భారత్ కోసం గ్లోబల్ స్మాల్ కారును అభివృద్ధి చేస్తున్న ఫోర్డ్

ఫోర్డ్ ఇండియా ఇప్పటికే భారత్‌లో ఓ చిన్న కారు ఫిగోను అందిస్తోంది. అయితే, ప్రస్తుతం భారత్‌లో దీని ధర రూ. 3.59 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో ఫోర్డ్ ఫిగోకు దిగువన ఓ చిన్న కారును దేశీయ మార్కెట్ కోసం అలాగే ప్రపంచ మార్కెట్ల కోసం అభివృద్ధి చేయాలని కంపెనీ నిర్ణయించింది.
భారత్‌లో తమ రెండో ప్లాంటును ఏర్పాటు చేయదలచిన ఫోర్డ్, సదరు ప్లాంటు ఏర్పాటుకు గుజరాత్‌ను ఎంచుకున్న విషయం విదితమే. గుజరాత్‌లోని సనంద్‌లో (టాటా నానో ప్లాంటుకు సమీపంలో) ఫోర్డ్ తన రెండో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంటులో ఫోర్డ్ తన గ్లోబల్ స్మాల్ కారును ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయి.
మారుతి సుజుకి ఏ-స్టార్, హ్యుందాయ్ ఐ10 కార్లను లక్ష్యంగా చేసుకొని ఫోర్డ్ ఈ చిన్న కారును అభివృద్ధి చేస్తోంది. ఫోర్డ్ చరిత్రలనే ఇది అత్యంత చౌక కారుగా నిలువనుంది. కొత్త ప్లాంటు ఏర్పాటుకు గుజరాత్ సర్కారుతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఫోర్డ్, ఈ ప్లాంటును ఎగుమతుల హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొంది.
ఫోర్డ్ చిన్న కారు 2014 నాటికి మార్కెట్లోకి వచ్చే ఆస్కారం ఉంది. దీని ధర కూడా రూ. 3 లక్షల నుండి రూ. 4 లక్షల వరకూ ఉండే అవకాశాలున్నాయి. ఫోర్డ్ తన గ్లోబల్ స్మాల్ కారును బ్రెజిల్ యూనిట్‌లో అభివృద్ధి చేస్తుందని, దీనిని భారత్‌లో ఉత్పత్తి చేయడానికి ఇప్పటికే కొన్ని దేశీయ విడిభాగాల తయారీ సంస్థలతో చర్చలు కూడా జరుపుతోందని పరిశ్రమ వర్గాల సమాచారం. మరి భారత చిన్న కార్ల రేసులో ఫోర్డ్ పరిగెడుతుందో లేక నిలబడుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications








