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 14.5 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుటుందని కంపెనీ తెలిపింది.

మైలేజ్

మైలేజ్

ఈ ప్రైస్ రేంజ్‌లో తయారీదారులు/కొనుగోలుదారులు పెర్ఫార్మెన్స్ మీద కాకుండా మైలేజ్‌పైనే ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. డాట్సన్ పేర్కొన్న దాని ప్రకారం, గో ప్లస్ ఎమ్‌పివి లీటరు పెట్రోల్‌కు 20.62 కి.మీ. మైలేజీనిస్తుంది (ఏఆర్ఏఐ సర్టిఫైడ్). అయితే, వాస్తవానికి ఇది మా టెస్టింగ్ కండిషన్స్‌లో లీటరుకు 16 కి.మీ. మైలేజీనిచ్చింది (సిటీ, హైవే కలిపి).

డ్రైవ్‌ట్రైన్, ట్రాన్సిమిషన్, పెడల్స్

డ్రైవ్‌ట్రైన్, ట్రాన్సిమిషన్, పెడల్స్

డాట్సన్ గో ప్లస్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తోనే లభిస్తుంది. ఇందులో ఫుల్లీ ఆటోమేటిక్ కానీ లేదా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) వేరియంట్ కానీ అందుబాటులో లేదు. తక్కువ ఇంజన్ స్పీడ్స్ వద్ద అప్‌షిఫ్ట్ చేసినప్పుడు ఈ 104 ఎన్ఎమ్ టార్క్ కొంచెం తక్కువ అనిపిస్తుంది ఇది సిటీ డ్రైవ్‌కు సరిపోతుంది. అలాగే హైవేలపై నడిపేటప్పుడు, అధిక ఆర్‌పిఎమ్‌ల వద్ద డౌన్‌షిఫ్ట్ చేసినప్పుడు సరైన షిఫ్ట్ పొందటానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. పుల్లింగ్ పవర్ (టార్క్)ను ఇంకొంచెం పెంచి ఉంటే బాగుంటుందనేది మా అభిప్రాయం.

మరో వైపు హ్యాంగింగ్ పెడల్స్ (క్లచ్/బ్రేక్/యాక్సిలరేటర్)ను సిటీ లేదా హైవే డ్రైవ్‌లో ఆపరేట్ చేసేందుకు ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉండదు. క్లచ్ లైట్‌గానే ఉన్నప్పటికీ, దీని ట్రావెల్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.

డ్రైవింగ్ అండ్ హ్యాండ్లింగ్

డ్రైవింగ్ అండ్ హ్యాండ్లింగ్

హ్యాండ్లింగ్ విషయానికి వస్తే.. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి చాలా తేలికగా అనిపిస్తుంది. దీని లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ కారణంగా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ (సిజి) పెరిగి మంచి హైస్పీడ్స్ వద్ద కూడా మంచి హ్యాండ్లింగ్‌ను ఆఫర్ చేస్తుంది. దీని టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ (4.6 మీటర్లు). ఫలితంగా, దీనిని టర్న్ చేయటం సులువుగా ఉంటుంది. కాంపాక్ట్ డిజైన్ కారణంగా ఇది ఎక్కువ పార్కింగ్ స్పేస్ ఆక్రమించదు. ఇరుకైన ప్రదేశాల్లో సైతం పార్క్ చేయటానికి సులువుగా ఉంటుంది.

స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్

స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి టాప్-ఎండ్ వేరియంట్ (టి)లో మాత్రమే పవర్ స్టీరింగ్ ఆఫర్ చేస్తున్నారు. మిగతా వేరియంట్లలో (డి, డి1, ఏ) కేవలం మ్యాన్యువల్ స్టీరింగ్ మాత్రమే ఉంటుంది. ఇందులోని స్పీడ్ సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ (ఈపిఎస్) తక్కువ స్పీడ్స్ వద్ద లైట్‌గాను, ఎక్కువ స్పీడ్స్ వద్ద హెవీగాను అనిపిస్తుంది.

టైర్స్ అండ్ బ్రేక్స్

టైర్స్ అండ్ బ్రేక్స్

పెద్ద కారుకు చిన్న టైర్లు అమర్చినట్లుగా గో ప్లస్ ఎమ్‌పివిలో 155/70R13 ట్యూబ్‌లెస్ టైర్లను ఆఫర్ చేస్తున్నారు. ఈ టైర్లు చిన్నవిగా ఉండటం వలన వాహనం రోల్ అయ్యే ప్రమాదం ఉంటుందని అనిపించింది. ఇందులో అల్లాయ్ వీల్స్ ఆప్షన్ లేదు, కేవలం స్టీల్ వీల్స్‌తోనే లభిస్తాయి.

