భారతీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త మల్టీపర్పస్ వెహికల్ టాటా ఇండిక్రూజ్ ఎప్పుడు వస్తుందోనని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. టయోటా ఇన్నోవా, చెవ్రోలెట్ టవేరా, మహీంద్రా గ్జిలో వంటి మల్టీపర్పస్ వాహనాలకు పోటీగా టాటా మోటార్స్ రూపొందించిన ఈ టాటా ఇండిక్రూజ్ ఈ ఏడాదిలో మార్కెట్ లోకి రానుందని టాటా కంపెనీ గత సంవత్సరం ప్రకటించారు. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల ఈ కారు విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. వచ్చే ఏడాది 2010 ప్రథమార్థంలో ఈ కారు విడుదల కానుందని టాటా మంజా వడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కంపెనీ వర్గాలు ప్రకటించాయి.
కాగా టాటా సఫారీ లాంటి మల్టీపర్పస్ వెహికల్ గ్రాండ్ సక్సెస్ తర్వాత టాటా మోటార్స్ నుండీ రాబోతున్న ఈ కారు మీద మంచి అంచనాలే వున్నాయి. టాటా సఫారీకి ఉపయోగించిన 2.2 లీటర్ డైకోర్ డీజిల్ ఇంజన్ నే ఈ వాహనానికి కూడా ఉపయోగించారు. ఏడుగురు సౌకర్యంగా కూర్చోడానికి వీలుగా ఈ కారును డిజైన్ చేసారు. వచ్చే ఏడాది ఈ కారు విడుదలయితే మిగితా కంపెనీల ఖజానాలకు గండి కొడుతుందనడంలో అతిశయోక్తి లేదు.