స్క్రామ్ 411 (Royal Enfield Scram 411) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త డుగు డుగు బండిలో అంత సత్తా ఉందా..!?
యురేకా...! రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి ఓ కొత్త బైక్ వస్తుందంటే, మోటారిస్టుల ప్రియుల మదిలో మెదిలే ఆనందపు కేకలు బహుశా ఇలానే ఉంటాయేమో. 'రాయల్ ఎన్‌ఫీల్డ్' (Royal Enfield), భారతదేశంలో పరిచయం అవసరం లేని పురాతన మోటార్‌సైకిల్ బ్రాండ్. ఈ బ్రాండ్ నుండి వచ్చిన దాదాపు అన్ని మోడళ్లు కూడా మార్కెట్లో మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా, ఈ 'డుగు డుగు బుల్లెట్' బ్రాండ్ నుండి ఓ సరికొత్త స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్ "రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411" (Royal Enfield Scram 411) మార్కెట్లోకి వచ్చింది. మరి ఇది ఎలా ఉండబోతుంది, ఇందులోని లోటుపాట్లు ఏంటో ఈ డీటేల్డ్ రివ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

అసలు స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ అంటే ఏమిటి?
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 గురించి తెలుసుకునే ముందు అసలు స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ అంటే ఏమిటి, దాని పూర్వాపరాలు ఏంటో తెలుసుకుందాం. మోటార్‌సైకిల్ కనిపించే తీరు మరియు దాని వాడకాన్ని లేదా పనితీరును బట్టి వాటిని వివిధ రకాలుగా వర్గీకరించారు. వీటిలో కమ్యూటర్, స్పోర్ట్స్, డర్ట్, సూపర్‌స్పోర్ట్, రేసింగ్, ఆఫ్-రోడ్, అడ్వెంచర్, టూరర్, లీజర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టే అవుతుంది. ఇటీవలి కాలంలో, మనదేశంలో స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిళ్లను మనం కొత్తగా వింటూ ఉండొచ్చు లేదా చూస్తుండొచ్చు, కానీ వాస్తవానికి వీటికి 100 ఏళ్లకు పైగానే చరిత్ర ఉంది.

స్క్రాంబ్లర్ టూవీలర్ల చరిత్ర దాదాపు 1920 కాలంలో ఆరంభమైంది. ఆ కాలంలో ఆంగ్ల దేశాలలో ఒక పాయింట్ నుండి మరొక పాయింట్‌కి క్రాస్-కంట్రీ మోటార్‌సైకిల్ రేసులను నిర్వహించినప్పుడు ఈ తరహా (స్క్రాంబ్లర్) మోటార్‌సైకిళ్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ రోజుల్లో డర్ట్ బైక్‌లు లేకపోవడంతో, రోడ్డుపై తిరిగే సాధారణ మోటార్‌సైకిళ్లనే మరింత సామర్థ్యంతో నడిచే ఆఫ్-రోడ్ టూవీలర్‌గా మార్చేందుకు వాటిని మోడిఫై చేసేవారు. అలా స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిళ్లు జీవం పోసుకున్నాయి. దశాబ్దాలుగా, స్క్రాంబ్లర్లు మరింత శక్తివంతంగా మారాయి. పవర్‌ఫుల్ ఇంజన్స్, లేటెస్ట్ టెక్నాలజీ మరియు స్మార్ట్ ఫీచర్లతో ఇప్పుడు అవి మన ముందు నిలిచాయి.

భారతదేశంలో కూడా స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్ విభాగం ఇప్పుడిప్పుడే మంచి ప్రాబల్యాన్ని చూపుతోంది. మరి ఇప్పుడు ఈ విభాగంలోకి లేటెస్ట్‌గా వచ్చిన కొత్త స్క్రామ్ 411 (Scram 411) స్క్రాంబ్లర్‌ను భారతీయ వినియోగదారుల అభిరుచి మరియు అవసరాలకు అనుగుణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారు చేయగలిగిందా? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు మేము కొత్త స్క్రామ్ 411 బైక్‌ను బిగ్‌రాక్ డర్ట్ పార్క్ (BigRock Dirt Park) లోని డర్ట్ ట్రాక్‌లపై నడిపి చూశాము. మరి ఈ స్క్రాంబ్లర్ ప్రస్తుత హిమాలయన్ (Himalayan) ఆఫ్-రోడర్ నుండి ఏవిధంగా వేరుగా ఉంటుంది? దీనితో సాధారణ రోడ్డుపై ప్రయాణించడం సులభమా లేక కష్టమా? ఇది హిమాలయన్ కంటే మెరుగ్గా ఉంటుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం రండి.

