వరుస వడ్డీ రేట్ల పెంపుతో మరింత ప్రియమవుతున్న కార్ లోన్స్

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) ఇటీవలే మరోసారి వడ్డీ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి నుంచి తాజా వడ్డింపుతో కలిపి మొత్తం 11 సార్లు ఆర్‌బిఐ ఇలా వడ్డీ రేట్లను వడ్డిస్తూ కొనుగోలుదారులపై మోయలేని భారం మోపుతోంది. ఆరిబిఐ వడ్డీ రేట్లు పెంచిన తర్వాత వరసుగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా వడ్డింపులు చేయడం మొదలుపెట్టాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) మరియు ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌లు గురువారం తమ రుణ రేట్లను అరశాతం మేర పెంచాయి.
మొత్తం భారత రుణ మార్కెట్‌లో ఈ రెండు బ్యాంకులకు దాదాపు 30 శాతం వాటా ఉంది. ఎస్‌బీఐ రుణ రేట్ల విషయానికి వస్తే కనీస రేటు (బేస్) 10 శాతానికి చేరింది. ప్రామాణిక రేటు (బెంచ్‌మార్క్) 14.75 శాతానికి పెరిగింది. 2010 జూన్ వరకూ తీసుకున్న రుణాలకు కూడా ఈ ప్రామాణిక వడ్డీ రేటు పెంపువర్తిస్తుంది. ఆ తర్వాత తీసుకున్న కొత్త రుణాలకు కనీస రేటు అమలవుతుంది. ఎస్‌బిఐ అందిస్తున్న రుణాలపై తాజా పెంపు కారణంగా.. గృహ, విద్య , వాణిజ్య మరియు ముఖ్యంగా వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి.
ఇక ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్నటువంటి ఐసీఐసీఐ బ్యాంక్ కూడా రుణాలపై వడ్డీ రేట్లును అరశాతం (0.5 శాతం) మేర పెంచింది. ఈ పెంపుతో బ్యాంక్ కనీస రేటు 10 శాతానికి చేరింది. అలాగే ప్రామాణిక రేటు, ఫ్లోటింగ్ రిఫరెన్స్ రేట్లను కూడా అరశాతం మేర పెంచుతున్నట్లు ఐసీఐసీఐ తెలిపింది. అయితే, ఫిక్డ్స్ రేట్ కస్టమర్లపై ఎటువంటి వడ్డీ రేట్ల భారం ఉండబోదని బ్యాంక్ స్పష్టం చేసింది. పెరిగిన కొత్త వడ్డీ రేట్లు ఈ ఆగస్టు 13 నుండి అమలులోకి రానున్నట్లు ఐసీఐసీఐ పేర్కొంది.


Click it and Unblock the Notifications








