సరిగ్గా 26 ఏళ్ల క్రితం, 1983 డిసెంబరు 14న మారుతీ సంస్థ చిన్న కార్ల మార్కెట్ లో ఓ పెనుసంచలనానికి నాంది పలికింది. చిన్న కారు, పీపుల్స్ కారుగా పేరొందిన మారుతీ-800 కారుని భారతీయ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఢిల్లీకి చెందిన హర్పల్ సింగ్ తొలి కారుని, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతులమీదుగా అందుకున్నాడు. ఆ తర్వాత ఇక ఈ కారు అమ్మకాలు ఊపందుకున్నాయి. ఓ విధంగా ఈ కారు భారతీయ కార్ల రూపురేఖలనే ప్రభావితం చెసిందని చెప్పవచ్చు. మారుతీ సంస్థకు ఈ కారు ఎన్నో పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. తొలిసారి 1983 లో 52,000 రూపాయల ధర పలికిన ఈ కారు ప్రస్తుత ధర 1,85,715 రూపాయల ధర పలుకుతోంది.
తాజాగా భారతీయ ఆటోసంస్థలు భారత్ స్టేజ్-IV నిబంధనల ప్రకారం కార్లను రూపొందించాలనే చట్టం ప్రకారం మారుతీ-800 కారు పంపిణీ 13 నగరాల్లో ఆగిపోనుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండీ ఈ కారు అమ్మకాలు ఆగిపోనున్నాయి. దీంతో మారుతీ సుజుకీ సెర్వో కారుతో మారుతీ-800 కారు లేని లోటును భర్తీ చెయ్యాలని భావిస్తోంది. ఏది ఎలా వున్నా పీపుల్స్ కారుగా అందరి ఆదరాభిమానాలు అందుకున్న మారుతీ-800 కారు ఆగిపోయినట్టే..!!