ఫోటో చూడగానే గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో బజాజ్ ఆటో ప్రదర్శించిన 'బజాజ్ ఆర్ఈ60' కాన్సెప్ట్ వాహనమే గుర్తుకు వస్తుంది. వాస్తవానికి బజాజ్ ఆటో, టాటా మోటార్స్ అందిస్తున్న చవక కారు టాటా నానోకు పోటీగా లక్షల రూపాయల ధర రేంజ్‌లో ఓ ఆల్ట్రా లో-కాస్ట్ కారును తయారు చేయాలని నిర్ణయించింది. అయితే, ఈ కారు ఉత్పాదక వ్యయం కంపెనీ ఊహించిన దాని కన్నా అధికం కావటంతో బజాజ్ ఆటో ఈ కారు తయారీకి గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ ఆల్ట్రా లో-కాస్ట్ కారు కోసం నిస్సాన్, రెనో, బజాజ్ మూడు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, బజాజ్ ఆటో ఓ చిన్న కారు తయారు చేసి ఇస్తే, నిస్సాన్-రెనో కంపెనీలు భారత్‌తో సహా గ్లోబల్ మార్కెట్లలో ఈ కారును మార్కెటింగ్ చేస్తాయి. అయితే, బజాజ్ తయారు చేసే ఈ చిన్న కారు నిస్సాన్-రెనో కంపెనీల నాణ్యత ప్రమాణాలను పాటించేలా ఉండాలి. ఈ ప్రాజెక్టులో భాగంగా, బజాజ్ ఆటో ఓ కాన్సెప్ట్ కారును రూపొందించింది. అయితే, ఈ కారును నిస్సాన్-రెనో కంపెనీలు ప్రదర్శించలేదు.
కాగా.. కంపెనీ తాజాగా రూపొందించి 'బజాజ్ ఆర్ఈ60' కాన్సెప్ట్‌ను మాత్రం కంపెనీ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రజల ముందు ఉంచింది. అయితే, ఇది లో-కాస్ట్ కారు మాత్రం కాదని, కేవలం ఫోర్ వీలర్ మాత్రమేనని కంపెనీ స్పష్టం చేసింది. ఏదేమైనప్పటికీ, బజాజ్ ఆటో ఈ ఆల్ట్రా లో-కాస్ట్ కారు ప్రాజెక్ట్ విషయంలో నిస్సాన్, రెనో కంపెనీలతో ఓ స్పష్టమైన నిర్ణయానికి రాకపోవటంతో, ఈ రెండు విదేశీ కంపెనీలు బజాజ్ ఆటోపై గుర్రుమంటున్నాయి. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగుతున్నట్లు కూడా నిస్సాన్ పేర్కొంది.
ఆల్ట్రా లో-కాస్ట్ కారు కోసం బజాజ్, నిస్సాన్, రెనో కంపెనీల మధ్య 2009లో ఈ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇది కాస్తంత కూడా ముందుకు సాగలేదు. దీంతో ఈ తాజా ప్రాజెక్ట్‌పై నిస్సాన్ కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ (ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇండియా) టోరు హసెగవా మాట్లాడుతూ.. 'లో-కాస్ట్ కారుపై బజాజ్ ఆటోతో మా భాగస్వామ్యం కొనసాగించబోవటం లేద'ని స్పష్టం చేశారు. నిస్సాన్ ఇవాలియాను మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.



































