ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ వోక్స్ వ్యాగన్ నుండీ వచ్చిన బీటెల్ కారు విదేశాల్లో విడుదలయ్యి ఎంతో సక్సెస్ ఫుల్ కారుగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆటోమొబైల్ రంగంలో మంచి మార్కెట్ వున్న భారతదేశంలో స్థిరపడాలనుకున్న వోక్స్ వ్యాగన్ ఈ బహుళజనాధరణ పొందిన బీటెల్ కారును భారతీయ మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. గత శుక్రవారం (డిసెంబరు 4న) బీటెల్ భారతీయమార్కెట్ లోకి లాంఛనంగా విడుదలయింది. 1998లో అంతర్జాతీయ మార్కెట్ లోకి విడుదలయిన ఈ బీటెల్ కారు ఓ దశాబ్దం అనంతరం ఇక్కడి మార్కెట్ లోకి విడుదలయింది. 115 bhp, 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో విడుదలయిన ఈ కారు ఎక్స్-షోరూం ధర ఢిల్లీలో 20.45 లక్షలుగా నిర్ణయించారు. విడుదలకు ముందే ఈ కారు కోసం 125 అడ్వాన్స్ బుకింగులు నమోదయ్యాయని కంపెనీ వర్గాలు ప్రకటింటాయి.
కాగా ఇదే రోజు వోక్స్ వ్యాగన్ ముందుగా ప్రకటించకపోయినా టౌవరెగ్ అనే SUV ని కూడా విడుదల చేసింది. 3.0 లీటర్ల టర్బోఛార్జడ్ V6 డీజిల్ ఇంజన్ తో విడుదలయిన ఈ SUV ఎక్స్-షోరూం ధరను 51.84 లక్షలుగా నిర్ణయించారు. ఈ రెండు మోడళ్లను విడుదల చేసిన వోక్స్ వ్యాగన్ త్వరలోనే మరిన్ని మోడళ్లను విడుదల చేసి భారతీయ మార్కెట్ లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.