స్క్రామ్ 411 - డిజైన్ మరియు స్టైల్
ఇదివరకు చెప్పుకున్నట్లుగా, గత కొన్ని దశాబ్దాలుగా స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిళ్లు చాలా శక్తివంతవంతంగా మరియు ఆధునికంగా మారాయి. తయారీదారులు కూడా వీటిని అత్యుత్తమ టెక్నాలజీ మరియు సేఫ్టీ ఫీచర్లతో పాటుగా రైడర్‌కు సహకరించే లేటెస్ట్ రైడర్ అసిస్ట్ ఫీచర్లతో తయారు చేస్తున్నారు. అయితే, స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిళ్ల విషయంలో ఇప్పటికీ మారని అంశం ఏదైనా ఉంది ఉంటే, అది వాటి స్క్రాంబ్లర్ డిజైన్ డిఎన్ఏ. ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న అనేక రకాల స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిళ్లు ఒకేరకమైన డిజైన్ శైలిని కలిగి ఉంటాయి.

స్క్రాంబ్లర్ బైక్ యొక్క సాధారణ డిజైన్ లక్షణాలలో గుండ్రటి హెడ్‌ల్యాంప్, డర్ట్‌బైక్-స్టైల్ మడ్‌గార్డ్‌లు, సింగిల్ పీస్ సీటు, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ మరియు ఇటు ఆన్-రోడ్ అటు ఆఫ్-రోడ్ రెండింటికీ ఉపయోగపడేలా ఉండే డ్యూయల్-పర్పస్ టైర్లు మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ కూడా సరైన స్క్రాంబ్లర్ బైక్ యొక్క ప్రధాన డిజైన్ లక్షణాలు. కొత్తగా వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 (Royal Enfield Scram 411) కూడా ఈ జాబితాలోని లక్షణాలన్నింటినీ సంతృప్తిపరుస్తుంది.

వాస్తవానికి, స్క్రామ్ 411 స్క్రాంబ్లర్‌ను మొదటిసారిగా చూసేవారు, అది హిమాలయన్ బైక్ పొరపాటు పడే అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం, స్క్రామ్ 411 బైక్‌ని హిమాలయన్ బైక్ ఆధారంగా చేసుకొని తయారు చేయడమే. అయితే, ఈ రెండు మోడళ్లను వేరు చేసే కొన్ని డిజైన్ అంశాలు కూడా ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ముందు భాగంలో కనిపించే గుండ్రటి హెడ్‌ల్యాంప్ ఫిక్స్డ్ యూనిట్‌లా ఉంటుంది మరియు ఇది ఎత్తులో అమర్చిబడినట్లు కనిపిస్తుంది. కానీ, స్క్రామ్ 411 విషయానికి వస్తే, ఇది ఫ్రంట్ ఫోర్కులకు అమర్చబడి ఉంటుంది మరియు హ్యాండిల్‌బార్‌ను ఎటువైపుకి తిప్పితే అటువైపుకి కదులుతుంది.

అలాగే, హిమాలయన్‌లో కనిపించే ఫ్రంట్ విండ్‌షీల్డ్ ఈ స్క్రామ్ 411 బైక్‌లో మిస్ అవుతుంది. ఇంకా ఇందులో నిటారుగా ఉన్నట్లు అనిపించే హ్యాండిల్‌బార్ మరియు చాలా ప్రత్యేకంగా కనిపించే సైడ్ మిర్రర్స్ కూడా ఉంటాయి. ఇందులో ఫోర్క్ గేటర్‌లు ఉంటాయి, ఫోర్క్ దిగువన సగభాగం నలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 ముందు భాగంలో 19 ఇంచ్ స్పోక్డ్ వీల్ ఉంటుంది మరియు దానిపై సియట్ గ్రిప్ (CEAT GRIPP) డ్యూయల్-పర్పస్ టైర్ అమర్చబడి ఉంటుంది. ఈ వీల్ అంచులు మొత్తం నలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉంటుంది. ఈ మొత్తం వీల్ సెటప్ స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్‌కు మరింత కఠిమైన రూపాన్ని అందిస్తుంది.

ఇక సైడ్ డిజైన్‌ను గమనిస్తే, ఇక్కడ చూపరులను ఆకట్టుకునే ప్రధానమైన అంశాల్లో దాని ఫ్యూయెల్ ట్యాంక్ మరియు బేర్ బోన్ బాడీ (ప్యానెల్స్ లేని బాడీ) ఉంటాయి. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కూడా చూడటానికి హిమాలయన్ మాదిరిగానే అనిపించినప్పటికీ, స్క్రామ్ 411 ఫ్యూయెల్ ట్యాంక్‌కి ఇరువైపులా చిన్నపాటి పొడగింపులు (ఎక్స్‌టెన్షన్స్) ఉంటాయి, ఇవి ఈ రెండింటిని వేరుగా ఉండేలా చేస్తాయి. ఇక ఇందులోని ఇంజన్, ఛాసిస్, ఎగ్జాస్ట్, వెనుక-చక్రం మరియు వెనుక డిజైన్ అన్నీ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌ను పోలి ఉంటాయి. మార్కెట్లో హిమాలయన్ ఇప్పటికే అద్భుతమైన ఆఫ్-రోడ్ బైక్‌గా మంచి ఆదరణ పొందింది కాబట్టి, స్క్రామ్ 411 స్క్రాంబ్లర్ కూడా ఈ స్టైల్‌లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ స్ప్లిట్ సీటును కలిగి ఉంటే, స్క్రామ్ 411 మాత్రం సాధారణ స్క్రాంబ్లర్ స్టైల్ సింగిల్ పీస్ సీటును కలిగి ఉంటుంది. ఈ సీటుకి ఇరువైపులా ఉండే సైడ్ బోన్స్ దీని డిజైన్ మరియు స్టైలింగ్‌ను హైలైట్ చేస్తాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 స్క్రాంబ్లర్‌ను కంపెనీ ఏడు ప్రత్యేకమైన మరియు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారులు తమకు నచ్చిన బాడీ గ్రాఫిక్స్‌ను కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 చాలా ఆకర్షణీయంగా ఓ కొత్త రకం స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ అని చెప్పొచ్చు.

స్క్రామ్ 411 - ఫీచర్లు
సాధారణంగా స్క్రాంబ్లర్ బైక్స్ అంటే సైడ్ ప్యానెల్స్ లేని బేర్-బోన్ బాడీ కలిగిన బైక్స్ గుర్తుకువస్తాయి. అంటే, ఇలాంటి బైక్స్‌లో ఛాస్సిస్, ఇంజన్, రెండు చక్రాలు మరియు బైక్ బాడీ యొక్క ఫంక్షనల్ బిట్‌లు మాత్రమే ఉంటాయి. అయితే, కాలక్రమేణా స్క్రాంబ్లర్ బైక్స్‌లో చాలా విషయాలు మారాయి. ప్రస్తుతం, మార్కెట్లో రిటైల్ అవుతున్న స్క్రాంబ్లర్‌లలో చాలా కొత్త ఫీచర్లు చేర్చబడ్డాయి. ఆధునిక ఫీచర్లతో కూడిన ఇలాంటి స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్లు కాస్తంత ఖరీదైనవే అయినప్పటికీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మాత్రం భారతదేశంలో తక్కువ ఖరీదైన స్క్రాంబ్లర్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

అంటే, దీని అర్థం ఈ లో-బడ్జెట్ స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ బేసిక్ ఫీచర్లను కలిగి ఉంటుందన్నమాట. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 బైక్‌లో అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇదొక ట్విన్-పాడ్ యూనిట్, ఇందులో ఒకటి ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ కోసం ఉపయోగించబడుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 (Royal Enfield Meteor 350)లో కనిపించే టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్‌ను ఈ స్క్రామ్ 411లో కూడా చూడొచ్చు. ఇది బ్లూటూత్ కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది.

