రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 ఎక్స్ టెస్ట్ రైడ్ రివ్యూ: బ్యాడ్ ఏంటి... బెస్ట్ ఏంటి...?

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ క్రూయిజర్ స్టైల్ మోటార్ సైకిల్. 2002లో తొలిసారిగా విడుదలైన ఈ బైకులో 350సీసీ ఇంజన్ మరియు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ ట్రాన్స్‌మిషన్ కలదు. 350 మరియు 500 ఇంజన్ ఆప్షన్లతో విడుదలైన థండర్‌బర్డ్ అనతి కాలంలో బుల్లెట్ మరియు క్లాసిక్ తరహా విజయాన్ని అందుకొంది.

ఒకానొక దశలో రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ బైకు ఎంతో మందికి స్టేటస్ సింబల్‌ అయిపోయింది. కానీ దీన్ని కొన్న తరువాతే అదనంగా లభించే మరిన్ని ఇతర ఫీచర్లను తప్పనిసరిగా కొనుగోలు చేయాలనిపిస్తుంది. లాంగ్ డ్రైవ్ మరియు సౌకర్యవంతమైన రైడింగ్‌కు వీటి అవసరం ఎంతో ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకుని విపణిలోకి సరికొత్త 2018 థండర్‌బర్డ్ ఎక్స్ 350సీసీ మరియు 500సీసీ రెండు బైకులను లాంచ్ చేసింది. వీటిలో సౌకర్యవంతమైన సీటు, అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లు, లాంగ్ రైడ్‌కు అనువైన హ్యాండిల్ బార్, అధిక స్టోరేజ్ గల ఫ్యూయల్ ట్యాంక్ మరియు పలు రకాల కలర్ ఆప్షన్‌లతో పాటు ఆధునిక రైడర్లు కోరుకునే ఎన్నో ఫీచర్లు జోడించింది.

అయితే, రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌‌బర్డ్ 500 ఎక్స్ బైకును కొన్ని రోజులు టెస్ట్ రైడ్ చేసే అవకాశం డ్రైవ్‌స్పార్క్ తెలుగుకు లభించింది. ఇవాళ్టి కథనంలో థండర్‌బర్డ్ 500 ఎక్స్ గురించి మా అభిప్రాయం ఏంటో చూద్దాం రండి...

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బరడ్ 500 ఎక్స్ తొలిచూపులోనే తన ఆల్ బ్లాక్ కలర్ పెయింట్ థీమ్‌తో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ట్యాంక్ కలర్ మినహాయిస్తే, బైకు మొత్తం బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లోనే ఉంది. కానీ అక్కడక్కడ ట్యాంక్ కలర్ సొబగులను చూడవచ్చు. థండర్డ్‌బర్డ్ 500ఎక్స్ గెట్అవే ఆరేంజ్ (రివ్యూ కోసం లభించిన బైకు) మరియు డ్రిఫ్టర్ బ్లూ రంగుల్లో లభిస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 ఎక్స్ ముందు వైపున బ్లాక్ కలగ్ ఫినిషింగ్‌లో ఉన్న టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్‌ల్యాంప్, మరియు హ్యాండిల్ బార్ మీద అదే పాత ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చింది. లాంగ్ రైడ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 20-లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ అందివ్వడం జరిగింది. అయితే, స్విచ్చుల నాణ్యత ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాధారణ థండర్‌బర్డ్ బైకుల్లో ఉన్నటువంటి పక్కకు వంగి ఉండే హ్యాండిల్ బార్ కాకుండా, సమాంతరంగా మరియు బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో ఉన్న హ్యాండిల్ వచ్చింది. రైడర్ అత్యంత సౌకర్యవతంగా మరియు నిటారుగా కూర్చొని రైడ్ చేయవచ్చు.

