జనవరిలో జోరుగా సాగిన ఆటోమొబైల్ కంపెనీల విక్రయాలు

మారుతి: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉన్న మారుతి మరోసారి నెలసరి విక్రయాలలో లక్షమార్కును అధిగమించింది. జనవరిలో మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) విక్రయాలు 14.73 శాతం వృద్ధిని సాధించి 1,09,743 యూనిట్లుగా నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే సమయంలో మారుతి విక్రయాలు 95,649 యూనిట్లుగా ఉన్నాయి. ఒక్క దేశీయ మార్కెట్లోనే 1,00,422 యూనిట్లను విక్రయించామని, మరో 9,321 యూనిట్లను ఎగుమతి చేశామని సంస్థ వివరించింది. జనవరి అమ్మకాల్లో ఎ2 సెగ్మెంట్‌లో 23.8 శాతం, ఎ3 సెగ్మెంట్‌లో 32.6 శాతం, సి సెగ్మెంట్‌లో 27.7 శాతం వృద్ధిని సాధించామని కంపెనీ తెలిపింది. అయితే మారుతి ఎమ్ 800 మోడల్ విక్రయాలు మాత్రం గతేడాదితో పోలిస్తే 24.77 శాతం క్షీణించి 2,494 యూనిట్ల నుంచి 1,876 యూనిట్లకు పడిపోయాయి.
టాటా మోటార్స్: దేశీయ రెండవ అతిపెద్ద ఆటో దిగ్గజం టాటా మోటర్స్ జనవరి నెల విక్రయాలలో 15 శాతం వృద్ధిని కనబరిచింది. ఈ నెలలో ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలతో కలిపి మొత్తం 75,423 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 65,478 యూనిట్లుగా ఉన్నాయి. టాటా దేశీయ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 13 శాతం వృద్ధి చెంది 70,475 యూనిట్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం ఇదే సమయంలో 62,202 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఏప్రిల్ 2010-జనవరి 2011 నాటికి టాటా మోటార్స్ మొత్తం విక్రయాలు 29 శాతం వృద్ధి చెంది 6,42,416 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో ఇవి 4,98,109 యూనిట్లుగా ఉన్నాయి.
హీరోహోండా: ద్విచక్రవాహన తయారీలో అగ్రగామిగా ఉన్న హీరోహోండా మోటర్స్ లిమిటెడ్ కూడా జనవరి నెల విక్రయాలలో భారీ వృద్ధిని కనబరిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన 9 నెలలతో పోలిస్తే జనవరిలో నాలుగు లక్షలకు పైగా వాహనాలను విక్రయించింది. జనవరి 2011లో హీరోహోండా 4,66,524 వాహనాలను విక్రయించి 20 శాతం వృద్ధిని కనబరచగా.. జనవరి 2010లో కంపెనీ 3,89,802 యూనిట్లను విక్రయించింది. ఏప్రిల్ 2010-జనవరి 2011 నాటికి హీరోహోండా మొత్తం 44,14,537 వాహనాలను విక్రయించింది. గత సంవత్సరంలో ఇదే సమయానికి 38,03,396 వాహనాలను విక్రయించినట్లు హీరోహోండా ప్రకటించింది. హీరో గ్రూపు, హోండా మోటార్ సంస్థలు విడిపోనున్నప్పటికీ ఆ ప్రభావం విక్రయాలపై పడకపోవటం గమనార్హం.
బజాజ్ ఆటో: ద్విచక్రవాహన ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద కంపెనీ అయిన బజాజ్ ఆటో జనవరి విక్రయాలలో 18 శాతం వృద్ధిని కనబరిచింది. పల్సర్, డిస్కవర్ మోడళ్లకు డిమాండు పెరగడంతో జనవరి, 2011లో విక్రయాలు 3,13,583 యూనిట్లకు పెరిగాయి. గత జనవరిలో కంపెనీ విక్రయాలు 2,66,018 యూనిట్లుగా ఉన్నాయి. బజాజ్ మొత్తం విక్రయాలలో పల్సర్, డిస్కవర్ విక్రయాలే 68 శాతం ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇకపోతే వాణిజ్య వాహన విభాగంలో బజాజ్ ఆటో 15 శాతం వృద్ధిని సాధించి 37,961 యూనిట్లను విక్రయించగా.. అంతకుముందు సంవత్సరం ఇవి 32,969 యూనిట్లుగా ఉన్నాయి.
టీవీఎస్ మోటర్స్: చెన్నయ్‌కి చెందిన ద్విచక్రవాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటర్ కంపెనీ జనవరి నెల వాహన విక్రయాలలో 30 శాతం వృద్ధిని సాధించి 1,65,152 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 1,27,288 యూనిట్లుగా ఉన్నాయి. టూవీలర్ విభాగంలో 29 శాతం వృద్ధిని సాధించి 1,61,725 యూనిట్లను విక్రయించగా.. మోటార్‌సైకిల్ విభాగంలో 24 శాతం వృద్ధితో 67,721 వాహనాలు విక్రయించినట్లు కంపెనీ వివరిచించింది. ఇకపోతే స్కూటర్ విభాగంలో 60 శాతం వృద్ధిని సాధించి 40,736 స్కూటర్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.
