ప్రత్యామ్నాయ ఇంధనాలకు భారత ప్రభుత్వ ప్రోత్సాహం

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇథనాల్‌తో సహా పలు ప్రత్యామ్నాయ ఇంధాలను విసృతంగా ప్రోత్సహించాలని భావిస్తోంది. పర్యావరణ కాలుష్యం మరియు ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోతుండటంతో పర్యావరణ సమతుల్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వాతావరణ కాలుష్యం పెచ్చుమీరిపోయింది. పరిశ్రమలు మరియు వాహనాల కారణంగా మానవ మనుగడకు ప్రాథమిక వనరు అయిన గాలి నాణ్యత దారుణంగా క్రిందకు పడిపోయింది. విపరీతమైన గాలి కాలుష్యం భవిష్యత్తులో నగర జనజీవనం మీద తీవ్ర దుష్ఫలితాలు చూపే అవకాశం ఉంది.

అయితే, ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించడం ద్వారా వాహనాల ద్వారా గాలి కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించలేకపోయినప్పటికీ, అవి వెదజల్లే ఉద్గారాలు కొద్ది మేరకు తగ్గుముఖం పడతాయి. అంతే కాకుండా, ఇలాంటి ఇంధనాల ఉత్పత్తి వాతావరణం మీద ఎలాంటి ప్రభావం చూపదు.

58వ ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ACMA) కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఇథనాల్ మరియు ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంధన సమస్యలకు "ఇథనాల్" చక్కటి పరిష్కారం అని పేర్కొన్నాడు.

తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో చక్కెర ఉత్పత్తి 60 లక్షల టన్నుల మిగులు ఉంది మరియు భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో, ప్రభుత్వం ఇథనాల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి చక్కర ఉత్పత్తి చేసే చెరకును ప్రాసెస్ చేసేందుకు మరింత దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అంతే కాకుండా, చెరకు నుండి వచ్చే రసం ద్వారా సరాసరిగా ఇథానాల్ ఉత్పత్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అధిక మొత్తంలో ఇకో-ఫ్రెండ్లీ ఇంజన్‌లను ఉత్పత్తి చేయాలని 58 వ ACMA కార్యక్రమంలో పాల్గొన్న దిగ్గజ కార్ల తయారీ సంస్థల ప్రతినిధులకు నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు.

మరో పక్కన బయో ఇథనాల్ ఉత్పత్తి చేసేందుకు పత్తి మొక్కల కొమ్మలు, గోధుమలు లేదా బియ్యాన్ని ఉపయోగిస్తున్నారు. బయోమాస్ నుండి ఇథనాల్ ఉత్పత్తి చేసేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ పలు అధ్యయనాలు నిర్వహిస్తోంది. ప్రత్యామ్నాయ ఇంధనాలు విజయం సాధిస్తే, సాధారణ ఇంధనాల కంటే వీటి ఉత్పత్తి ఖర్చు మరియు తుది ధరలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

Read more...