దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ హుందాయ్ మోటార్స్ భారతీయమార్కెట్ లో మంచి స్థానంలో వుంది. హుందాయ్ సాంత్రో, i10, i20 వంటి కార్లు ఇక్కడ మంచి ఆదరణను పొందాయి. తాజాగా హుందాయ్ మోటార్స్ ఇండియా ప్రై. లిమిటెడ్ కు కొత్త ఎం.డి. & సిఇవొ గా హన్ వూ పార్క్ నియమితులయ్యారు. ఇంత వరకూ ఎం.డి. & సిఇవొ గా వ్యవహరించిన హె.ఎస్.లీమ్ నుండీ ఆయన లాంఛనంగా భాద్యతలను స్వీకరించారు. హె.ఎస్.లీమ్ సియోల్ లోని హుందాయ్ మోటార్స్ కు సిఇవొ గా నియమితులయ్యారు. ఫైనాన్సియల్ డిపార్ట్ మెంట్ నుండీ సిఇవొ గా ఎదిగిన పార్క్, 1982 లో కొరియాలోని హుందాయ్ మోటార్స్ కంపెనీలో ఫైనాన్సియర్ గా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.
2003వ సంవత్సరంలో ఇండియాలోని హుందాయ్ మోటార్స్ కు ఛీప్ ఫైనాన్సియల్ అధికారిగా నియమితులయ్యారు. మొత్తం ఏడేళ్లపాటు భారతదేశంలో పనిచేసిన అనుభవం పార్క్ కు ఇక్కడి మార్కెట్ స్థితిగతుల మీద పూర్తి అవగాహన ఉంది. భాద్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీ తనపై వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని పార్క్ తెలిపాడు. ప్రస్తుతం తాను 2011-12 సంవత్సరాలలో విడుదల కానున్న హుందాయ్ చిన్న కారు మీదే దృష్టి కేంద్రీకరించానని, అది తప్పక విజయవంతం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసాడు.