దేశీయ ఆటోమొబైల్ రంగానికి దీపావళి 'ఢామ్'..!!

ఆర్‌బిఐ కఠిన నిర్ణయాల కారణంగా 'చిచ్చుబుడ్ల' మాదిరిగా పైకెగురుతున్న వడ్డీ రేట్లు మరోవైపు 'తారాజువ్వల్లా' నింగికెగురుతున్న ఇంధన ధరలు, ఇంకొకవైపు 'ఢామ్' అని పేలుతున్న ఉత్పాదక వ్యయం వెరసి ఆటోమొబైల్ తయారీదారులకు దీపావళి రాక మునుపే సదరు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. జులై నెలలో అమ్మకాలు దాదాపు రెండున్నరేళ్ల కనిష్టానికి పడిపోవడంతో రానున్న పండుగ సీజన్‌పై ఆశలు పెట్టుకున్న ఆటో మేకర్లు ఆందోళన చెందుతున్నారు.
మార్కెట్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను అధ్యయంన చేస్తున్న విశ్లేషకులు రానున్న పండుగ సీజన్‌లో కాకుండా వచ్చే నెలల్లోనూ కార్ల అమ్మకాలు మరింత తగ్గే ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. 'ఈ పండగ సీజన్‌లో అమ్మకాల వృద్ధి ఉంటుందని మేం భావించడం లేదు. అధిక ఇంధన ధరలు, వడ్డీ రేట్లతో మార్కెట్ దెబ్బతిన్నది. మరో సారి గనుక వడ్డీ రేట్ల పెంపు జరిగినట్లయితే విక్రయాలపై తీవ్ర ప్రభావాన్నే చూపే ఆస్కారం ఉంద'ని ఇక్రా సీనియర్ విశ్లేషకులు (వాహన రంగం) షంషేర్ దేవాన్ పిటిఐ వార్తా సంస్థతో అన్నారు.
పిడబ్లూసి ఇండియా హెడ్ (ఆటోమోటివ్ ప్రాక్టీస్) అబ్దుల్ మజీద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు పండుగ సీజన్‌పై వాహన పరిశ్రమ పెట్టుకున్న అంచనాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అన్నారు. కాగా.. మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, వచ్చే నెల 16న ఆర్‌బిఐ మధ్యతంతర త్రైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో బ్కాంకు మరోసారి వడ్డీ రేట్లను పెంచవచ్చుని తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే గడచిన మార్చి 2010 నుంచి ఇలా వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోవడం ఇది 12వ సారి అవుతుంది.


Click it and Unblock the Notifications








