టోక్యో మోటార్ షో కోసం 'టొయోటా ఫ్యూచర్ మొబిలిటీ' కాన్సెప్ట్స్
జపనీస్ ఆటో దిగ్గజం టొయోటా భవిష్యత్తులో ఉపయోగించుకునేందుకు ఐదు సరికొత్త కాన్సెప్ట్ వాహనాలను రూపొందించింది. ఈనెల 20వ తేది నుంచి జపాన్‌లో జరగనున్న 2013 టోక్యో మోటార్ షోలో టొయోటా ఈ వాహనాలను ఆవిష్కరించనుంది.
ఈ నేపథ్యంలో, తమ కాన్సెప్ట్ వాహనాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ, వాటి ఫొటోలను మరియు కొన్ని వివరాలను కంపెనీ విడుదల చేసింది. ఈ వాహనాల్లో టొయోటా తాజాగా అభివృద్ధి చేసిన ఫ్యూయెల్ సెల్ వెహికల్ (ఎఫ్‌సివి) కాన్సెప్ట్ కూడా ఉంది.
మరి టొయోటా నుంచి ఈ పాంచ్ పటాకా వాహనాలకు సంబంధించిన వివరాలేంటో తెలుసుకుందాం రండి..!

టొయోటా ఎఫ్‌వి2
టొయోటా ఫన్-టూ-డ్రైవ్ సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చిన వాహనమే ఈ ఎఫ్‌వి2 కాన్సెప్ట్. అడ్వాన్స్డ్ ఫ్యూచర్ వెహికల్ టెక్నాలజీతో ఈ వాహనాన్ని డిజైన్ చేశారు. ఇందులో స్టీరింగ్ వీల్ ఉండదు, డ్రైవర్ ఎటు కదిలితే వాహనం అటు వైపుకు కదులుతుంది. ఉదాహరణకు ఈ వాహనాన్ని ఎడమవైపుకు తిప్పాలనుకున్నప్పుడు డ్రైవర్ ఎడమవైపుకు జరిగితే సరిపోతుంది. అలానే, కుడి, ఎడమ, ముందు, వెనుకలకు ఈ వాహనాన్ని డ్రైవర్ కదలికతో కంట్రోల్ చేయవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇదొక రోబోటిక్ కారు లాంటిది.

టొయోటా ఎఫ్‌సివి కాన్సెప్ట్
టొయోటా ఎఫ్‌సివి కాన్సెప్ట్ ఫ్యూయెల్ సెల్ టెక్నాలజీతో నడిచే కారు. ఇప్పటికే ఈ టెక్నాలజీపై మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు కూడా పనిచేస్తున్నాయి. నీటితో నడిచే (హైడ్రోజన్ పవర్డ్) ఈ తరహా కార్లను 2015లో విడుదల చేయాలని టొయోటా భావిస్తోంది. ఈ టెక్నాలజీతో ఫుల్ ట్యాంక్ హైడ్రోజన్‌తో 300 మైళ్ల (500 కి.మీ.) దూరం ప్రయాణించవచ్చు. ఇది 4870 మి.మీ. పొడవును, 1810 మి.మీ. వెడల్పును, 1535 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2780 మి.మీ.

జెపిఎన్ టాక్సీ కాన్సెప్ట్
ఈ ఏడాది టోక్యో మోటార్ షోలో టొయోటా జెపిఎన్ టాక్సీ కాన్సెప్ట్ కూడా విడుదల కానుంది. జపనీస్ స్టైల్ హాస్పిటాలిటీపై దృష్టి సారించి ఈ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను తయారు చేశారు. ప్యాసింజర్లు సులువుగా ఎక్కేందుకు గాను డిజైన్ చేసిన లో అండ్ ఫ్లాట్ ఫ్లోర్, పెద్ద ఎలక్ట్రిక్ దీని ప్రత్యేకత ఓపెన్ క్యాబిన్‌లో ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇది కొత్త ఎల్‌పిజి హైబ్రిడ్ సిస్టమ్‌తో నడుస్తుంది.

టొయోటా వోక్సీ కాన్సెప్ట్
ఇదే మోటార్ షోలో టొయోటా మరో రెండు కాన్సెప్ట్ వాహనాలను కూడా ఆవిష్కరించనుంది. అందులో ఒకటి టొయోటా వోక్సీ కాన్సెప్ట్. జపనీస్ మార్కెట్ కోసం కంపెనీ డిజైన్ చేసిన 7-సీటర్ ఎమ్‌పివి ఇది. ఈ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని 2014లో ప్రొడక్షన్ వెర్షన్‌ను తయారు చేయనున్నారు.

టొయోటా నోహ్ కాన్సెప్ట్
టోక్యో మోటార్ షోలో టొయోటా నోహ్ కాన్సెప్ట్ ఎమ్‌పివిని కూడా ఆవిష్కరించనుంది. ఇది కూడా జపనీస్ మార్కెట్ కోసం డిజైన్ చేయబడిన 7-సీటర్ ఎమ్‌పివినే. ఈ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని 2014లో ప్రొడక్షన్ వెర్షన్‌ను తయారు చేయనున్నారు. వీటితో పాటుగా గజూ రేసింగ్ ట్యూన్ చేసిన ఆక్వా జి స్పోర్ట్స్ మరియు ఐ-రోడ్ పర్సనల్ మొబిలిటీ వాహనాలను కూడా టొయోటా ప్రదర్శించనుంది.


Click it and Unblock the Notifications