కాకపోతే, ఈ ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మేక్ ఇట్ యువర్స్ (Royal Enfield Make It Yours) ప్రోగ్రామ్ ద్వారా ఆప్షనల్‌గా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే, ఇందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క విలక్షణమైన mph మరియు km/h లో స్పీడ్ రీడౌట్‌తో కూడిన అనలాగ్ స్పీడోమీటర్, గండ్రటి పాడ్‌లో ఉండే ఇంధన స్థాయి (ఫ్యూయెల్ ఇండికేటర్) మీటర్, ట్రిప్ మీటర్లు, ఓడోమీటర్ మరియు సమయాన్ని ప్రదర్శించే చిన్న ఎల్‌సిడి స్క్రీన్ ఉంటాయి.

కాబట్టి, ఇవన్నీ చూస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 స్క్రాంబ్లర్‌ని కంపెనీ బేసిక్ ఫీచర్లతో అందిస్తుందని చెప్పవచ్చు. కాకపోతే, ఈ ధర వద్ద కూడా ప్రాథమిక ఫీచర్లలో ఒకటైన టాకోమీటర్ ఇందులో మిస్ అవుతుంది. ఇక ఇతర విషయాలకు వస్తే, స్క్రామ్ 411 బైక్‌లో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ కూడా లేదు. ఇది సాంప్రదాయ హ్యాలోజెన్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో వస్తుంది. వినియోగదారులు ఇంత అధిక ధర చెల్లిస్తున్నప్పుడు, కంపెనీ ఇలాంటి బేసిక్ ఫీచర్లను కూడా అందించకపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

స్క్రామ్ 411లో స్విచ్‌గేర్ కూడా చాలా బేసిక్‌గా ఉంటుంది అయితే, ఇందులోని స్విచ్‌ల నాణ్యత చాలా బాగుంది. ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఇప్పటి ఆధునిక మోటార్‌సైకిళ్లకు చాలా అవసరమైన సేఫ్టీ ఫీచర్. కాబట్టి, రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ స్క్రామ్ 411 బైక్‌ను కూడా డ్యూయల్-ఛానల్ ABS తో స్టాండర్డ్‌గా అందిస్తోంది. ఇవీ, స్క్రామ్ 411తో అధికారికంగా లభించే ఫీచర్లు. ఇవి కాకుండా, కస్టమర్లకు ఆసక్తి ఉంటే ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే స్క్రామ్ 411కు కూడా అనేక అదనపు యాక్ససరీలను జోడించుకొని, తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

స్క్రామ్ 411 - ఇంజన్ పనితీరు మరియు రైడింగ్ ఇంప్రెషన్స్
స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్స్ అంటేనే సరదాగా సవారీ చేసే మోటార్‌సైకిళ్లని అర్థం. ఇవి రోడ్డుపై కానీ లేదా ఆఫ్-రోడ్‌పై కానీ ఉపయోగించే ఫన్-టూ-రైడ్ మోటార్‌సైకిల్స్. మేము ఈ కొత్త స్క్రామ్ 411 బైక్‌ను బిగ్‌రాక్ డర్ట్ పార్క్‌లోని ఆఫ్-రోడ్ ట్రాక్‌లపై నడిపాము. మరి ఇది మమ్మల్ని యురేకా...! అని అరిపించిందా లేదా అనేది తెలుసుకుందాం రండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 స్క్రాంబ్లర్‌ను ప్రస్తుత హిమాలయన్ బైక్ ఆధారంగా తయారు చేసిన సంగతి తెలిసినదే. కాబట్టి, ఈ రెండు మోడళ్లలో ఇంజన్ కూడా ఒకేలా ఉంటుంది. స్క్రామ్ 411లో అదే 411 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఎయిర్-కూల్డ్, ఎస్ఓహెచ్‌సి యూనిట్‌లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి, ఈ ఇంజన్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 24.3 బిహెచ్‌పి పవర్‌ను మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 32 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ స్లిక్-షిఫ్టింగ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బరువు 190 కేజీలు ఉంటుంది. అయితే, స్క్రామ్ 411 బరువు మాత్రం కేవలం 185 కేజీలే ఉంటుంది. స్టాక్ వెర్షన్ స్క్రామ్ 411లో సెంటర్ స్టాండ్ అందుబాటులో ఉండదు. కస్టమర్లు దానిని అదనపు యాక్ససరీస్‌గా అమర్చుకోవచ్చు. దాని బరువు 1.5 కేజీలు ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే, హిమాలయన్ కన్నా స్క్రామ్ 411 బరువు 6.5 కేజీలు త్కువగా ఉంటుంది. లైట్ వెయిట్ కారణంగా, స్క్రామ్ 411 బైక్‌లో పవర్ డెలివరీ చాలా సాఫీగా అనిపిస్తుంది మరియు చాలా క్విక్ యాక్సిలరేషన్‌ను కలిగి ఉంటుంది.

మిడ్-రేంజ్‌లో కూడా దాని పవర్/టార్క్ డెలివరీ చాలా గొప్పగా అనిపిస్తుంది. అయితే, వేగం పెరిగే కొద్దీ దాని పవర్ కొంచెం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ, ఇది సునాయాసంగా మూడంకెల వేగాన్ని చేరుకోగలదు మరియు గంటకు నిర్ధిష్టంగా 100-105 కిమీ వేగంతో పరుగులు తీయగలదు. అంతకు మించి వేగంగా బైక్‌ని నడిపితే ఫుట్‌పెగ్‌లు మరియు హ్యాండిల్‌బార్‌ల ద్వారా వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది.

హిమాలయన్ బైక్‌లో ముందు వైపు 21 ఇంచ్ వీల్ ఉంటే, స్క్రామ్ 411లో ముందు వైపు 19 ఇంచ్ స్పోక్డ్ వీల్ ఉంటుంది. కాబట్టి, హిమాలయన్‌తో పోలిస్తే స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ యొక్క ఫ్రంట్-ఎండ్ ఇప్పుడు భూమికి చాలా తక్కువ ఎత్తులో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఫలితంగా, రైడర్ తమ కాళ్లను సీటు మీదుగా తిప్పిన వెంటనే బైక్‌తో కనెక్ట్ అయినట్లు అనిపిస్తుంది. స్క్రామ్ 411 ముందు వైపు చిన్న వీల్‌ని పొందిన కారణంగా, జెర్రీ క్యాన్‌లను మౌంట్ చేయడానికి హిమాలయన్‌పై కనిపించే ఫ్రంట్ ర్యాక్‌ను కూడా కోల్పోతుంది. ఫలితంగా, ఈ మోటార్‌సైకిల్ చాలా తేలికగా అనిపిస్తుంది.

ఈ మోటార్‌సైకిల్‌ను ఆన్-రోడ్ లేదా ఆఫ్‌రోడ్‌కు అనుకూలంగా మార్చడం చాలా సులభం. చిన్న ఫ్రంట్ వీల్ కారణంగా, ఇప్పుడు దీని హ్యాండిల్‌బార్ కూడా కొద్దిగా తగ్గించబడింది. ఫలితంగా, హిమాలయన్‌తో పోలిస్తే, స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ యొక్క ఫ్రంట్-వీల్ ట్రావెల్ 10 మిమీ, మరియు సీట్ ఎత్తు 5 మిమీ తగ్గింది. ఈ మార్పులు అన్నీ కూడా స్క్రామ్ 411 ను సరదాగా మరియు సులభంగా నడపగలిగే మోటార్‌సైకిల్‌గా మార్చాయి. అలాగే, స్క్రామ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 220 మిమీ (హిమాలయన్) నుండి 200 మిమీకి తగ్గించబడింది. కాబట్టి, ఈ చిన్న విషయం వలన ఆఫ్-రోడ్ రైడింగ్ చేసేటప్పుడు కొంచెం సమస్యగా అనిపిస్తుంది.

ఈ బైక్‌తో మేము రెండు మూడు సందర్భాలలో బాటమ్ అవుట్ చేశాము, మీరు కూడా అలా చేస్తే స్క్రామ్ 411 క్రింది భాగంలో తగిలే అన్ని దెబ్బలను తట్టుకోవడానికి ఇందులో మెటల్ బాష్ ప్లేట్ (ఇంజన్ ను కప్పి ఉంటే ఇనుప రేకు) కూడా ఉంటుంది. కాబట్టి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందువైపు 300 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు 240 మిమీ డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇవి రెండూ కూడా డ్యూయల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 ఎక్కువగా ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ మోటార్‌సైకిల్ అయినందున, ఇందులో వెనుక వైపుకు మారగల ఏబిఎస్ ఉంటుందని మేము ఊహించాము. కానీ, ఈ మోటార్‌సైకిల్‌కు ఆ బ్రేకింగ్ పవర్ సరిపోతుందని మాకు అనిపించింది.

