
ఈ ఫోటోలో కనిపిస్తున్న బుజ్జి కారును చూశారా..? దీని పేరు 'మిరాయ్' (Mirai). ఇది ప్రపంచంలో కెల్లా రోడ్డుపై అత్యంత తక్కువ పరిమాణం కలిగిన కారుగా గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకుంది. జపాన్‌కు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ బుజ్జి కారుకు రూపకల్పన చేశారు.
మిరాయ్ అంటే జపనీస్ భాషలో 'భవిష్యత్తు' (ఫ్యూచర్) అని అర్థం. భవిష్యత్తులో ఇలాంటి చిన్న కార్ల ఆవశ్యకతను ప్రతిభింభించేలా, జపాన్‌లోని ఆసకుచిలో ఉన్న ఓకాయమా శాన్యో హై స్కూల్‌లోని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కారును తయారు చేశారు.
ఈ మిరాయ్ కారు ఎత్తు కేవలం 45.2 సెంటీమీటర్లు మాత్రమే. ఈ రికార్డ్ బ్రేకింగ్ కారును తయారును చేయటానికి వారికి సుమారు ఏడాదికి పైగా సమయం పట్టిందట. ఇందులో ఎక్కువ నెలలను కేవలం డిజైన్, ప్లానింగ్‌కు కేటాయించగా, కేవలం 6 నెలల్లోనే దీని ప్రొడక్షన్ వెర్షన్‌ను తయారు చేశామని విద్యార్థులు తెలిపారు.
ఈ ప్రాజెక్టులో 15-18 ఏళ్ల వయస్సు కలిగిన 12 మంది విద్యార్థులు, 9 మంది టీచర్లు పాల్గొన్నారు. ఈ చిన్న కారులో ఒక్కరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.




















