హిందూజ గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ, ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ (ఏఎల్) గత నెల విక్రయాలలో 16 శాతం వృద్ధిని సాధించింది. జులై 2011లో కంపెనీ అమ్మకాలు 7,834 యూనిట్లుగా నమోదైనట్లు ఏఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 6,747 యూనిట్లుగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జులై 2011 నాటికి కంపెనీ మొత్తం అమ్మకాలను గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మార్జినల్‌గా క్షీణించి 28,147 యూనిట్ల నుంచి 27,111 యూనిట్లకు తగ్గాయి.
కాగా.. జులై నెలలో దేశీయ అమ్మకాలు 6,022 యూనిట్ల నుంచి 6,774 యూనిట్లకు మరియు ఎగుమతులు 725 యూనిట్ల నుంచి 1,060 యూనిట్లకు పెరిగాయి. ఏప్రిల్-జులై 2011 నాటికి మొత్తం దేశీయ అమ్మకాలు 25,482 యూనిట్ల నుంచి 23,512 యూనిట్లకు పడిపోయాయి. అయితే, ఇదే సమయానికి కంపెనీ ఎగుమతులు 2,665 యూనిట్ల నుంచి 3,599 యూనిట్లకు పెరిగాయి.