హుందాయ్ మోటార్స్ ఇటీవలే న్యూయార్క్ ఆటో షోలో విడుదల చేసిన లగ్జరీ కారు ఇక్కూస్ కు అన్ని వర్గాల నుండీ మంచి స్పందన లభించింది. దీంతో ఈ కారుకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్న హుందాయ్ మోటార్స్ మరో స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ కారు కొనండి ఉచితంగా ఐప్యాడ్ ను అందుకోండి అని తెగప్రచారం చేస్తోంది. ఇక అమెరికాలో ఐప్యాడ్ కు ఉన్నంత డిమాండ్ ప్రస్తుతం మరే వస్తువుకూ లేదని సర్వేలు తేల్చిచెబుతున్నాయి. మరి అలాంటి ఐప్యాడ్ వస్తుందంటే అక్కడ కారు కొనేసే మహానుభావులూ వున్నారట. దీంతో ఈ స్కీమ్ కు విశేష స్పందన లభిస్తోందట.
ఇక ఈ లగ్జరీ కారు ధర 55 వేల అమెరికన్ డాలర్లు(సుమారు 25 లక్షలు)...దీనికి 600 డాలర్లు(సుమారు 27 వేలు) విలువచేసే ఐప్యాడ్ ఉచితంగా ఇస్తామనేస్తూ వచ్చే ఏడాదికి 3,000 ఇక్కూస్ కార్లను అమ్మాలని హుందాయ్ సంస్థ కలలు కంటోంది. ఇక ఈ సదుపాయం ఒక్క అమెరికా వాసులకే లెండి. మరీ కారు ఇక్కడ ఎప్పుడు విడుదలవుతుందో ఇంకా సరయిన సమాచారం లేదు.