ఉందిలే మంచి కాలం ముందు ముందునా...!!

ఈ ఏడాది సాధించిన వృద్ధి రేటులో ఇదే అధికం కావడం గమనార్హం. గత ఆగస్టు నెలకుగాను సాధించిన 24% వృద్ధి రేటు రెండవ స్థానంలో నిలిచింది. ఈ వృద్ధి రేటుతో పోల్చితే నవంబరు నెలకు సాధించిన వృద్ధి రేటు రెట్టింపు కావడం గమనించదగ్గ విషయం.
ఇందులో ప్యాసింజర్ వాహనాల అమ్మకం 66.54% పెరిగింది. ఈ విభాగంలో ఈ ఏడాది 166,653 వాహనాలను అమ్మి ఈ వృద్ధిని సాధించినట్టు SIAM ప్రకటించిన వివరాలు తెలుపుతున్నాయి. ఈ ఏడాది మొత్తానికి ఈ వృద్ధి రేటు అత్యధికమని మారుతి సుజుకి జనరల్ మ్యానేజర్ శశాంక్ శ్రీవత్సవ తెలిపారు.
గత భారీవాహనాల అమ్మకాలు ఆగస్టు నెలలోనే ఊపందుకున్నాయి. గత అక్టోబరు నెలలో 64% పెరిగిన ఈ భారీవాహన అమ్మకాలు, నవంబరు నెలలో రికార్డు స్థాయిలో 132.66% వృద్ధిని నమోదుచేసుకుంది. ఈ విభాగంలో గత ఏడాది నవంబరులో 8,325 వాహనాల అమ్మకం జరుగగా, ఈ ఏడాది నవంబరులో 19,369 వాహనాలు అమ్ముడయ్యాయి.
నవంబరు నెలకు గాను మొత్తం కమర్షియల్ వాహనాల అమ్మకాలు గత సంవత్సరం నవంబరు నెల అమ్మకాలతో పోల్చితే 98% వృద్ధిని సాధించింది. కాగా టూ-వీలర్ అమ్మకాలు 39.31% వృద్ధిని నమోదుచేసుకున్నాయి. టూ-వీలర్ విభాగంలో మొత్తం 790,613 యూనిట్ల అమ్మకాలతో ఈ వృద్ధి నమోదయింది. ఇక త్రీ-వీలర్ విభాగంలో మొత్తం 39,020 యూనిట్ల అమ్మకాలతో 68.45% వృద్ధిని నమోదుచేసుకుంది.
ఇలా గత నెలలో ప్రతీ విభాగంలోనూ సగటున 50% వృద్ధిని నమోదుచేసుకున్న ఆటోమొబైల్ రంగం ముందు ముందు మరింత మెరుగయ్యే అవకాశాలు వున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందున్నదంతా మంచి కాలమేనని వారు అభయమిస్తున్నారు.


Click it and Unblock the Notifications








