100 ఏళ్లు పూర్తి చేసుకున్న డ్రైవర్ తాత, జీవనాధారం డ్రైవింగే..

By Ravi

ఈ ఫొటోలో కనిపిస్తున్న తాత పేరు చార్లెస్ మైఖేల్ డిసౌజా. ఈయన వయస్సు వందేళ్లు. వృత్తి డ్రైవర్ (ఇప్పటికీ డ్రైవర్‌గానే పనిచేస్తున్నాడు). సాధారణంగా, వయసు మళ్లిన వాళ్లు 60 ఏళ్లు దాటగానే వివిధ రకాల శారీరక ఇబ్బందులతో మంచం పడుతుండటాన్ని మనం చూస్తుంటాం. కానీ ఈ చార్లెస్ తాత మాత్రం ఇప్పటికీ, ఆరోగ్యంగా ఉంటూ తన వృత్తి ద్వారా జీవనభృతి పొందుతున్నాడు.

కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతానికి చెందిన చార్లెస్ మైఖేల్ డిసౌజా నేటితో (అక్టోబర్ 16, 2014) సరిగ్గా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ ప్రపంచంలో కెల్లా అత్యంత పురాతనమైన డ్రైవర్ కూడా ఇతనేమో. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్న చార్లెస్ తాతా ఇప్పటికీ కూడా ప్రతిరోజు తెల్లవారు జామున 4 గంటలకు నిద్రలేచి, ఇంటి పనులు చక్కదిద్దుకోవటం, వంట చేయటం మరియు తన బట్టలు తానే ఉతుక్కోవటం చేస్తుంటారు.

మంగుళూరులోని ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులకు ఆయన కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ, అలా వచ్చిన డబ్బుతో జీవితాన్ని వెల్లబుచ్చుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరంలోనే (1914వ సంవత్సరం) చార్లెస్ కూడా జన్మించారు. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చార్లెస్ బ్రిటీష్ ఇండియన్ ఆర్మీతో ఉన్నారు. తమిళనాడులోని ఊటీ (ఉదకమండలం) ప్రాంతంలో అక్టోబర్ 16, 1914వ సంవత్సరంలో జన్మించారు.

చార్లెస్ మైఖేల్ డిసౌజా తండ్రి పేరు చార్లసన్, తల్లి పేరు మేరీ. చార్లెస్ వారసత్వం మొత్తం గ్రీకు దేశానికి చెందినదని, తమ తల్లిదండ్రులు బెత్లహాం నుంచి ఇండియాకు వచ్చి స్థిరపడ్డారని చార్లెస్ చెబుతున్నారు. చార్లెస్ తల్లిండ్రులకు మొత్తం 13 మంది సంతానం. వారిలో 10వ సంతానమే ఈ చార్లెస్ మైఖేల్ డిసౌజా. ఈ 13 మందిలో ప్రస్తుతం జీవించి ఉన్నది చార్లెస్ ఒక్కరే.

Michael D Souza

చార్లెస్ 1932లో తన 18వ ఏటనే బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో చేరి ఆంధ్రప్రదేశ్, అస్సాం, కాశ్మీర్‌లలో సేవలు అందించారు. ఆ తర్వాత 1942లో ఆయన బ్రిటీష్ ఆర్మీని వదిలి పెట్టి ఫుల్‌టైమ్ డ్రైవర్‌గా మారిపోయారు. ఆ తర్వాత అతను మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1952లో డీజిల్ కాంక్రీక్ మిక్సర్ మెషీన్ డ్రైవర్‌గా మంగుళూరుకి పంపించబడ్డారు.

అనంతరం, 1956లో మంగుళూరు కర్ణాటక రాష్ట్రంలో భాగం కావటంతో, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో చార్లెస్ ఉద్యోగి అయ్యారు, 1982 వరకూ అందులో పనిచేశారు. పదవీవిరమణ పొందిన తర్వాత అతను మంగుళూరులోనే ప్రైవేట్ డ్రైవర్‌గా స్థిరపడిపోయారు. చార్లెస్ మైఖేల్ డ్రైవింగ్ లైసెన్స్ 2019 వరకూ చెల్లుబాటులో ఉంది. ఊటీలోని సెయింట్ మేరీస్ చర్చ్ ఇష్యూ చేసిన జనన ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్) ఇప్పటికీ అతని వద్దే భద్రంగా ఉంది.

చార్లెస్ తాత వద్ద ఇప్పటికీ అతని స్కూల్ సర్టిఫికెట్లు, మిలటరీ రికార్డులు, ఐడెంటిటీ కార్డులు, సీనియర్ సిటిజెన్ కార్డులు, వయో ధృవీకరణ పత్రాలు, అనేక డ్రైవింగ్ లైసెన్సులు, ప్రభుత్వ రికార్డులు మరియు అతని వయస్సుని నిర్ధారించే ఇతర డాక్యుమెంట్లు కూడా భద్రంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితమే చార్లెస్ భార్య ఎలిజా డిసౌజా మృతి చెందారు. వీరికి సంతానం లేదు.

చార్లెస్ అన్న కూతురు, మనవళ్లు/మనవరాళ్లు అప్పడప్పుడూ వచ్చి వెళ్తూ ఉంటారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి అతను ప్రతినెలా 8000 పెన్షన్ పొందుతున్నారు. ఈ వయస్సులో కూడా ఇతరులపై ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్న చార్లెస్ మైఖేల్ డిసౌజా ఏంతో మందికి స్ఫూర్తిదాయకం కానున్నాయి. మరి మన చార్లెస్ తాత ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకొని, ఆరోగ్యంగా ఉండాలని మనం కూడా కోరుకుంటూ.. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం రండి..!

Source: IBN Live

Most Read Articles

English summary
Most probably, he is the oldest driver and of course one of the oldest persons in the entire world. Charles Michael D'Souza, who will be competing 100 years on this October 16, still drives a car for a living.
Story first published: Thursday, October 16, 2014, 10:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X