అరకొర సదుపాయాలతో ఇబ్బందుల నడుము ప్రపంచ అతి 'పేద్ద' ఆటో షో..!!

కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(సిఐఎయం) మరియు ఆటోమొటివ్ కాంపొనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎసియంఎ) లు కలసి సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆటో షోను ఏర్పాటు చేసిన ప్రగతి మైదాన్ ను ఓ సారి పరిశీలిస్తే అందులో ప్రతీ చదరపు అడుగును పాటిసిపెంట్ కంపెనీలు కొన్ని లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నాయి. భారత్ లో పెరిగిన ఆటోమొబైల్ అమ్మకాలను దృష్టిలో వుంచుకోని ప్రతీ కంపెనీ ఈ ఆటో షోలో తనదైన ముద్ర వెయ్యాలని భావించాయి. దీంతో నిర్వాహకులు సందర్శకులను దృష్టిలో వుంచుకోకుండా కనిపించిన ప్రతి ఖాళీ ప్రదేశాన్ని కంపెనీలకు అంటగట్టేసాయి. మరి ఈ ఆటో ఏర్పాటు చేసిందే సందర్శకుల వీక్షణ కోసమాయె..! వారు తిరిగడానికి, వాహనాలను తిలకించడానికి స్థలమెక్కడిది...?? ఈ ప్రశ్నలకు నిర్వాహకుల వద్ద కూడా సమాధానం వుండదు. అందుకే పాటిసిపెంట్ కంపేనీలే తాము సొంతం చేసుకున్న కొంత స్థలాన్ని సందర్శకుల కోసం త్యాగం చేసారు.
సందర్శకుల సంగతి అటుంచితే అన్ని లక్షలు పోసి స్థలాన్ని సొంతం చేసుకున్న కంపెనీల వసతులన్నా బాగున్నాయా అంటే అదీ లేదు. ఎప్పుడూ గంభీరంగా వుండే కంపెనీల సిఈవో లు, ఎండీ లు తమకు కేటాయించిన స్థానాన్ని చేరుకోవడానికి జనాన్ని తప్పుకుంటూ వెళ్లడానికి ఓ చిన్న సైజు యుద్ధమే చేయాల్సి వచ్చింది. అదేంటి వారి కోసం ప్రత్యేక ఎంట్రీలు వుంటాయి కదా అంటే.. మామూలుగా అయితే వుంటాయి, కానీ ఈ 'అతి పేద్ద' ఆటో షోలో మాత్రం లేవు మరి. ఇక టాయ్-లెట్, వాష్ రూం వంటి కనీస వసతులు కూడా సవ్యంగా లేకపోవడంతో చాలా కంపెనీలు వారి సిబ్బంది కోసం మొబైల్ బాత్ రూం లను ఆశ్రయించాల్సి వచ్చింది.
జపాన్ కంపెనీకి చెందిన ఓ ప్రముఖ కంపెనీ కి సంబంధిత వ్యక్తి ఈ ఆటో షో ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ "ఇక్కడి వసతులు ఏమీ బాగోలేవు, చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఏం చెయ్యగలం భారత్ లో ఆటోమొబైల్ రంగానికి మంచి మార్కెట్ వుంది. దాన్ని అనుకూలంగా మార్చుకోవాలంటే ఇలాంటి ఇబ్బందులు పడక తప్పదు." అంటూ ఆవేదనను వ్యక్తం చేసారు. కనీస వసతులను ఏర్పాటు చెయ్యడంలో విఫలమయ్యాలని విమర్శలు వస్తున్నాయి.
దీని పై స్పందించిన సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఆటో షోలో మాకు వీలయినంత వరకూ ఉత్తమమయిన సదుపాయాలనే అందించా. కానీ ఇక్కడి పరిస్థితులు అంతర్జాతీయ షోలను నిర్వహించేందుకు వీలుగా లేదని చావు కబురు చల్లగా చెప్పారు. మరి ఈ విషయాలను షో మొదలు కాక ముందు ఎందుకు అంచనా వెయ్యలేక పోయారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న....!! ఈ అనుభవాలతో గుణపాఠం తెచ్చుకొని మరో సారి పునరావృతం కానీకుండా చూసుకుంటారని ఆశిద్దాం...!!


Click it and Unblock the Notifications