మరో కీలకమైన అంశం, సీటు. అవును థండర్‌బర్డ్ బైకుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ మొదటిసారి నాణ్యతతో కూడిన మెటీరియల్‌తో సీటును నిర్మించింది. మెత్తాగా మరియు అత్యంత సౌకర్యవంతమైన సీటు రైడర్ మరియు పిలియన్ రైడర్ ఇద్దరికీ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని కల్పిస్తుంది. కానీ ఇందులో బ్యాక్ రెస్ట్‌ను మాత్రం అదనపు ఫీచర్‌గా ఎంచుకోవాల్సి వస్తుంది.

సాంకేతికంగా రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 ఎక్స్ మోడ్రన్ క్రూయిజర్ బైకులో 499సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 27బిహెచ్‌పి పవర్ మరియు 41ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ట్రాఫిక్‌లో ఉన్నపుడు ఇంజన్ ప్రొడ్యూస్ చేసే టార్క్ బైకు బరువును లెక్కచేయకుండా ఎంతో స్మూత్‌గా ఇతర వాహనాలను అధిగమిస్తుంది మరియు రైడింగ్ చేస్తున్నపుడు బైక్ వేగం తగ్గుతూ... మరియు పెరుగుతూ ఉంటుంది, ఇలాంటి సందర్భాల్లో గేర్‌ తగ్గించాల్సిన అవసరం అస్సలు రాకపోవడం గమనార్హం.

థండర్‌బర్డ్ ఎక్స్ సిరీస్‌లోని రెండు బైకులు అద్భుతమైన పనితీరును కనబరుస్తాయి. వీటి బరువు కూడా 197కిలోలుగా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 ఎక్స్ గంటకు 90కిలోమీటర్ల వరకు చాలా స్మూత్‌గా వెళుతుంది, కానీ అంతకు మించిన వేగంతో వెళితో హ్యాండిల్ బార్ మరియు ఫుట్ పెడల్స్ నుండి శరీరాన్ని చేరే వైబ్రేషన్స్ రైడింగ్ మీద విరక్తి కలిగిస్తుంది.

రాయల్ ఎఫీల్డ్ మొట్టమొదటిసారిగా అల్లాయ్ వీల్స్ మరియు ట్యూబ్ లెస్ టైర్లను ప్రవేశపెట్టింది. ఏదేమైనప్పటికీ టైర్లను అవే మునుపటి ముందువైపున 19-అంగుళాలు మరియు వెనుక వైపున 18-అంగుళాల కొలతల్లో అందివ్వడం జరిగింది. సస్పెన్షన్ సిస్టమ్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

థండర్‌బర్డ్ 500 ఎక్స్ బైకులో ముందు వైపున బరువు పెద్దగా లేకపోవడంతో మలుపుల్లో చాలా సునాయసంగా అధిగమించవచ్చు. పదునైన మలుపుల్లో ఫుట్ పెడల్స్ నేలను తాకేలా బైకును వంచి మరీ రైడ్ చేయవచ్చు. ఇలాంటి అవకాశం దాదాపు స్పోర్ట్స్ బైకుల్లో మాత్రమే ఉంటుంది.

స్టాప్-అండ్-గో ట్రాఫిక్‌లో ఇంజన్ హీట్ కాస్త ఎక్కువగా ఉంటుంది, అయితే రైడింగ్ షూస్, గ్లోవ్స్, జాకెట్ మరియు హెల్మెట్ ధరిస్తే ఇంజన్ వేడి మన వరకు చేరదు మరియు అత్యంత సురక్షితంగా రైడ్ చేయవచ్చు. టెస్ట్ రైడ్ చేస్తున్నపుడు ఇది లీటరుకు 27కిలోమీటర్ల మైలేజ్‌నిచ్చింది.

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

మోడ్రన్ క్రూయిజర్ బైక్ సెగ్మెంట్లో ఉన్న అత్యాధునిక మోటార్ సైకిల్ థండర్‌బర్డ్ 500 ఎక్స్. దీని ప్రారంభ ధర రూ. 1.98 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. మరియు సాధారణ థండర్‌బర్డ్ కంటే దీని ధర రూ. 8,000 అధికంగా ఉంది. ఈ ధరల శ్రేణిలో రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 ఎక్స్ మెరుగైన ఎంపికనేది మా అభిప్రాయం!

Read more...