7-సీటర్ వ్యాగన్ఆర్ ఎమ్‌పివిని ఆవిష్కించిన సుజుకి
ఆటో ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తూ, మారుతి సుజుకి మాతృ సంస్థ జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ ఓ సరికొత్త వ్యాగన్ఆర్ ఎమ్‌పివి కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. కంపెనీ అందిస్తున్న పాపులర్ వ్యాగన్ఆర్ ప్లాట్‍ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త ఎమ్‌పివిని అభివృద్ధి చేశారు.
జకార్తాలో జరుగుతున్న 2013 ఇండోనేషియన్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో సుజుకి ఈ వ్యాగన్ఆర్ ఎమ్‌పివిని ప్రదర్శనకు ఉంచింది. ఇదొక 7-సీటర్ ఎమ్‌పివి, అయినప్పటికీ ఇది నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవును (సబ్-ఫోర్ మీటర్ ఎమ్‌పివి) కలిగి ఉంటుంది.
భారత్ వంటి మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని, కంపెనీ ఈ కాంపాక్ట్ వ్యాగన్ఆర్ ఎమ్‌పివిని అభివృద్ధి చేసింది. దీనికి మరిన్ని వివరాలను, ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

వ్యాగన్ఆర్ 3 రోస్ కాన్సెప్ట్
జకార్తాలో జరుగుతున్న 2013 ఇండోనేషియన్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో 'వ్యాగన్ఆర్ 3 రోస్ కాన్సెప్ట్' అనే పేరుతో సుజుకి ఈ వ్యాగన్ఆర్ ఎమ్‌పివిని ఆవిష్కరించింది.

కాంపాక్ట్ ఎమ్‌పివి
సుజుకి ఆవిష్కరించిన ఈ వ్యాగన్ఆర్ 3 రోస్ కాన్సెప్ట్ కారు పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. ఫలితంగా ఇది ఎక్సైజ్ సుంకంలో రాయితీని పొంది, సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది.

కాన్సెప్ట్ మాత్రమే
ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమేనని, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సుజుకి ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ఎల్‍సిజిసి ప్రాజెక్ట్
ఒకవేళ ఈ వ్యాగన్ఆర్ ఎమ్‌పివి ఉత్పత్తి దశకు చేరుకుంటే, ఇది ఇండోనేషియన్ ఎల్‌సిజిసి (లో కాస్ట్ గ్రీన్ కార్) ప్రాజెక్టుకు అర్హత సాధిస్తుంది, ఫలితంగా పన్ను రాయితీలను పొందుతుంది.

ఎర్టిగాకు దిగువన
ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఎర్టిగా ఎమ్‌పివికి దిగువన ఈ కొత్త వ్యాగన్ఆర్ ఎమ్‌పివిని ప్రవేశపెట్టనున్నారు. అంటే ధర పరంగా ఇది ఎర్టిగా కన్నా తక్కువగా ఉండనుందన్నమాట.

అంచనా ధర
ఇండోనేషియన్ మార్కెట్లో వ్యాగన్ఆర్ ఎమ్‌పివి ధర 100 మిలియన్ ఇండోనేషియన్ రుపయ్యల కన్నా తక్కువగా ఉండొచ్చని అంచనా. మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.5.37 లక్షలతో సమానం.

కాంపిటీషన్
వ్యాగన్ఆర్ ఎమ్‌పివి నేరుగా డాట్సన్ గో ప్లస్, హోండా మొబిలో వంటి ఎమ్‌పివిలతో తలపడనుంది.


Click it and Unblock the Notifications








