ఫిబ్రవరిలో ఆటోమొబైల్ కంపెనీ విక్రయాలు అదరహో..!

దేశీయ అతిపెద్ద ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) ఫిబ్రవరి నెల విక్రయాలలో కూడా ఒక లక్ష మార్కును అదిగమించి భారీ వృద్ధిని కనబరిచింది. ఫిబ్రవరి, 2011లో కంపెనీ విక్రయాలు 15.51 శాతం వృద్ధిని సాధించి 1,11,645 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది. ఫిబ్రవరి, 2010లో మారుతి సుజికి విక్రయాలు కేవలం 96,650 యూనిట్లుగా ఉన్నాయి. ఇకపోతే దేశీయ మార్కెట్లో విక్రయాలు 19.79 శాతం వృద్ధిని సాధించి 84,765 యూనిట్ల నుంచి 1,01,543 యూనిట్లకు పెరగాయి. కానీ గతేడాదితో పోలిస్తే దిగుమతులు మాత్రం 15 శాతం తగ్గి 11,885 యూనిట్ల నుంచి 10,102 యూనిట్లకు పడిపోయాయి.
హ్యుందాయ్ మోటార్ @ -4.77% :
దేశీయ రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా మాత్రం ఫిబ్రవరి విక్రయాలలో 4.77 శాతం తగ్గుదలను కనబరిచింది. గతేడాది ఫిబ్రవరి నెల విక్రయాలతో ఈ ఏడాది ఫిబ్రవరి నెల విక్రయాలు 54,610 యూనిట్ల నుంచి 52,007 యూనిట్లకు పడిపోయాయి. దేశీయ మార్కెట్లో మాత్రం కంపెనీ విక్రయాలు 31,001 నుంచి 32,629 యూనిట్లకు పెరిగి 5.25 శాతం వృద్ధిని చూపాయి. ఇక ఎగుమతుల విషయానికి వస్తే... 23,609 యూనిట్లను 19,378 యూనిట్లకు పడిపోయి 17.92 శాతం క్షీణతను నమోదు చేసినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
టాటా మోటార్స్ @ +11.69% :
భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఫిబ్రవరి, 2011 విక్రయాలను 69,427 యూనిట్ల నుంచి 77,543 యూనిట్లకు పెంచుకుని 11.69 శాతం వృద్ధిని కనబరిచింది. దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 18.25 శాతం వృద్ధి చెంది 26,985 యూనిట్ల నుంచి 31,909 యూనిట్లకు పెరిగాయి. తమ చిన్నకారు నానో విక్రయాలు ఫిబ్రవరిలో 8,262 యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ పేర్కొంది.
ఫోర్డ్ ఇండియా @ +188% :
అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్ కంపెనీ అనుబంధ సంస్థ ఫోర్డ్ ఇండియా ఫిబ్రవరి విక్రయాలు దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు పేర్కొంది. ఫిబ్రవరి, 2011లో కంపెనీ విక్రయాలలో 188 శాతం వద్ధిని కనబరిచి 9,293 కార్లను విక్రయించింది. ఫిబ్రవరి 2010లో కేవలం 3,223 కార్లను మాత్రమే ఫోర్డ్ విక్రయించగలిగింది. అత్యధిక ఆటో అవార్డులను కైవసం చేసుకున్న ఫిగో విక్రయాలు గణనీయంగా పెరడం వల్లే ఈ వృద్ధిని సాధించగలిగామని కంపెనీ తెలిపింది. గతేడాది భారత మార్కెట్లో విడదైల ఫిగో ఇప్పటి వరకూ 76,000 పైగా అమ్ముడైనట్లు కంపెనీ వివరించింది.
మెర్సిడెస్-బెంజ్ @ +58.81% :
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ కూడా ఫిబ్రవరి నెల విక్రయాలలో భారీ వృద్ధిని కనబరిచింది. ఫిబ్రవరి, 2011లో మెర్సిడెస్ విక్రయాలు 58.81 శాతం పెరుగుదలతో 640 కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు కేవలం 403 యూనిట్లు మాత్రమే. సీ-క్లాస్, ఈ-క్లాస్, ఎస్-క్లాస్ విభాగల్లో విక్రయాలు జోరందుకున్నట్లు కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








