ప్రపంచ అతి పెద్ద ఆటోగా అవతరించిన ఢిల్లీ ఆటో షో రివ్యూ..!

ఆటో షోలో ప్రదర్శనకు వచ్చిన చిన్న కార్లలో ప్రధానమైనవి వోక్స్ వ్యాగన్ రూపొందించిన చిన్న కారు పోలో కాంపాక్ట్. దీంతో పాటు పోలో సేదన్ వెర్షన్ ను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. హమ్మర్ వంటి భారీ కార్లను రూపొందించిన జనరల్ మోటార్స్ తన రూటు మార్చుకొని రూపొందించిన చిన్న కారు బీట్ ఈ ఆటో షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వీటితో పాటు ఫోర్డ్ సంస్థ రూపొందించిన చిన్న కారు ఫిగో, భారతీయ ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ రూపొందించనున్న చిన్న కారు సందర్శకుల్లో ఆశక్తిని పెంచాయి. టయోటా, హోండా, సుజుకి, జనరల్ మోటార్స్, ఫోర్డ్, వోక్స్ వ్యాగన్ ఇలా అన్ని అంతర్జాతీయ కంపెనీలు చిన్న కార్ల పాటే పాడాయి.
ఇక గత దశాబ్దంలో ఎలక్ట్రిక్ కార్లను మొహం చిట్లించిన కంపెనీలు ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా ఎలక్ట్రిక్ కార్లను రూపొందించేందుకు ఆశక్తిని చూపించాయి. హుందాయ్ మోటార్స్ సంస్థ బహుళజనాదరణ పొందిన i10 కారుకు సంబంధించి ఎలక్ట్రికి వెర్షన్ కారును విడుదల చేసింది.
మారుతీ సుజుకి విషయానికి వస్తే ఈ ఆటో షోలో ఈ కంపెనీ మారుతీ ఆర్-3 మరియు మారుతు కిజాషి వాహనాలను తొలిరోజే ప్రదర్శనకు తీసుకువచ్చింది. ఇందులో కిజాషీ వీక్షకులను విశేషంగా కట్టకుంది. ఆ తర్వాత విడుదల చేసిన మల్టీపర్పస్ వెహికల్ మారుతీ ఈకొ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఈ మల్టీ పర్పస్ కారు ధర 2.59 నుండీ 2.89 లక్షల మధ్యలో నిర్ణయించారు. ఆ తర్వాత టయోటా కంపెనీ ను భారతదేశం కోసమే ప్రత్యేకంగా రూపొందించిది. టయోటా ఎతియోస్ పేరుతో విడుదలవున్న ఈ కారు 2011 లోమార్కెట్లోకి విడుదల కానుంది.
గత ఏడాది జరిగిన ఢిల్లీ ఆటో షోలో టాటా మోటార్స్ బుల్లి కారు 'నానో'తో అందరి దృష్టినీ ఆకర్షించింది. 'నానో'తో గత ఏడాది అందరి దృష్టిని ఆకర్షించిన టాటా మోటార్స్ ఈ ఏడాది ఆటో షోలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న టాటా ఇండీక్రూజ్ తో పాటుగా, సరికొత్త మల్టీ పర్పస్ వెహికల్ టాటా అరియాను ప్రదర్శనకు తీసుకువచ్చింది. ఈ మోడల్ తో పాటు టాటా మోటార్స్ టాటా వెన్చర్, టాటా మ్యాజిక్ ఐరిస్ అనే మరో రెండు మోడళ్లను కూడా ప్రదర్శనకు తీసుకువచ్చింది.
2010 ఆటో షోలో మరో విశేషం ఈ ఏడాది మునుపెన్నడూ లేనివిధంగా ఆటో షోలో తారలు సందడి చేసారు. ఆటో షోలో ప్రదర్శితమవుతున్న సరికొత్త కార్ల తలుకులకు ఈ తారల బెలుకులు తోడవడంతో ఆటో షో శోభాయమానంగా వెలిగిపోయింది. ఆటో షో మొదలయిన తొలి రోజు (జనవరి 5న) బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ అతని కుమార్తె, వర్థమాన నటి సోనమ్ కపూర్ ఆడీ సరికొత్త కారును విడుదల చెయ్యడానికి ఈ ఆటో షోకు విచ్చేసారు. ఆ తర్వాత అదే రోజున బాలీవుడ్ సెక్సీ హీరో జాన్ అబ్రహం తనకు బైకుల మీదున్న మోజును చాటుకుంటూ ఓ యమహా సరికొత్త R1 బైకును విడుదల చెయ్యడానికి ప్రగతి మైదాన్ కు విచ్చేసి సందడి చేసాడు.
