10,000 సీఎన్జీ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన కేంద్రం

దేశవ్యాప్తంగా రానున్న పదేళ్లలో 10,000 సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (SIAM) 58వ వార్షిక సమావేశంలో పాల్గొన్న ధర్మేంద్ర 2030 లోపు దేశవ్యాప్తంగా నూతన ఇంధన స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాడు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1424 సీఎన్జీ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. సుమారుగా 30 లక్షల సీఎన్జీతో నడిచే వాహనాలకు ఈ స్టేషన్లు సేవలందిస్తున్నాయి. చాలా వరకు కార్ల తయారీ సంస్థలు తమ చిన్న చిన్న కార్లను సీఎన్జీ ఇంధన వేరియంట్లలో ప్రవేశపెట్టాయి. తక్కువ ధర మరియు అతి తక్కువ ఉద్గారాలు ఈ వాహనాల ప్రత్యేకత.

అంతే కాకుండా, దేశీయంగా రెండు అతి పెద్ద అద్దె కార్ల నిర్వహణా సంస్థలైన ఉబెర్ మరియు ఓలా ఉపయోగిస్తున్న కార్లలోచాలా వరకు సీఎన్జీ ఇంజన్‌లే ఉన్నాయి. పెట్రోల్‌తో పోల్చుకుంటే సీఎన్జీ ఎంతో చౌకైన ఇంధనం. పర్యావరణానికి మేలు కలిగిస్తూనే... అత్యుత్తమ మైలేజ్ కూడా ఇస్తాయి.

ఇటీవల కాలంలో సీఎన్జీ వాహనాలకు డిమాండ్ అధికమవుతోంది, వీటి సేల్స్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. అయితే, దేశవ్యాప్తంగా సీఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్ల కొరత ఎక్కువగా ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న సీఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్లో వాహనాలు బారులు తీరుతున్నాయి.

భారత్‌లో రోజూ మారే ఇంధన ధరల విధానం అమల్లోకి రావడంతో పెట్రోల్ మరియు డీజల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశీయంగా ఇంధన ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు పెట్రోల్ మరియు డీజల్ వాహనాలకు బదులుగా సీఎన్జీ వాహనాలను ఎంచుకుంటున్నారు.

పెట్రోల్ లేదా డీజల్ ఇంజన్‌లతో పోల్చుకుంటే అంతే సామర్థ్యం ఉన్న సీఎన్జీ ఇంజన్‌లు 30 శాతం వరకు తక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తాయి. సీఎన్జీ ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు మరియు దీనిని దేశీయంగానే ఉత్పత్తి చేయవచ్చు. కాబట్టి, భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపదు.

ప్రస్తుతం, మారుతి సుజుకి మరియు హ్యుందాయ్ కంపెనీలు సీఎన్జీ వాహనాల తయారీలో కీలక సంస్థలుగా రాణిస్తున్నాయి. మిగతా వాహన తయారీ సంస్థలు కూడా ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను తయారు చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాహన తయారీ సంస్థలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు.

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

దేశవ్యాప్తంగా సీఎన్జీ ఇంధన స్టేషన్లను విసృతంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సీఎన్జీ వాహనాలను ఉపయోగిస్తున్న మరియు అద్దె కార్లను నిర్వహణ సంస్థలకు ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు. శిలాజ ఇంధనాల ధరలు పెరగడం మరియు వాటి వినియోగం పర్యావరణ మీద తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read more...