ఆటోమేటిక్ కార్ల సామ్రాజ్యంలో మారుతి ఏకఛత్రాధిపత్యం

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పుడు ఇండియాలో ఆటోమేటిక్ కార్లను అత్యధికంగా విక్రయించిన సంస్థగా మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశపు అగ్రగామి దిగ్గజం మారుతి ప్రతి నెలా గరిష్ట విక్రయాలు జరుపుతోంది. నెల నెలా విడుదలయ్యే ప్యాసింజర్ కార్ల సేల్స్ విషయంలో ఈ విషయం బయపడుతోంది.

ఒక్కో మోడల్ వారీగా చూసుకుంటే తొలి మూడు స్థానాల్లో మారుతి సుజకి కార్లే ఉన్నాయి. బహుశా ఇదే కారణం వలన కావచ్చు, భారత్‌లో ఆటోమేటిక్ కార్ల మార్కెట్లో కూడా మారుతి కార్లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. పట్టణాలలో అత్యంత సరసమైన ఆటోమేటిక్ కార్లకు ఎక్కువగా ఆదరణ లభిస్తోంది.

తాజాగా విడుదలైన గణాంకాల మేరకు, గడిచిన నాలుగేళ్లలో మారుతి సుజుకి 3,60,000 ఆటోమేటిక్ కార్లను విక్రయించింది. ఈ నేపథ్యంలో సీవీటీ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ కార్లు అయినటువంటి సరికొత్త సియాజ్ మరియు బాలెనో మోడళ్ల విక్రయాలు 10 శాతంగా నమోదయ్యాయి. అంటే సీవీటీ విక్రయాలు ఏఎమ్‌టి మోడళ్ల కంటే తక్కువగానే ఉన్నాయి.

మారుతి సుజుకి మొత్తం విక్రయాల్లో ఆటోమేటిక్ కార్ల వాటా 20 శాతానికి పైగా ఉంది. మారుతి సుజుకి సరిగ్గా 2014లో సెలెరియో ఏఎమ్‌టి మోడల్‌తో దేశీయంగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టింది. భారతీయులకు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పరిచయం చేసిన మొట్టమొదటి సంస్థ మారుతి సుజుకి. అప్పట్లో ఆ ధరల శ్రేణిలో మరే ఇతర కంపెనీ కూడా ఏఎమ్‌టి గేర్‌బాక్స్ అందివ్వలేకపోయింది.

మారుతి సుజుకి ఉపయోగించే ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ (AMT)ను ఆటో గేర్ షిఫ్ట్‌ (AGS) అని పిలుస్తోంది. న్యూ డిజైర్, న్యూ స్విఫ్ట్ మరియు వితారా బ్రిజా కార్లతో పాటు ఇంకా ఎన్నో మోడళ్లలో ఏజిఎస్ గేర్‌బాక్స్ అందిస్తోంది. మైలేజ్ విషయంలో ఏ మాత్రం రాజీపడకుంగా స్మూత్ గేర్‌ షిఫ్ట్ మరియు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

మారుతి సుజుకి ఇండియా లైనప్‌లో ప్రస్తుతం న్యూ డిజైర్ అత్యధిక విక్రయాలు సాధిస్తోంది. వీటిలో అత్యధిక వాటా ఆటోమేటిక్ వేరియంట్లదే. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్లలో ఏఎమ్‌టి అందిస్తోంది. మరియు మొత్తం ఏడు కార్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందిస్తోంది.

మారుతి సుజుకినే కాదు ఇప్పుడు చాలా వరకు ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందిస్తున్నాయి. రెనో క్విడ్ మరియు టాటా నెక్సాన్ వంటి ఏఎమ్‌టి వేరియంట్లు మంచి విజయాన్ని అందుకున్నాయి.

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

పలు రకాల అధ్యయనాలు మరియు కస్టమర్ల అనుభవాల మేరకు, పట్టణీకరమైన పెరగడంతో నగర ప్రజలు ప్రతి రోజూ ఎక్కువ సేపు ట్రాఫిక్‌లో నిలిచిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి కారులో గేర్‌బాక్స్ లేకుండా కేవలం బ్రేక్ పెడల్ మరియు యాక్సిలరేషన్ మాత్రమే ఉంటే బాగుండు అనుకుంటారు. ఈ అసరాన్ని దృష్టిలో ఉంచుకుని మారుతి దాదాపు అన్ని స్మాల్ కార్లలో ఏఎమ్‌టి పరిచయం చేసింది. దీంతో మారుతి సుజుకి ఆటోమేటిక్ కార్ల మార్కెట్లో అత్యంత నమ్మదగిన మరియు విశ్వసించదగ్గ కంపెనీగా స్థానం సంపాదించుకుంది.

Read more...