మరోసారి నంబర్ వన్ స్థానంపై కన్నేసిన బిఎమ్‌డబ్ల్యూ

వచ్చే 10 ఏళ్లలో భారత లగ్జరీ కార్ మార్కెట్ 10 రెట్లు వృద్ధి చెంది 1.5 లక్షల యానిట్లకు పెరగవచ్చునని, అప్పుడు తాము 35-40 శాతం మార్కెట్ వాటాను సంపాధించుకోగలమని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ తెలిపారు. భారత్‌లో పెట్టుబడులను విస్తరించే దిశగా తాము అడుగులేస్తున్నామని, ప్రస్తుతం భారత్‌లో రూ. 110 కోట్లుగా ఉన్న తమ పెట్టుబడులను రూ. 180 కోట్లకు పెంచుకోనున్నామని స్కాఫ్ తెలిపారు. చెన్నయ్‌లో తమ ఉత్పత్తి కేంద్రంలో ఇటీవలే కంపెనీ అదనపు స్థలాన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం 22 ఎకరాలలో ఉన్న ప్లాంటును 40 ఎకరాలకు బిఎమ్‌డబ్ల్యూ విస్తరించనుంది.
అంతేకాకుండా.. ఇటీవల చెన్నయ్ ప్లాంటులోని తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాలీనా 8,000 యూనిట్ల నుంచి 10,000 యూనిట్లకు పెంచుకుంది. బ్రాండ్, నెట్‌వర్క్ విస్తరణ, కొత్త ఉత్పత్తులపై పెట్టుబడులను వెచ్చిస్తామని, భారత లగ్జరీ కార్ మార్కెట్లో తమ లీడర్‌షిప్ కొనసాగించేందుకు కృషి చేస్తామని, ప్రస్తుతం భారత్‌లో 20గా ఉన్న తమ డీలర్‌షిప్ కేంద్రాలను 2012 నాటికి 40కు పెంచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
కాగా.. ఇటీవల కేంద్ర బడ్జెట్ 2011లో సికెడి యూనిట్లపై కేంద్ర ప్రభుత్వ సవరణల వల్ల ప్రస్తుతం భారత్‌లో అసెంబ్లింగ్ చేస్తున్న తమ కార్ల ధరలను పెంచుతారా.. అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఇప్పుడే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేమని, ఇది తమపై ప్రభావం చూపుతుందో లేదో అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం చెన్నయ్‌లోని అసెంబ్లింగ్ ప్లాంటులో లగ్జరీ సెడాన్‌లైన 3 సిరీస్, 5 సిరీస్ కార్లను అలాగే.. ఎస్‌యూవీ మోడలే ఎక్స్1 కారును అసెంబ్లింగ్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








