టూవీలర్‌పై కేవలం రూ.5 ఖర్చుతో 180 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఎలా ఉంటుంది. ఏంటి కామెడీ చేస్తున్నారా..? అని చిరాకు పడకండి. ఇది అక్షర సత్యం. తమిళనాడు విద్యార్థుల అద్భుత సృష్టి. తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాకు చెందిన ధనలక్ష్మి శ్రీనివాసన్ ఇంజనీరిగ్ విద్యార్థులు ఓ అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేశారు.
ఈ స్కూటర్‌ను ఒక్క యూనిట్ విద్యుత్‌తో ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చని విద్యార్థులు చెబుతున్నారు. తమ కళాశాల ప్రాజెక్ట్‌లో భాగంగా, విద్యార్థులు ఈ స్కూటర్‌ను తయారు చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మొత్తం మూడు మోటర్లు ఉంటాయి. ఇందులో రెండు మోటర్లను ముందు చక్రంలో ఒక్కటి, వెనుక చక్రంలో ఒక్కటి చొప్పున అమర్చారు.
మూడవ మోటార్‌ను స్కూటర్ మధ్య భాగంలో అమర్చారు. ఇది బ్యాటరీ పవర్ ద్వారా పనిచేస్తుంది. ఛాస్సిస్‌లో అమర్చిన బ్యాటరీని ఇంటికి ఉపయోగించే విద్యుత్‌ను కేవలం ఒక్క యూనిట్ మాత్రమే చార్జ్ చేస్తే సరిపోతుంది. మిగిలిన బ్యాటరీ పవర్ ఈ స్కూటర్ దానంటత అదే తయారు చేసుకుంటుంది. ముందు వెనుక చక్రాల్లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్లు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి.
ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్ బ్యాటరీలో స్టోర్ అవుతుంది. బ్యాటరీలో స్టోర్ అయిన ఈ విద్యుత్తును స్కూటర్‌లో అమర్చిన మూడవ మోటర్ గ్రహించి స్కూటర్ నడవడంలో సహకరిస్తుంది. ఇలా ఒక మోటార్ స్కూటర్ నడవడానికి, రెండు మోటార్లు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతాయి. పెట్రోల్ ధరలు అధికంగా ఈరోజుల్లో ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వాహనాలను తయారు చేయాలనే ఉద్దేశ్యంతో తాము ఈ స్కూటర్‌ను సృష్టించామని విద్యార్థులు చెప్పారు.





















