ఈనెలలో భారత్‌కు రానున్న ఫెరారీ తొలి ఫోర్-వీల్ డ్రైవ్ కారు

తాజాగా.. ఈ ఫెరారీ ఎఫ్ఎఫ్ సూపర్ కారును అక్టోబర్ నెలాఖరున దేశీయ విపణిలోకి విడుదల చేయాలని ఫెరారీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫెరారీ ఎఫ్ఎఫ్ స్పోర్ట్స్ కారు ఫెరారీ కంపెనీ నుండి వస్తున్న తొలి ఫోర్-వీల్ డ్రైవ్ కారు. ఫస్ట్ ఫోర్-వీల్ డ్రైవ్ అనే సంకేతాన్ని ప్రతిబింభించేలా ఈ మోడల్‌కు ఫెరారీ ఎఫ్ఎఫ్ (ఫెరారీ ఫస్ట్ ఫోర్-వీల్) అనే పేరును కంపెనీ నిర్ణయించింది.
ఇటీవల జనీవాలో ముగిసిన 81 అంతర్జాతీయ మోటార్ షోలో ఫెరారీ ఈ మోడల్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఎఫ్ఎఫ్ కారు ముందువైపు డిజైన్ చూడటానికి దాదాపు 458 ఇటాలియాలా మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఫెరారీ ఎఫ్ఎఫ్, ఇటాలియన్ కార్‌మేకర్ అందిస్తున్న తొలి ఫోర్-వీల్ డ్రైవ్ మోడల్ మాత్రమే కాకుండా.. కంపెనీ నుంచి తొలి హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ కూడా కావడం విశేషం.
రెండు డోర్లు కలిగిన ఫెరారీ ఎఫ్ఎఫ్ నాలుగు సీట్లతో అధిక లగేజ్ స్థలాన్ని కలిగి ఉంటుంది. వెనుక సీట్లలో కూర్చోవాలంటే డ్రైవర్ పక్క సీటును ముందుకు వాల్చి కారు లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. కారు వెనుక భాగంలో రెండు గల్ఫ్ క్లబ్ కిట్లను పూర్తిగా స్టోర్ చేసుకునేంత స్థలం (బూట్ స్పేస్) ఉంటుంది. అవసరం లేదనుకున్నప్పుడు వెనుక సీట్లను మడుచుకునే ఆస్కారం కూడా ఉంది.
ఫెరారీ ఎఫ్ఎఫ్ 6-లీటర్ వీ12 ఇంజన్‌తో 660 బిహెచ్‌పిల శక్తిని, 683 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది కేవలం 3.7 సెకండ్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో ఫెరారీ ఎఫ్ఎఫ్ లభ్యమవుతుంది. సాధారణ ఫోర్-వీల్ డ్రైవ్ మోడల్ కార్ల కంటే కూడా 50 శాతం తక్కువ బరువు ఉండేలా ఈ కారును రూపొందించారు. దేశీయ మార్కెట్లో దీని ధర రూ.3.5 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








