ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ విడుదలకు ఏర్పాట్లు ముమ్మరం

ఫోర్డ్ ఇండియా విపణిలోకి సరికొత్త 2018 ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా అందిన సమాచారం మేరకు, అక్టోబరు 04, 2018 న పూర్తి స్థాయిలో దేశీయంగా లాంచ్ చేసే అవకాశం ఉంది.

ట్యాక్సీ మరియు అద్దె కార్ల నిర్వహణ సంస్థల కోసం ఫోర్డ్ ఆస్పైర్ మోడల్‌ను సీఎన్జీ వేరియంట్లో కూడా ప్రవేశపెడుతున్నట్లు సమాచారం. ఫోర్డ్ గతంలో ఆస్పైర్ సీఎన్జీ మోడల్‌ను పలు మార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. మరియు ఫోర్డ్ ఇండియా యొక్క మొట్టమొదటి సీఎన్జీ వేరియంట్ కూడా ఇదే కానుంది.

డిజైన్ పరంగా ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్‌లో రీడిజైన్ చేయబడిన బంపర్, క్రోమ్ సొబగులు గల సరికొత్త హనీకాంబ్ గ్రిల్, అధునాతన స్వెప్ట్ బ్యాక్‌ హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. అప్‌డేటెడ్ ఆస్పైర్ సెడాన్‌లో నూతన ఫాగ్‌ల్యాంప్స్ మరియు ఎయిర్ ఇంటేకర్ ఉన్నాయి. మొత్తం మీద ఫ్రంట్ డిజైన్‌కు ఫ్రెష్ లుక్ తీసుకొచ్చారు.

ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ సైడ్ డిజైన్‌లో సరికొత్త అల్లాయ్ వీల్స్ గమనించవచ్చు. రియర్ డిజైన్‌లో కొద్దిగా రీడిజైన్ చేసిన టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మరియు స్వల్ప మార్పులు చోటు చేసుకున్న బంపర్ కలదు. ఎక్ట్సీరియర్ పరంగా చోటు చేసుకున్న మార్పులు పరిశీలిస్తే ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ మునుపటి మోడల్ కంటే స్పోర్టివ్ శైలిని కలిగి ఉంది.

ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ మొత్తాన్ని ఇకోస్పోర్ట్ మరియు ఫ్రీస్టైల్ మోడళ్ల ప్రేరణతో రూపొందించారు. నలుపు మరియు గోధుమ వర్ణం గల డ్యూయల్-టోన్ థీమ్ ట్రీట్‌మెంట్ కలదు. కానీ డ్యాష్‌బోర్డ్ ఓవరాల్ డిజైన్ మునుపటి మోడల్‌నే పోలి ఉంటుంది. అంతే కాకుండా ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది.

సాంకేతికంగా ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ అత్యాధునిక 1.2-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో వస్తోంది. అంతే కాకుండా గతంలో ఉన్నటువంటి 1.2-లీటర్ సీఎన్జీ యూనిట్‌‍ను ఆస్పైర్‌లో అందించే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ పరంగా 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ కాంపాక్ట్ సెడాన్ మార్కెట్లో ఉన్న మారుతి డిజైర్, ఇటీవల విడుదలైన సెకండ్ జనరేషన్ హోండా అమేజ్ మరియు హ్యుందాయ్ ఎక్సెంట్ వంటి మోడళ్లకు సరాసరి పోటీనివ్వనుంది.

తెలుగు డ్రైవ్‌‌స్పార్క్ అభిప్రాయం!

ఫోర్డ్ ఇండియా తమ ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ ఏడాది పండుగ సీజన్ ప్రారంభమయ్యే నాటికి పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది.

Read More About: ford ఫోర్డ్

Read more...