ఆల్టో వేగానికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతున్న ఇయాన్

ప్రస్తుతం భారత మార్కెట్లో ఎంట్రీ-లెవల్ ప్యాసింజర్ కార్ విభాగంలో మారుతి సుజుకి ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు ఆల్టో. అయితే, మారుతి ఆల్టో వేగానికి చెక్ పెట్టేందుకు హ్యుందాయ్ ఓ కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంది. హ్యుందాయ్ అభివృద్ధి చేస్తున్న చిన్న కారు "ఇయాన్" విడుదలకు ముస్తాబవుతోంది. ఆల్టో సగటున ప్రతి నెలా 25,000-30,000 కార్లు అమ్ముడవుతాయి.
హ్యుందాయ్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా తయారుచేయని విధంగా తమ తొలి అత్యంత చిన్న కారును ప్రత్యేకించి భారత మార్కెట్ కోసం రూపొందించింది. ప్రధానంగా గ్రామీణ, పట్టణ ప్రాంత మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని హెచ్ఏ 800 ప్రాజెక్ట్ పేరుతో హ్యుందాయ్ అభివృద్ధి చేసిన ఈ చిన్న కారుకు ఇటీవలే ఇయాన్ అనే పేరును ఖరారు చేసిన సంగతి తెలిందే.
ఏ సెగ్మెంట్లో భారతీయ కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా, ప్రత్యేకించి భారత మార్కెట్ కోసం హ్యుందాయ్ రూపొందించిన ఇయాన్ కారు వచ్చే నెలలో భారత రోడ్లను తాకవచ్చునని సమాచారం. హ్యుందాయ్ రూపొందిస్తున్న అన్ని కార్లలో ఉపయోగించే ఆరు ఫ్లాట్‌ఫామ్‌లలో ఒకదాని ఆధారంగా ఇయాన్ కారును రూపొందించారు. ఏ మరియు బి సెగ్మెంట్లలో నిలవనున్న ఇయాన్ యువ కొనుగోలుదారులను ఎక్కువగా ఆకట్టుకోనుంది.
3.5 మీటర్ల పొడవు ఉండే హ్యుందాయ్ ఇయాన్, సరికొత్త ఇంటీరయర్స్ మరియు స్పోర్టీ లుక్‌తో చూడగానే అయస్కాంతంలా ఆకర్షించనుంది. ఇది 800 సీసీ ఇంజన్‌ను కలిగి ఉన్నప్పటికీ, 56 పిఎస్‌ల గరిష్ట శక్తిని మరియు 7.65 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. శాంత్రో కారులో ఉపయోగించిన గేర్‌బాక్సునే ఇయాన్‌లో కూడా ఉపయోగించనున్నారు. దీని ధర కూడా మూడ లక్షల రూపాయలకు దిగువన ఉండనుంది.


Click it and Unblock the Notifications








