
డీజల్ కార్ల యజమానులకు షాకింగ్ న్యూస్.. డీజిల్ ధరల ఒక్కసారిగా అమాంతం ప్రతి లీటరుకు రూ.5 చొప్పున పెరిగిపోయింది. గడచిన 15 నెలల నుంచి డీజిల్ ధరలను పెంచకపోవటం, దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) ధరలు ఆకాశాన్నంటుతుండటంతో వేరే మార్గం లేక ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై నెట్టేసింది. ప్రస్తుతం డీజిల్ ధరల నియంత్రణ ప్రభుత్వ అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వ సబ్సిడిలకే డీజిల్‌ను విక్రయిస్తుండటం వలన చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఇదివరకెన్నడూ లేని విధంగా చమురు సంస్థలు రికార్డు స్థాయిలో ప్రతి లీటరు డీజిల్ విక్రయంపై రూ.19.26 చొప్పున నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్ ధరలను తక్షణమే పెంచాలని చమురు కంపెనీలు ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావటంతో భారత సర్కారు ఈ నిర్ణయ తీసుకుంది.
ఇది తత్కాలిక పెంపు మాత్రమే. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో డీజిల్ ధర పెట్రోల్ ధరతో సమానమైనా ఆశ్చర్య పోవాల్సిన అసరం లేదు. అధికంగా ఉన్న పెట్రోల్ ధరలు, తక్కువ మైలేజీనిచ్చే పెట్రోల్ కార్లను దృష్టిలో ఉంచుకొని కొనుగోలుదారులు ఇప్పుడిప్పుడే డీజిల్ కార్లవైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో తాజా పెంపు కొత్త కార్ల కొనుగోలుదారులపై మరింత ప్రభావాన్ని చూపే ఆస్కారం ఉంది.
అసలే అంతంత మాత్రంగా సాగుతున్న ఆటోమొబైల్ మార్కెట్‌పై కూడా తాజా పెంపు మరింత ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉంది. గడచిన ఆగస్టు నెలలో కార్ల అమ్మకాలు ఏకంగా 10 నెలల కనిష్టానికి దిగజారిన తెలిసిందే. తాజా పెంపుతో ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి డీజిల్ ధరలు రూ.45 నుంచి రూ.55 మధ్యలో ఉన్నాయి. పెరిగిన డీజిల్ ధరలు గురువారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.




















