ప్రకృతి ఎంతో అందమైనది, ఇది మనకు దేవుడు ఇచ్చిన వరం. దీన్ని కాపాడుకోవాల్సిన భాద్యత మనందరి మీద వుంది. కానీ వాహనాల నుండీ వెలువడే గ్రీన్ హౌస్ గ్యాసుల వల్ల ప్రకృతి ఎంతో నష్టపోతోంది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ప్రస్తుతం చాలా ఆటోమొబైల్ కంపెనీలు హైబ్రిడ్ మోడళ్లతో మనముందుకు వస్తున్నాయి. ప్రకృతికి ఏ మాత్రం చేటు చెయ్యని ఈ వాహనాల ఉత్పత్తి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. తాజా హుందాయ్ మోటార్స్ బహుళజనాదరణ పొందిన హుందాయ్ i10 మోడల్ కు ఎలక్ట్రిక్ వెర్షన్ ను రూపొందిస్తోందట.
ఈ i10 ఎలక్ట్రిక్ వెర్షన్ కారుని న్యూఢిల్లీలో జరిగే ఆటో షోలో ఆవిష్కరించనున్నారు. సరిగ్గా మూడేళ్ల క్రితం 2007 లో ఢిల్లీ లో జరిగిన ఆటో షోలోనే ఈ i10 ను ఆవిష్కరించిన హుందాయ్ మోటార్స్ ఇప్పుడీ ఎలక్ట్రిక్ వెర్షన్ ను విడుదల చెయ్యడానికీ ఢిల్లీ ఆటో షోనే వేదికగా చేసుకోవడం విశేషం. కాగా ఈ ఆటో షో వచ్చే ఏడాది జనవరి 5న లాంఛనంగా ప్రారంభం కానుంది.