మేము ఈ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్‌ను ఫ్లాట్-ట్రాక్‌లోను అలాగే చిన్న ఆఫ్-రోడ్ ట్రాక్‌లో నడిపి చూశాము. ఇందులో ఆఫ్-రోడ్ హ్యాండ్లింగ్ ఖచ్చితంగా బాగుందని చెప్పగలము మరియు దీనిపై ఆఫ్-రోడ్ రైడింగ్ కూడా చాలా సులభంగా అనిపించింది. అలాగని, ఇది ఆన్-రోడ్ రైడింగ్ విషయంలో ఏమాత్రం తగ్గదు, దీని ఆన్-రోడ్ సామర్థ్యాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే, స్క్రామ్ 411 ఖచ్చితంగా పెద్ద మరియు పొడవైన హిమాలయన్ బైక్ కంటే మెరుగ్గా హ్యాండిల్ చేస్తుంది. మొత్తం మీద, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 సులభంగా వెళ్లగలిగే, సరదాగా ప్రయాణించగల స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్.

స్క్రామ్ 411 - కలర్ ఆప్షన్స్
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 ఏడు ఆసక్తికరమైన మరియు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. వీటిలో గ్రాఫైట్ రెడ్, గ్రాఫైట్ బ్లూ, గ్రాఫైట్ పసుపు, వైట్ ఫ్లేమ్, సిల్వర్ స్పిరిట్, బ్లేజింగ్ బ్లాక్ మరియు స్కైలైన్ బ్లూ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఏడు రంగులలో కూడా స్కైలైన్ బ్లూ షేడ్ చాలా ఆకర్షణీయంగా ఉందని మేము గుర్తించాము. అలాగని, ఇతర కలర్ ఆప్షన్లు బాగోలేవని కాదు, అవి కూడా చాలా ఆకర్షణీయంగానే ఉన్నాయి.

స్క్రామ్ 411 - కాంపిటీషన్
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్‌కి ప్రత్యక్ష పోటీదారు అంటే, యెజ్డీ స్క్రాంబ్లర్ (Yezdi Scrambler) అని చెపొచ్చు. యెజ్డీ స్క్రాంబ్లర్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ మనదేశంలో చాలా ఏళ్లుగా వ్యాపారం చేస్తోంది మరియు దేశవ్యాప్తంగా ఎక్కువ సర్వీస్ టచ్‌పాయింట్‌లను కూడా కలిగి ఉంది. కాబట్టి ఈ రెండింటిలో స్క్రామ్ 411 చాలా నమ్మదగిన మరియు మెరుగైన స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్‌గా ఉంటుంది.

సరే ఇంతకీ చివరగా ఏం తీర్పు చెబుతారు..?
మేము ఈ కథనం ప్రారంభంలోనే చెప్పాం, ఇతర స్క్రాంబ్లర్‌లతో పోల్చినప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 స్క్రాంబ్లర్ చాలా భిన్నంగా ఉంటుందని. ఎందుకంటే, స్కాంబ్లర్‌లు సాధారణంగా రోడ్డు మోటార్‌సైకిళ్లు, ఆ తర్వాత వాటిని ఆఫ్-రోడ్ సామర్థ్యం గల మోటార్‌సైకిళ్లుగా మారుస్తారు. కానీ, స్క్రామ్ 411 విషయంలో ఇది మరోలా ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ దీనిని గొప్ప ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో కూడిన తమ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ హిమాలయన్ నుండి అభివృద్ధి చేసింది. అంటే, కంపెనీ తమ ఆఫ్-రోడ్ బైక్‌కి రోడ్-గోయింగ్ మ్యానరిజమ్‌లను జోడించిందన్నమాట. కాబట్టి, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 ఇటు ఉత్తమ ఆన్-రోడ్ మరియు ఉత్తమ అటు ఆఫ్-రోడ్ సామర్థ్యాల కలయికతో రూపొందించిన "మేడ్ ఇన్ ఇండియా" స్క్రాంబ్లర్.


Click it and Unblock the Notifications








