సీతయ్యను మింగేసిన తప్పిదాలు ఇవే: కొడుకు చేసిన పొరబాట్లే తండ్రి కూడా...!!

'తెలుగు భాషా దినోత్సవం' రోజునే తెలుగు జాతి గర్వించదగ్గ మరో తెలుగు నేత అస్తమించాడు. సినీ మరియు రాజకీయ జీవితంలో ప్రత్యేక ముద్ర వేసుకున్న నందమూరి హరికృష్ణ(61) ఈ రోజు (బుధవారం) తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న తప్పిదాలు నందమూరి కుటుంబానికి తీరని లోటును మిగిల్చాయి.

కొడుకు విషయంలో జరిగిన తప్పిదాలే హరికృష్ణ గారి విషయంలో కూడా పునరావృతమయ్యాయి. నందమూరి కుటుంబంలో హరికృష్ణ మరియు తన తనయుడు జానకిరామ్ మృతికి గల కారణాలేంటో తెలుసుకుందాం రండి...

నెల్లూరులో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుండి మరో ఇద్దరితో కలిసి AP28 BW 2323 నెంబర్ వాహనంలో బయలుదేరిన హరికృష్ణ నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద జాతీయ రహదారి మీద ఘోర ప్రమాదానికి గురయ్యింది.

ప్రమాదం జరిగినపుడు హరికృష్ణ కారును నడుపుతున్నట్లు తెలిసింది. భారీ వేగంతో ఉన్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం డివైడర్‌‌ను తాకుతూ పక్క మార్గంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది.

వాహనాన్ని నడుపుతున్న హరికృష్ణ సీటు బెల్ట్ కూడా ధరించలేదని తెలిసింది. దీంతో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో కారులో ఉన్న హరికృష్ణ సుమారుగా 30 అడుగుల మేర ఎగిరిపడ్డారు.

తీవ్రగాయాలైన హరికృష్ణను స్థానికులు వెంటనే సమీపంలోని నార్కెట్ పల్లిలో ఉన్న కామినేని ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలై, రక్తస్రావం అధికమవ్వడంతో పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు. అదే కారులో ప్రయాణించిన మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

తన ఆడియో ఫంక్షన్‌కు వచ్చే అభిమానులకు తన అన్న విషయంలో జరిగిన తప్పిదం ఎవ్వరి విషయంలో జరగకూడదని జాగ్రత్తగా, సురక్షితంగా వెళ్లండి అని సూచించే జూనియర్ ఎన్టీఆర్‌ తన తండ్రి విషయంలో ఇదే జరగడంతో యావత్ ప్రజానీకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

నందమూరి హరికృష్ణ మరియు ఆయన తనయుడు జానకిరామ్ రెండు ప్రమాదాలు కూడా మితిమీరిన వేగంతో ప్రయాణించడం ద్వారా జరిగినవే. అధిక వేగంతో ప్రయాణిస్తున్నపుడు అనుకోని అవరోధం ఎదురైనప్పుడు స్పందించేందుకు చాలా తక్కువ సమయం ఉంటుంది. కానీ, ఇద్దరి విషయంలోనూ ఇదే తప్పిదం జరిగింది.

రెండవది సీట్ బెల్ట్, ఎలాంటి చిన్న కార్లలోనైనా సీట్ బెల్ట్ తప్పనిసరిగా వస్తోంది. 100కు పైగా వేగంతో ప్రయాణించే శక్తివంతమైన వాహనాల్లో ప్రయాణిస్తున్నపుడు సీల్ట్ బెల్ట్ ధరిస్తే ప్రమాద తీవ్రత దాదాపు తక్కువగా ఉంటుంది.

హరికృష్ణ ప్రయాణిస్తున్నపుడు సీట్ బెల్ట్ ధరించి ఉంటే సురక్షితంగా బయటపడే అవకాశం ఉండేది. ఆయన గాల్లోకి ఎగిరిపడటంతో తలకు తీవ్ర గాయాలై కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరణించారు.

హరికృష్ణ గారు ప్రయాణిస్తూ, ప్రమాదానికి గురైన వాహనం టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ విక్రయిస్తున్న ఫార్చ్యూనర్. 2013 మోడల్‌కు చెందిన ఫార్చ్యూనర్‌లో వి3.0 డీజల్ ఇంజన్ కలదు.

భద్రత పరంగా ఇది సురక్షితమైన వాహనమే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న దిగ్గజ రాజకీయ నాయకులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు పలు ప్రభుత్వ అధికారులు ఈ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. ఇండియాలో రాజకీయ నాయకుల ఫేవరెట్ వెహికల్ కూడా ఇదే.

నందమూరి హరికృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశ్రునయనాలతో ఆశిద్ధాం...

Read more...