హోండా మోటర్: జర్మనీకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ హోండా మోటార్ కార్పోరేషన్ అనుబంధ సంస్థ అయిన ద్విచక్రవాహన తయారీ కంపెనీ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎమ్ఎస్‌ఐ) జనవరి నెల విక్రయాలలో 8.89 శాతం వృద్ధిని సాధించి 1,29,110 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరం జనవరి నెలలో కంపెనీ విక్రయాలు 1,18,571 యూనిట్లుగా ఉన్నాయి. మోటార్‌సైకిల్ విభాగంలో 22.06 శాతం వృద్ధిని సాధించి 58,365 విక్రయించగా.. స్కూటర్ విభాగంలో మాత్రం విక్రయాలు 11 శాతం క్షీణించి 70,745కు పడిపోయినట్లు కంపెనీ తెలిపింది.
యమహా మోటార్: ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా జనవరి, 2011 అమ్మకాలలో 27.62 శాతం వృద్ధిని సాధించి 28,597 యూనిట్లను విక్రయించింది. జనవరి, 2010లో ఈ విక్రయాలు 22,408 యూనిట్లుగాన్న ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది తొలినెలలో ఒక్క దేశీయ విక్రయాలలోనే 24.87 శాతం వృద్ధిని కనబరిచి 21,974 వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరంలో యమహా దేశీయ విక్రయాలు 17,598 యూనిట్లుగా ఉన్నాయి.
సుజుకీ మోటార్‌సైకిల్: ద్విచక్రవాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా ఈ ఏడాది జనవరి విక్రయాలలో 40 శాతం వృద్ధిని సాధించి 28,598 యీనిట్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 20,448 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. జపాన్‌కు చెందిన సుజికీ మోటార్ కార్పోరేషన్ అనుబంధ సంస్థే సుజికీ మోటార్‌సైకిల్ ఇండియా (ఎస్ఎమ్ఐ). యాక్సెస్ 125, స్లింగ్‌షాట్, జీఎస్ 150 ఆర్, హయబుసా 1300, బండింట్ 1250 ఎస్ వంటి మోడళ్లను ఎస్ఎమ్ఐ అందిస్తుంది.
నిస్సాన్ మోటార్: జపాన్‌కు చెందిన నిస్సాన్ మోటార్ కార్పోరేషన్ అనుబంధ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా ఈ ఏడాది జనవరి నెలల విక్రయాలలో 40 శాతం వృద్ధిని సాధించి అత్యధిక నెలసరి విక్రయాలను నమోదు చేసుకుంది. జనవరి 2011లో కంపెనీ విక్రయాలు 1,857 వాహనాలను విక్రయించింది. ఇందులో ఒక్క "నిస్సాన్ మైక్రా" కారు విక్రయాలే 1,784 యూనిట్లుగా ఉన్నాయి. గత జులైలో విడుదలైన మైక్రా కారు ఇప్పటివరకూ 8,225 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత జనవరిలో కేవలం 10 కార్లు మాత్రమే అమ్ముడైన ఎస్‌యువి సెడాన్ 'నిస్సాన్ ఎక్స్-ట్రెయిల్' ఈ జనవరిలో 52 కార్లు అమ్ముడయ్యాయి.
హోండా సియోల్: హోండా సియల్ కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎస్‌సీఎల్) జనవరి నెల అమ్మకాలలో 6.3 శాతం వృద్ధిని సాధించి 6,358 కార్లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే సమయంలో 5,983 కార్లను మాత్రమే విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.
స్కోడా: ప్రముఖ లగ్జరీ కార్ల ఉత్పత్తి సంస్థ స్కోడా ఆటో జనవరి నెల అమ్మకాలలో 50 శాతం వృద్ధిని సాధించి 2,825 కార్లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ 1,881 యూనిట్లను విక్రయించిది.
జనరల్ మోటర్: అమెరికాకు చెందిన జనరల్ మోటర్స్ అనుబంధ సంస్థ జనరల్ మోటర్స్ ఇండియా (జీఎమ్ఐ) జనవరి నెల విక్రయాలలో ఆరు శాతం వృద్ధిని సాధించి 9,984 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో విక్రయాలు 9,421 యూనిట్లుగా ఉన్నాయి.
హ్యుందాయ్ మోటర్: ప్రము కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటర్ జనవరి విక్రయాలలో నిరాశజనక ఫలితాలను నమోదు చేసుకుంది. ఈ నెలలో విక్రయాలు 17.7 శాతం తగ్గి 43,316 యూనిట్లకు పడిపోయాయి. గత జనవరిలో కంపెనీ విక్రయాలు 52,628 యూనిట్లుగా ఉన్నాయి.
మహీంద్రా ట్రాక్టర్స్ :మహీంద్రా అండ్ మహీంద్రా వ్యవసాయ పరికరాల విభాగంలో 21 శాతం వృద్ధిని సాధించి 20,499 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 16,879 యూనిట్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








