టాటా నానోతో పోటీకి సిద్ధంగా లేము: మారుతి సుజుకి
ప్రపంచంలోనే అత్యంత చవక కారుగా చరిత్ర సృష్టించిన టాటా మోటార్స్ ప్రజల కారు "'టాటా నానో"కు పోటీగా అదే స్థాయిలో మరో కారును ప్రవేశపెట్టేందుకు పెద్ద పెద్ద ఆటో దిగ్గజాలు సైతం వెనుకంజ వేస్తున్నాయి. ఇప్పటికే, అమెరికా ఆటో దిగ్గజాలైన జనరల్ మోటార్స్, ఫోర్డ్ మోటార్ కంపెనీలు ప్రస్తుతానికి టాటా నానోకు పోటీగా ఓ చిన్న కారును ప్రవేశపెట్టలేమని చేతులు ఎత్తేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ జాబితాలోకి తాజాగా, దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కూడా చేరిపోయింది. భారత మార్కెట్లో కాంపాక్ట్ తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను ఏర్పరచుకున్న మారుతి సుజుకి కూడా టాటా నానో పోటీగా ఓ చిన్న కారును ప్రవేశపెట్టలేమని ప్రకటింది.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తాము కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నామని, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కొన్ని రకాల మోడళ్లను అప్‌గ్రేడ్ చేసి విడుదల చేయనున్నామని ఆయన చెప్పారు.
అంతేకాకుండా, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను తీర్చే విధంగా ఓ చిన్న కారును అభివృద్ధి చేసే పనిలో ఉన్నామని, రానున్న జనవరిలో ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో కొత్త ఉత్పత్తులను మొదటిసారిగా ప్రజల ముందుకు తీసుకురానున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి టాటా నానోకు పోటీగా ఓ చిన్న కారును ప్రవేశపెట్టే యోచన లేదని ఆయన స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications








