హైదరాబాద్: ఇక నుంచి ప్రతి సంవత్సరం మే నెలలో హైదరాబాద్ లోని హైటెక్స్‌లో వాహన ప్రదర్శనను ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. గత నాలుగు రోజులుగా హైటెక్స్ లో జరిగిన 'ఆటో షో సౌత్ 2010' ఆదివారంతో ముగిసింది. ఈ ప్రదర్శనలో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన పలు రకాల బైకులు, కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్రైవింగ్ భద్రతపై నిర్వహించిన కార్యక్రమాలకు మంచి స్పందన లభించింది.
తాము ఊహించని రీతిలో వచ్చిన స్పందన..వచ్చే ఏడాది ప్రదర్శనకు ఊతం ఇచ్చిందని నిర్వాహకులు చెప్పారు. మొత్తం దాదాపు 50,000 మంది సందర్శకులు విచ్చేసి ప్రదర్శనను తిలకించినట్లు, ఆదివారం ఒక్క రోజే 15,000 మంది దాకా తరలివచ్చినట్లు వారు వివరించారు. ప్రదర్శనకు సంబంధించి సోమవారం ఓ ప్రకటనను విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.