అధిక ముడిసరుకుల ధరల కారణంగా.. హిందూజా గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అశోక్ లేలాండ్ తొలి త్రైమాసిక ఫలితాలు భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2011 - మార్చ్ 2012) జూన్ 30, 2011తో ముగిసిన తొలి త్రైమాసికానికి గాను కంపెనీ నికర లాభం 29.67 శాతం క్షీణించి రూ. 86.25 కోట్లకు పడిపోయినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు రూ. 122.64 కోట్లుగా ఉన్నాయి.
అయితే, తొలి త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలు మాత్రం రూ. 2,347.97 కోట్ల నుంచి రూ. 2,495.5 కోట్లకు పెరిగి 6.28 శాతం వృద్ధిని కనబరిచినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ త్రైమాసికంలో ముడిసరుకుల ధరలు పెరిగిన కారణంగా ఉత్పాదక వ్యయం రూ. 1,728.32 కోట్ల నుంచి రూ. 1,960.63 కోట్లకు పెరిగనట్లు కంపెనీ తెలిపింది.