బ్రేక్స్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్‌లను వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లను ఆఫర్ చేస్తున్నారు. ఒవరాల్‌గా బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదనిపిస్తుంది. ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) లేదు.

సస్పెన్షన్

సస్పెన్షన్

భారతీయ రోడ్లను దృష్టిలో ఉంచుకొని దీని సస్పెన్షన్‌ను మరియు గ్రౌండ్ క్లియరెన్సును అభివృద్ధి చేశారు. ఇది 170 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంటుంది. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలోని లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంటుంది. ఫలితంగా సగటు గ్రౌండ్ క్లియరెన్స్ కన్నా ఎక్కువ మరియు రీడిఫైన్డ్ కంఫర్ట్‌ను ఆఫర్ చేస్తుంది.

ఇంటెలిజెంట్ వైపర్

ఇంటెలిజెంట్ వైపర్

గో ప్లస్ ఎమ్‌‌పివిలో టాటా నానో మాదిరిగా సింగిల్ వైపర్ ఉంటుంది. అయితే, ఇదొక ఇంటెలిజెంట్ స్పీడ్ సెన్సింగ్ వైపర్. ఈ వెడల్పాటి సింగిల్ వైపర్‌ను సపోర్ట్ చేసేందుకు ధృడమైన నిర్మాణం, పవర్‌ఫుల్ వైపర్ మోటార్లు ఉంటాయి.

ఇండికేటర్ స్టాక్స్

ఇండికేటర్ స్టాక్స్

డాట్సన్ గో ప్లస్ కారులోని ఇండికేటర్ స్టాక్స్ (లైట్స్, వైపర్, ఇండికేటర్లకు సంబంధించిన కంట్రోల్స్) కొంచెం లావుగా ఉండటం వలన వీటిని ఆపరేట్ చేయటం కూడా చాలా సులువుగా అనిపిస్తుంది.

గో ప్లస్ డీటేలింగ్

గో ప్లస్ డీటేలింగ్

గో ప్లస్ ఎమ్‌‍పివి ఎంట్రీ లెవల్ కారే అయినప్పటికీ, ఈ కారులో ఆఫర్ చేస్తున్న ఫ్లోర్ మ్యాట్స్‌పై గో ప్లస్ బ్యాడ్జ్‌తో కూడిన డీటేలింగ్ ఆకట్టుకునేలా ఉంటుంది.

ఎంట్రీ, ఎగ్జిట్

ఎంట్రీ, ఎగ్జిట్

గో ప్లస్ ఎమ్‌పి ఫ్రంట్ డోర్లు విశాలంగా ఉండి ఫ్రంట్ ప్యాసింజర్ లేదా డ్రైవర్ కారులోనికి ప్రవేశించడానికి, వెలుపలికి రావటానికి సులువుగా ఉంటుంది. అలాగే రియర్ సీట్లలోకి కూడా ఎంట్రీ/ఎగ్జిట్ సులువుగానే ఉంటుంది. కానీ థర్డ్ రో సీట్స్ ఎంట్రీ/ఎగ్జిట్ మాత్రం కాస్తంత ఇబ్బందిగానే అనిపిస్తుంది.

ఫాలోమి హోమ్ హెడ్‌ల్యాంప్స్

ఫాలోమి హోమ్ హెడ్‌ల్యాంప్స్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో ఫాలో మి హోమ్ హెడ్ ల్యాంప్స్ అనే ఫీచర్ ఉంటుంది. కారును లాక్ చేసిన తర్వాత కూడా హెడ్‌లైట్లు కొన్ని సెకండ్ల పాటు ఆన్‌లో ఉండి, చీకట్లో డ్రైవర్‌కు దారి చూపేందుకు సహకరిస్తాయి.

నాణ్యత

నాణ్యత

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిని, గో బ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన నేపథ్యంలో, దాదాపుగా ఆ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన మెటీరియల్స్‌నే ఈ ఎమ్‌పివిలోను ఉపయోగించారు. ఇందులో ఉపయోగించిన ప్లాస్టిక్ నాణ్యతను మరింత మెరుగుపరచి ఉంటే, బాగుండనిపిస్తుంది. ఈ కారులో అక్కడక్కడా ఫిట్ అండ్ ఫినిషింగ్ లోపాలు కనిపిస్తాయి.

ఇంటీరియర్ స్పేస్

ఇంటీరియర్ స్పేస్

ఎక్సైజ్ సుంకం రాయితీ కోసం డాట్సన్ తమ గో ప్లస్ కారును 4 మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండేలా (3.995 మీటర్లు) డిజైన్ చేయటంతో, ఇంటీరియర్ స్పేస్ విషయంలో కంపెనీ రాజీ పడాల్సి వచ్చింది. ఫలితంగా, గో ప్లస్ ఎమ్‌పివిలోని ఇంటీరియర్ స్పేస్ కాస్తంత ఇరుకుగా అనిపిస్తుంది.

స్పేర్ వీల్

స్పేర్ వీల్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో 2+3+2 సీటింగ్ లేఅవుట్ కారణంగా, ఇందులో స్పేర్ వీల్‌ను కారు వెనుక వైపు క్రింది భాగంలో (అండర్ బాడీకి) అమర్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ స్పేర్ వీల్‌ను యాక్సిస్ చేసుకోవటం, అందులోను కొత్తగా కారును కొనుగోలు చేసే వారికి ఇది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది.

కార్ జాక్

కార్ జాక్

గో ప్లస్ ఎమ్‌పివిలో స్పేర్ వీల్ కారు వెనుక భాగంలో బాడీకి అమర్చబడి ఉంటుందని ఇదవరకటి స్లైడ్‌లో తెలుసుకున్నాం కదా.. అయితే, ఫ్లాట్ టైరును మార్చేందుకు అవసరమైన జాక్‌ను మాత్రం ఫ్రంట్ డ్రైవర్ సీట్ క్రింద అమర్చబడి ఉంటుంది. కొత్త వారికి ఈ విషయం తెలియకపోవచ్చు. అంతేకాదు, ఈ జాక్‌ను యాక్సిస్ చేసుకోవటంలో కాస్తంత ఇబ్బంది కూడా కలుగవచ్చు.

బూట్ లాక్

బూట్ లాక్

చివరిగా.. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో బూట్ లాక్ (వెనుక డోరు లాక్) లేకపోవటం ఇందులో మరో లోపంగా గుర్తించవచ్చు. ఈ సౌలభ్యం లేని కారణంగా ఈ కారు బూట్ డోరును వెనుక నుంచి ఓపెన్ చేయటం సాధ్యం కాదు. అంటే బూట్ డోరు ఓపెన్ చేయాల్సి వచ్చినపుడల్లా డ్రైవర్ సైడ్ డోరును ఓపెన్ చేసి, బూట్ డోరును రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇది అసౌకర్యంగా అనిపిస్తుంది.

ఎయిర్ కండిషనింగ్

ఎయిర్ కండిషనింగ్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో రియర్ ఏసి వెంట్స్ లేకపోవటం, హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ కన్నా ఎమ్‌పివి లోపలి పరిమాణం పెద్దదిగా ఉండటం వలన కారులోని ఏసి సామర్థ్యం సరిపోదనిపిస్తుంది. కారులో వాతావరణం చల్లబడటానికి ఎక్కువ సమయం పడుతుంది.

మాస్టర్ పవర్ విండోస్

మాస్టర్ పవర్ విండోస్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో పవర్ విండోస్ కేవలం ఫ్రంట్ డోర్లకు మాత్రమే లభిస్తాయి. టాప్-ఎండ్ వేరియంట్‌లో సైతం ఆల్-పవర్ విండోస్ ఆప్షన్ లేదు. ఫ్రంట్ పవర్ విండోస్‌కు ఇండిపెండెంట్ స్విచెస్ ఉంటాయి, కానీ డ్రైవర్ సైడ్ మాస్టర్ కంట్రోల్ స్విచ్ ఉండదు. ఎడమ వైపు పవర్ విండోని ఓపెన్ చేయాలంటే, డ్రైవర్ పక్కకు ఒరిగి ఆపరేట్ చేయాల్సి వస్తుంది. ఒక్కరే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది.

గ్లవ్ బాక్స్

గ్లవ్ బాక్స్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో క్లోజ్డ్ గ్లౌవ్ బాక్స్ లేదు. ప్యాసింజర్ సైడ్ డ్యాష్‌బోర్డ్ పైభాగంలో ఓ ట్రే లాంటి డిజైన్, డ్యాష్‌‌బోర్డ్ క్రింది భాగంలో ఓ ట్రే ఉంటుంది. ఇందులో ఏవైనా వస్తువులు ఉంచినప్పుడు అవి అటూ ఇటూ కదిలే ఆస్కారం ఉంది. అంతేకాకుండా.. వాహన పేపర్లు, విలువైన వస్తువులను స్టోర్ చేసుకోవటానికి ఇందులో సరైన స్టోరేజ్ స్పేస్ లేదు.

