సింపుల్ వన్ జెన్ 2 అరాచకం..సింగిల్ ఛార్జ్ పై 265 కి.మీ రేంజ్..బ్యాటరీపై లైఫ్ టైమ్ వారంటీ
భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింపుల్ ఎనర్జీ(Simple Energy) మరోసారి సంచలనం సృష్టించింది. తన రెండో తరం స్కూటర్ సింపుల్ వన్ జెన్ 2(Simple One Gen 2)ను మార్కెట్లోకి విడుదల చేసింది.
పాత మోడల్ కంటే మెరుగైన రేంజ్, అత్యంత శక్తివంతమైన పనితీరుతో ఈ స్కూటర్ ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఒక్క మోడల్ మాత్రమే కాకుండా, బడ్జెట్ ప్రియుల కోసం సింపుల్ వన్ఎస్(OneS), రేంజ్ గురించి అస్సలు ఆలోచించనవసరం లేని సింపుల్ అల్ట్రా మోడళ్లను కూడా కంపెనీ పరిచయం చేసింది.

సింపుల్ వన్ జెన్ 2 డిజైన్ చూడగానే చాలా షార్ప్‌గా, స్పోర్టీగా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో కొత్తగా ఎయిర్ వెంట్స్ ఇచ్చారు, ఇవి కేవలం స్టైల్ కోసం మాత్రమే కాదు, స్కూటర్ లోని 7-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే వేడెక్కకుండా చల్లబరుస్తాయి. ఇక ఈ స్కూటర్ కి ఉన్న సైడ్ మిర్రర్స్ ప్రత్యేక ఆకర్షణ.

ఫీనిక్స్ పక్షి రెక్కలను పోలి ఉండే ఏరోడైనమిక్ డిజైన్‌తో ఇవి స్కూటర్ కు మంచి స్థిరత్వాన్ని ఇస్తాయి. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఇండికేటర్లు రాత్రి పూట కూడా పగటి వెలుతురును ఇస్తాయి. 12-అంగుళాల యూరోగ్రిప్ ట్యూబ్‌లెస్ టైర్లు, డిస్క్ బ్రేక్స్ దీనికి మరింత గ్రిప్‌ను అందిస్తాయి.

స్కూటర్ లోపల ఉన్న టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. బ్లూటూత్ ద్వారా మీ ఫోన్ కనెక్ట్ చేసుకుంటే కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్లు నేరుగా స్క్రీన్ మీదే చూడవచ్చు. నావిగేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్, క్రూయిజ్ కంట్రోల్, జియోఫెన్సింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ముఖ్యంగా ఓవర్-ది-ఎయిర్(OTA) అప్‌డేట్స్ ద్వారా స్కూటర్ సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంది. చిన్న వస్తువుల కోసం 1-లీటర్ గ్లోవ్‌బాక్స్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, సీటు కింద ఏకంగా 35 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు.

ఈ స్కూటర్ పనితీరు మామూలుగా లేదు. టాప్ ఎండ్ వేరియంట్ (5 kWh) కేవలం 2.55 సెకన్లలోనే 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కి.మీ. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 265 కిలోమీటర్ల (IDC రేంజ్) దూరం ప్రయాణించవచ్చు.

భవిష్యత్తులో రాబోయే అల్ట్రా మోడల్ అయితే ఏకంగా 400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో ఎకో, రైడ్, ఎయిర్, సోనిక్ ఎక్స్ వంటి ఆరు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. మీకు వేగం కావాలంటే సోనిక్ మోడ్, ఎక్కువ రేంజ్ కావాలంటే ఎకో మోడ్ వాడుకోవచ్చు.
చాలా మందికి ఎలక్ట్రిక్ స్కూటర్ అనగానే బ్యాటరీ పాడవుతుందేమో అనే భయం ఉంటుంది. కానీ సింపుల్ ఎనర్జీ ఆ భయాన్ని దూరం చేస్తూ బ్యాటరీ, మోటార్‌పై జీవితకాల వారంటీని (Lifetime Warranty) ప్రకటించింది.
సాధారణంగా 3 ఏళ్లు లేదా 30,000 కి.మీ వారంటీ ఇస్తున్నా, దానిని 8 ఏళ్ల వరకు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. బెంగళూరులో దీని ప్రారంభ ధర రూ. 1,39,999 (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతోంది. పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే వారికి సింపుల్ వన్ జెన్ 2 ఒక పక్కా ఆప్షన్!


Click it and Unblock the Notifications








