BMW F 450 GS Review : క్లచ్‌తో పనిలేకుండానే గేర్లు మార్చేయొచ్చు.. అడ్వెంచర్ ప్రియుల కలల బైక్ ఎలా ఉందంటే ?
BMW F 450 GS Review : ఒక మంచి బైక్ కొనే కల చాలా మందికి కేవలం ప్రయాణం కోసం కాదు... అది ఒక ఫీలింగ్. వీకెండ్ వచ్చిందంటే బ్యాగ్ వేసుకుని ఎక్కడికైనా వెళ్లిపోవాలి, లాంగ్ రైడ్స్‌లో మనసు ఫ్రీ అవ్వాలి, ప్రతి మలుపులో కొత్త అనుభవం దొరకాలి. ఇలా కలలు కనే రైడర్స్ కోసం ఒక బైక్ ఉంటే అది స్పెషల్ గానే ఉంటుంది. ఇప్పుడు అలాంటి అడ్వెంచర్ డ్రీమ్‌ను నిజం చేయడానికి BMW F 450 GS భారత్‌లోకి వచ్చింది. రోడ్డుపైనే కాదు... మనసులో కూడా ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేసే బైక్‌గా ఇది ఇప్పటికే రైడర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
బీఎండబ్ల్యూ మోటోరాడ్ నుంచి అడ్వెంచర్ బైక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. టీవీఎస్ (TVS) భాగస్వామ్యంతో సరికొత్తగా రూపుదిద్దుకున్న బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జిఎస్(BMW F 450 GS) భారత మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. పాత జి 310 జిఎస్ స్థానాన్ని భర్తీ చేస్తూ వచ్చిన ఈ బైక్‌ను గోవాలో టెస్ట్ రైడ్ చేసిన తర్వాత రివ్యూ చూద్దాం.

డిజైన్, లుక్స్
బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జిఎస్ చూడటానికి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. దీని X ఆకారపు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ (LED DRL), నిలువుగా ఉండే హెడ్ ల్యాంప్ చూడగానే ఆకట్టుకుంటాయి. ఇది మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది.. బేస్ (Base), ఎక్స్‌క్లూజివ్ (Exclusive), జిఎస్ ట్రోఫీ (GS Trophy). బేస్, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్లు బ్లాక్ కలర్‌లో ఉంటే, జిఎస్ ట్రోఫీ మాత్రం బీఎండబ్ల్యూ ఐకానిక్ రెడ్, వైట్, బ్లూ కలర్లలో అదిరిపోతోంది. 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ చాలా బాగుంది, నిలబడి బైక్ నడిపేటప్పుడు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఇంజిన్, పర్ఫార్మెన్స్
ఈ బైక్‌లో అతిపెద్ద ఆకర్షణ టీవీఎస్‌తో కలిసి తయారు చేసిన 420cc ప్యారలల్-ట్విన్ ఇంజిన్. ఇది 48 hp పవర్‌ను, 43 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ ఇంజిన్ చాలా స్మూత్‌గా ఉంది. తక్కువ వేగంలో కూడా ఎలాంటి వైబ్రేషన్లు లేకుండా ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తుంది. అయితే 7,500 rpm దాటిన తర్వాత కొంచెం వైబ్రేషన్లు వినిపిస్తున్నాయి. క్లచ్‌తో పనిలేకుండా తక్కువ వేగంలో నడిపేందుకు ఈజీ రైడ్ క్లచ్ (Easy Ride Clutch) ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్‌లో ఇది రైడర్‌కు పెద్ద ఉపశమనం.

రైడింగ్ ఎక్స్‌పీరియన్స్
ఈ బైక్ బరువు 178 కిలోలు మాత్రమే ఉండటం వల్ల నడపడం చాలా సులభం. సిటీ ట్రాఫిక్‌లో కానీ, రాళ్ల రోడ్లపై కానీ దీనిని చాలా సులువుగా కంట్రోల్ చేయవచ్చు. 845 mm సీట్ హైట్ ఉన్నప్పటికీ, దీని డిజైన్ వల్ల కాస్త తక్కువ హైట్ ఉన్న వారు కూడా ఈజీగా నడపవచ్చు. కైబీ (KYB) అప్-సైడ్ డౌన్ ఫోర్క్స్, అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ గుంతలను అసలు తెలియనివ్వవు. ఇందులో రైన్, రోడ్, ఎండ్యూరో, ఎండ్యూరో ప్రో అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, ఇవి వేర్వేరు పరిస్థితుల్లో బైక్‌ను అద్భుతంగా హ్యాండిల్ చేస్తాయి.

ఫీచర్లు, టెక్నాలజీ:
6.5 అంగుళాల టీఎఫ్‌టీ (TFT) డిస్ప్లే చాలా క్లియర్ గా ఉంది. ఇందులో నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. షిఫ్ట్ అసిస్టెంట్ ప్రో (క్విక్ షిఫ్టర్) గేర్లు మార్చడాన్ని చాలా స్మూత్ చేస్తుంది. అయితే ఇంత రేటు ఉన్న బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్ (Cruise Control) లేకపోవడం కొంచెం వెలితిగా అనిపిస్తుంది. అలాగే సిటీ ట్రాఫిక్‌లో ఇంజిన్ వేడి కొంచెం ఎక్కువగా అనిపిస్తోంది. కానీ ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉంది.

ధర, తీర్పు
భారత్‌లో బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జిఎస్ ధర రూ.4.70 లక్షల నుంచి రూ.5.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది కాంపిటీటర్ల కంటే కొంచెం ఎక్కువే అనిపించినా, బీఎండబ్ల్యూ ఇచ్చే బ్రాండ్ వాల్యూ, బిల్డ్ క్వాలిటీ, రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ముందు అది పెద్ద విషయం కాదు. పాత 310 మోడల్ కంటే ఇది అన్ని విధాలా మెరుగ్గా ఉంది. మీరు ఒక ప్రాపర్ అడ్వెంచర్ బైక్ కోసం ఎదురుచూస్తుంటే, ఎఫ్ 450 జిఎస్ మీకోసమే.


Click it and Unblock the Notifications