థర్డ్ రో ఎంట్రీ

థర్డ్ రో ఎంట్రీ

ఇది వరకు చెప్పుకున్నట్లు గానే థర్డ్ రో సీట్స్ చిన్న పిల్లలకు మాత్రమే సరిపోతుంది. ఈ సీటులోకి ప్రవేశించాలంటే, తప్పనిసరిగాతప్పనిసరిగా రెండవ వరుసలోని సీట్లను పూర్తిగా మడచాల్సి ఉంటుంది. సెకండ్ రో సీటుకు ఇరు వైపులా ఉన్న లాక్స్ రిలీజ్ చేసిన తర్వాత, ఈ సీటును ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. అదృష్టవశాత్తు ఈ సీటు తేలికగా ఉండటం వలన దీనిని ఫోల్డ్ చేయటం సులువుగానే ఉంటుంది.

రియర్ వ్యూ మిర్రర్

రియర్ వ్యూ మిర్రర్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలోని సైడ్ మిర్రర్స్ బ్లాక్ కలర్‌లో మాత్రమే లభిస్తాయి, బాడీ కలర్ ఆప్షన్ లేదు. అంతేకాకుండా, ఈ సైడ్ మిర్రర్లను కారు లోపలి వైపు నుంచి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించలేదు.

రియర్ విజిబిలిటీ

రియర్ విజిబిలిటీ

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలోని మందపాటి సి పిల్లర్స్ మరియు సన్నటి రియర్ విండ్‌షీల్డ్ కారణంగా, రియర్ విజిబిలిటీ తక్కువగా ఉంటుంది. కారును రివర్స్ చేసేటప్పుడు వెనుక వైపు ఉన్న వస్తువులు సరిగ్గా కనిపించకపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, ఈ కారుకి తప్పని సరిగా పార్కింగ్ సెన్సార్స్ లేదా పార్కింగ్ కెమెరా వంటివి అవసరం అవుతాయి.

టెయిల్ గేట్ ఎత్తు

టెయిల్ గేట్ ఎత్తు

గో ప్లస్ ఎమ్‌పివి బూట్ డోర్ ఎత్తు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. పొట్టిగా ఉండే డ్రైవర్లు పూర్తిగా తెరిచిన బూట్ డోరును యాక్సిస్ చేయటం కస్టంగా అనిపిస్తుంది.

కాన్స్

కాన్స్

చెడు:

* సేఫ్టీ ఫీచర్లు (ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్) లేకపోవటం

* బూట్ లాక్ లేకపోవటం

* నాసిరకం ప్లాస్టిక్ మెటీరియల్

* నాయిస్, వైబ్రేషన్ అండ్ హార్ష్‌నెస్ (ఎన్‌విహెచ్)

* నాన్ అడ్జస్టబల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్

* డ్రైవర్ సైడ్ మాస్టర్ పవర్ విండో కంట్రోల్స్ లేకపోవటం

ప్రోస్

ప్రోస్

మంచి:

* ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్

* విశాలమైన ఫ్రంట్ సీట్స్

* అధిక గ్రౌండ్ క్లియరెన్స్

* తక్కువ టర్నింగ్ రేడియస్

* మొబైల్ డాకింగ్ స్టేషన్

* బెటర్ మైలేజ్ (సిటీ, హైవేలపై)

చివరి మాట

చివరి మాట

ఏది ఎలా ఉన్నప్పటికీ.. భారత మార్కెట్లో డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి విజయం సాధిస్తుందా లేదా అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంది. అందులో ముఖ్యమైన ధర, ఈ మోడల్ ధరను నిర్ణయించడంలో కంపెనీ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఇది క్లిక్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇది రూ.5 లక్షల రేంజ్‌లో లభించినట్లయితే, హ్యాచ్‌బ్యాక్ కారును కొనాలనుకునే కస్టమర్లు ఈ కాంపాక్ట్ ఎమ్‌పివిని ఎంచుకునే అస్కారం ఉంటుంది.

ఏదేమైనప్పటికీ.. ఇటీవల గ్లోబల్ ఎన్‌సిపిఏపి నిర్వహించిన క్రాష్ టెస్టులో డాట్సన్ గో హ్యాచ్‌హహ్యాక్ విఫలమైన నేపథ్యంలో, ఆ ప్రభావం గో ప్లస్ ఎమ్‌పివిపై కూడా పడే అవకాశం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో గో ప్లస్ ఎమ్‌పివి, భారత కస్టమర్ల నుంచి ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
The team from Drivespark drove the latest MPV from Datsun, the Datsun GO+ in the twisty roads of Utrakand. Here is exclusive road test review Datsun Go+ MPV.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X