ఇక రెండవ రోజున బాలీవుడ్ సూపర్ స్టార్ బాద్షా షారూఖ్ ఖాన్ తను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న హుందాయ్ మోటార్స్ i10 ఎలక్ట్రిక్ వెర్షన్ కారును ఆవిష్కరించడానికి ప్రగతి మైదాన్ కు విచ్చేసాడు. కాగా 2007 లో జరిగిన ఆటో షోలో షారుఖే i10 కారును ఆవిష్కరించారు. ఇప్పుడదే కారు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా షారూఖ్ విడుదల చెయ్యడం గమనార్హం.
బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ బిపాషా బసు మెర్సిడెస్ సంస్థకు చెందిన సరికొత్త కారును ఆవిష్కరించడానికి ఆటో షోని సందర్శించగా, మరో నటుడు వివేక్ ఒబెరాయ్ దిలీప్ ఛబ్రియాస్ రూపొందించిన ఇంపిరేటర్ కారును ఆవిష్కరించడానికి ఆటో షోకు వచ్చి వీక్షకులను ఆకర్షించాడు. బాలీవుడ్ నటులకు తనేమీ తీసిపోనని మాజీ క్రికెటర్ కెప్టెన్ సౌరబ్ గంగూలీ కూడా గత బుధవారం రోజున కోల్ కతా కేంద్రంగా పనిచేస్తున్న విబ్జియార్ వెహికల్స్ వారి బైకులను ఆవిష్కరించేందుకు ఆటో షోను సందర్శించి పలువురిని ఆకర్షించాడు.
మొదలవడానికి ముందు ఇది ప్రపంచంలో రెండవ అత్యుత్తమ ఆటో షోగా నిలుస్తుందని భావించిన పరిశీలకులు అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ఆటోషో ప్రపంచంలోనే అతి పెద్ద ఆటో షోగా నిలిచింది. ఈ ఆటో షోను సుమారు 2 మిలియన్(20 లక్షలు) మంది సందర్శించారని సమాచారం. ఆటో షోల చరిత్రలో ఈ రేంజిలో మరే ఆటోషో కూడా వీక్షకులను ఆకర్షించలేక పోయింది. ఈ ఆటో షోలో మొత్తంగా 25 కొత్త వాహనాలు విడుదలయ్యాయి. 1986 లో మొదలయిన ఈ ఆటో షో ప్రతి సంవత్సరానికీ తన సామర్థ్యాలను పెంచుకుంటూపోతూ ఈ ఘనతను సాధించింది. తొమ్మింది, పది రోజుల పాటు జరిగే షాంఘై, న్యూయార్క్ ఆటో షోలు సైతం ఆకర్షించలేనంత మంది సందర్శకులను, ఏడు రోజుల పాటు జరిగిన ఈ ఆటో షో ఆకర్షించి మొత్తంగా 20 లక్షల పైచిలుకు సందర్శకులను ఆకర్షించడం గమనార్హం.
ఇన్ని విశేషాల మధ్య ఓ చేదు గుళికలాగా అక్కడి అరకొర ఏర్పాట్లు పాటిసిపేట్ చేసిన కంపెనీల పాలిట శాపంగా పరిణమించాయి. జనసందోహాన్ని అదుపు చేసేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడం ఇక్కడ ప్రధాన లోపంగా కనిపించింది. జపాన్ కంపెనీకి చెందిన ఓ ప్రముఖ కంపెనీ కి సంబంధిత వ్యక్తి ఈ ఆటో షో ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ "ఇక్కడి వసతులు ఏమీ బాగోలేవు, చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఏం చెయ్యగలం భారత్ లో ఆటోమొబైల్ రంగానికి మంచి మార్కెట్ వుంది. దాన్ని అనుకూలంగా మార్చుకోవాలంటే ఇలాంటి ఇబ్బందులు పడక తప్పదు." అంటూ ఆవేదనను వ్యక్తం చేసారు. ఈ ఒక్క వ్యాఖ్య చాలు అక్కడి పరిస్థితులు ఏ విధంగా వున్నాయో అర్థం చేసుకోవడానికి.
ఇంత పెద్ద షోలో ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు మామూలే అని సరిపెట్టుకున్నా... ఈ అనుభవాలతో గుణపాఠం తెచ్చుకొని మరో సారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కానీకుండా చూసుకుంటారని ఆశిద్దాం...!!


Click it and Unblock the Notifications








