సిబియూ ద్వారా భారత్‌కు మరిన్ని ఉత్పత్తులు: ఫియట్

"భారత్‌లో కొత్త మోడళ్లను విడుదల చేయడానికి వివిధ మార్గాలు మరియు అవకాశాలు ఉన్నాయి, అందులో సిబియూ కూడా ఒకటి. ప్రతి మార్గం కూడా మా కోసం ఓపెన్ చేయబడి ఉంది, మేము ఇప్పటకీ అంచనా వేస్తున్నామ"ని ఫియట్ ఇండియా అధ్యక్షుడు మరియు సీఈఓ రాజీవ్ కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం టాటా మోటార్స్ కంపెనీతో జాయింట్ ద్వారా ఫియట్ భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తమ కంపెనీలోని ఇద్దరు బోర్డ్ డైరెక్టర్లను ఫియట్ రీప్లేస్ చేసి బోర్డును పునఃనిర్మించింది.
అయితే, ఈ చిన్న కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను, విడుదల తేదీని వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. ఇటలీలోని టురిన్‌లో ఉన్న ఫియట్ ఆర్ అండ్ డి కేంద్రంలో భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఓ చిన్న కారును కంపెనీ అభివృద్ధి చేస్తోంది. "చిన్న కారు అభివృద్ధి దశలో ఉంది. ఈ చిన్న కారును 2012లో విడుదల చేస్తామని గతంలోనే మేము ప్రకటించడం జరిగింది. ఈ ఉత్పత్తిని పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన తర్వాత ఖచ్చితమైన సమయం మరియు ఇతర వివరాలను పంచుకుంటామ"ని కపూర్ చెప్పారు.
గతేడాది జనవరిలో జరిగిన ఆటో షోలో భారత మార్కెట్ కోసం ప్రత్యేకించి ఓ చిన్నకారును అభివృద్ధి చేస్తున్నామని, దీన్ని 80-85 శాతం స్థానిక విడిభాగాలతోనే నిర్మిస్తామని కంపెనీ తెలిపింది. మహారాష్ట్రలోని రంజన్‌గావ్ ప్లాంటులో ఈ చిన్న కారును నిర్మించే అవకాశం ఉంది. పాలియో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే లేదా అంతకన్నా చిన్నగా తమ కాంపాక్ట్ కారు ఉండబోతుందని కపూర్ తెలిపారు. మరోవైపు టాటా మోటార్స్ అధినేత రతన్ టాటా గత నెలలో ఓ ఇంటర్వ్యూలో ఫియట్-టాటాల జాయింట్ వెంచర్ గురించి ప్రస్థావిస్తూ.. ఫియట్ భారత్ మార్కెట్లో మరిన్ని ఉత్పత్తులను విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ జేవీని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫియట్ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించడం గమనార్హం.


Click it and Unblock the Notifications








