దబాంగ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకొని, దానికి సీక్వెల్‌గా దబాంగ్ 2తో సల్మాన్ ఖాన్‌కు మరోసారి హిట్ కొట్టేందుకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు సుజుకి మోటార్‌సైకిళ్లంటే మహా క్రేజ్. ప్రస్తుతం సల్మాన్ సుజుకి మోటార్‌సైకిల్ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అందుకే, దాదాపుగా సల్మాన్ ఖాన్ నటించే అన్ని చిత్రాల్లోను సుజుకి సూపర్‌బైక్‌లు కనిపిస్తుంటాయి. సల్మాన్ లేటెస్ట్ మూవీ దబాంగ్ 2లో కూడా ఓ నలుపు రంగు సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 మోటార్‌సైకిల్‌పై సల్మాన్ కనిపిస్తాడు.
సల్మాన్ ఖాన్ నటించిన ఇటీవలి చిత్రం ఏక్ థా టైగర్‌లో కూడా ఓ సుజుకి యహబుసా బైక్‌పై కనిపిస్తాడు. సల్లు భాయ్ కేవలం బయట మాత్రమే కాకుండా, ఇలా తన చిత్రాల ద్వారా కూడా సుజుకి బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ కనిపిస్తాడు. సుజుకి మోటార్‌సైకిల్ బ్రాండ్‌కు సల్మాన్ ఖాన్ అందిస్తున్న ప్రయోజనానికి గాను, సదరు కంపెనీ ఇటీవలే ఓ నలుపు రంగు సుజుకి హయబుసా సూపర్ బైక్‌ను ఈ సూపర్ స్టార్‌కు కానుకగా ఇవ్వటం జరిగింది. సల్మాన్ ఖాన్ వద్ద ఇప్పటికే ఓ సుజుకి హయబుసా బైక్ ఇండగా, గడచిన సెప్టెంబర్ నెలలో మన హీరో మరో లిమిటెడ్ ఎడిషన్ 'సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్' సూపర్‌బైక్‌ను సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న బడ్జెట్ బైక్ 'సుజుకి హయాటే'కు సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 సూపర్‌బైక్ విషయానికి వస్తే ఇందులో శక్తివంతమైన 805సీసీ, 4-స్ట్రోక్, 2-సిలిండర్, లిక్విడ్ కూల్డ్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. సుజుకి మోటార్‌సైకిల్ దేశీయ విపణిలో మూడు రకాల ఇంట్రుడర్ మోటార్‌సైకిళ్లను ఆఫర్ చేస్తోంది. అందులో సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 తక్కువ ఇంజన్ సీసీ కలిగిన ఎంట్రీ లెవల్ మోడల్. రాష్ట్ర మార్కెట్లో దీని ధర రూ.8.8 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.













































