రానున్న రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో రెండు వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు టాటా సంస్థకు చెందిన జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్ఆర్) ప్రకటించింది. దీని ద్వారా తమ కంపెనీ హెడ్‌కౌంట్‌ను 11 శాతానికి పెంచుకోవాలని భావిస్తున్నట్లు జెఎల్ఆర్ పేర్కొంది. ఈ ఏడాది ఒక్క యుకెలోనే 400 కొత్తగా నియమించుకోనున్నామని, నియామకాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఇప్పటి వరకూ 280 మంది గ్రాడ్యుయేట్లను వివిధ హోదాల్లో తీసుకున్నట్లు కంపెనీ వినరించింది. ప్రస్తుతం జాగ్వార్ లాండ్ రోవర్‌లో అంతర్జాతీయంగా 18,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
2012 నాటికి తమ ఉద్యోగుల సంఖ్యను 20,000 పెంచుకునే దిశగా నియామకాలు చేపడుతున్నట్లు కంపెనీ పేర్కొంది. అంతకు ముందు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా.. కంపెనీ 2,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అయితే తాజాగా.. ఆటో రంగం జోరుగా వృద్ధి చెందుతుండటంతో కంపెనీ మళ్లీ నియామకాలపై దృష్టి సారించింది. 2008లో అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్ కంపెనీ నుంచి టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను సొంతం చేసుకుంది.