రూ. 1 తో 17 కిలోమీటర్లు నడిచే బస్సు: ఎలా సాధ్యమైందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Written By:

గోమాతతో ఎన్ని ఉపయోగాలున్నాయో అందరికీ తెలిసిందే... ఆవు మలమూత్రాలతో అనేక లాభాలున్నాయి. ఇప్పుడు కొంత మంది శాస్త్రవేత్తలు ఆవు పేడతో మరో అవసరాన్ని తీర్చే ప్రయోగంలో విజయం సాధించారు. ఎరువు మరియు బయో గ్యాస్ ఉత్పత్తిలో కీలకంగా ఉండే పేడ ద్వారా ఉత్పత్తయిన గ్యాస్‍‌తో బస్సులకు ఇంధనంగా వినియోగించడం ప్రారంభించారు.

కలకత్తా కేంద్రంగా పనిచేసే కంపెనీ ఒకటి గోవుల పేడ ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేసి, దానిని ప్రయోగత్మకంగా బస్సులో వినియోగించి విజయం సాధించింది.

ఈ బయోగ్యాస్ తో నడిచే బస్సును రవాణా కోసం కూడా ప్రారంభించారు. భారతదేశపు మొదటి బయో గ్యాస్‌ బస్సుగా రికార్డుకెక్కిన దీనిని కలకత్తాకు ఉత్తరాన ఉన్న ఉల్టాడంగ్ మరియు కలకత్తాకు దక్షిణాన ఉన్న గరియా ప్రాంతాల మధ్య ఈ రవాణా సేవలకు అందుబాటులో ఉంచారు.

అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం, కేవలం రూ. 1 తో 17.5 కిలోమీటర్ల మేర ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవడం. ప్రస్తుతం దేశీయ ప్రజారవాణాలో అతి తక్కువ ఖర్చుతో నడిచే బస్సు ఇదే.

ప్రస్తుతం కలకత్తాలోని సిటి బస్సుల్లో కనిష్ట టికెట్ ధర రూ. 6 లు మరియు గరిష్ట టికెట్ ధర 17 కిలోమీటర్లకు గాను రూ. 12 లుగా ఉంది. అదే విధంగా ఢిల్లీలో సిఎన్‌జి ఇంధనంతో నడిచే బస్సులో నాలుగు కిలోమీటర్ల వరకు టికెట్ ధర రూ. 4 లుగా ఉంది.

బయో గ్యాస్ వినియోగించడం ద్వారా నగర బస్సు సర్వీసుల మీద మరియు ప్రయాణికుల మీద తక్కువ భారం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఫోనిక్స్ ఇండియా రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ గ్రూప్‌ దిగ్గజ భారీ వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం మేరకు, సుమారుగా రూ. 13 లక్షల రుపాయల బడ్జెట్లో ఆవు పేడ ద్వారా ఉత్పత్తయ్యే బయో గ్యాస్ వినియోగించుకునే నడిచే 54 సీటింగ్ సామర్థ్యం ఉన్న బయో బస్సుల తయారీకి అశోక్ లేలాండ్ సముఖత చూపింది.

ఈ ఏడాది ముగిసేలోపు బయో గ్యాస్ ఇంధనంతో నడిచే సుమారుగా 15 బస్సులను కలకత్తాలోని వివిధ మార్గాల్లో నడపనుంది ఈ సంస్థ. అన్ని రూట్లలో వినియోగించే బయో గ్యాస్ బస్సుల టికెట్ ధరలు ఒకేలా ఉండనున్నాయి.

బయోగ్యాస్‌ను జంతువులు మరియు మొక్కల వ్యర్థపదార్థాలతో ఉత్పత్తి చేస్తారు. నిజానికి కుళ్లిపోయిన ఈ పదార్థాలలో ఉండే గ్యాస్‌ యొక్క రసాయనిక నామం మీథేన్(CH4). విషరహిత మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది.

ఈ బయో గ్యాస్‌ని వంట గ్యాస్ రూపంలో ఉపయోగించుకోవచ్చు. మరియు దీనిని వినియోగించి విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయవచ్చు. పర్యావరణహితం మరియు శుద్దమైన ఇంధన కావటం చేత ఈ గ్యాస్‌ను ప్రజారవాణా కోసం వినియోగించే వాహనాలలో విరివిగా వాడుకోవచ్చు.

కలకత్తాలో బయో గ్యాస్‌తో నడిచే బస్సు సర్వీసును ప్రారంభించిన ఫోనిక్స్ ఇండియా రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ గ్రూప్ ఛైర్మెన్ మరియు మేనేజింగ్ జ్యోతి ప్రకాశ్ దాస్ మాట్లాడుతూ, బిర్భూమ్ జిల్లాలో ఉన్న ప్లాంటు ద్వారా ఆవు పేడను వినియోగించి బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేసి, దీనిని కలకత్తాకు ట్యాంకర్లలో తరలిస్తున్నట్లు తెలిపాడు.

ఆర్థికపరమైన విషయాలను వెల్లడిస్తూ, రూ. 20 ల ఖర్చుతో ఒక కిలో బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నాము. ఒక్క కిలో గ్యాస్ ద్వారా 5 కిలోమీటర్ల మేర బస్సు ప్రయాణిస్తుందని తెలిపాడు.

వృక్ష శాస్త్రంలో పిహెచ్‌డి చేసిన ప్రకాశ్ దాస్ సుమారుగా గత ఎనిమిదేళ్ల నుండి బయోగ్యాస్ మీద అనేక ప్రయోగాలు చేసాడు. జర్మనీ నుండి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సేకరించే పనిలో ఉన్నట్లు తెలిపాడు.

పూర్తి స్థాయిలో ఆ సాంకేతికతను అందుకుంటే ఒక్క కిలో గ్యాస్ ద్వారా 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. బస్సుల్లో 80కిలోల గ్యాస్‌ను నిల్వ ఉంచితే సుమారుగా 1600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. తద్వారా టికెట్ ధరలు భారీగా తగ్గుతాయి.

ఇక తమ బయో గ్యాస్ బస్సుల్లో పనిచేసే డ్రైవర్ మరియు కండక్టర్లకు బస్సుల మీద ప్రదర్శించే యాడ్స్ ద్వారా వేతనాలను చెల్లించనున్నట్లు పేర్కొన్నాడు.

ప్రస్తుతం కంపనీ 100 ఫ్యూయల్ పంపులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మొదటి పంపును కలకత్తాలోని ఉల్టాడంగ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఇంధనం వినియోగించడం చేత వాణిజ్యపరంగా వాహనం యొక్క జీవిత కాలం కూడా పెరుగుతుంది.

ఫోనిక్స్ సంస్థ 1,000 కిలోల బయో గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంటును కలకత్తాలోని బిర్బూమ్ జిల్లాలోని దుబ్రాజ్‌పూర్‌లో ఏర్పాటు చేసింది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #బస్సు #bus
Story first published: Monday, April 3, 2017, 15:10 [IST]
English summary
Also Read In Telugu: Cheapest Bus Fuelled By Cow Dung Biogas
Please Wait while comments are loading...

Latest Photos