జపాన్ సునామీ: ఆటో రంగాన్ని వేధిస్తున్న పిగ్మెంట్ కొరత

కారు అసెంబ్లింగ్ సమయంలో ఓ చిన్న బోల్ట్ లేకపోయినా కూడా ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో.. తాజాగా సంభవించిన ప్రకృతి వైపరీత్యం కారణంగా దాదాపు 500కుపైగా ఇలాంటి పార్ట్‌లను సరఫరా చేసే కంపెనీలు దెబ్బతిన్నాయి. దీంతో విడిభాగాల సరఫరా నిలిచిపోయి ఉత్పత్తి ఆటంకం వాటిల్లుతోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు దాదాపు కార్ల ఉత్పత్తి పూర్తచేసినప్పటికీ.. తుది మెరుగులు అద్దేందుకు ఓ ప్రత్యేకమైన పెయింట్ కొరత కారణంగా.. వినియోగదారుల నుంచి తీసుకునే ఆర్డర్లను పరిమితం చేశాయి.
కార్లకు బ్లాక్, రెడ్ వంటి మెరిసే షేడ్స్ రావాలంటే.. కొన్ని ప్రత్యేకమైన పిగ్మెంట్‌లను వాడాలి. కానీ.. జపాన్ సునామీలో సదరు పెయింట్ కంపెనీలు కూడా నష్టపోవడంతో పెయింట్ కొరత ఏర్పడి వాహనాలు తుది ఉత్పత్తి నోచుకోలేకపోతున్నాయి. ఆటోమొబైల్ దిగ్గజాలైన క్రిస్లర్ గ్రూప్ ఎల్ఎల్‌సి, టొయోటా మోటార్ కో, జనరల్ మోటార్స్ కో, ఫోర్డ్ మోటార్ కో వంటి కంపెనీలు జిరాలిక్ అనే పిగ్మెంట్‌ను వాడుతాయి. ఈ జిరాలిక్ పిగ్మెంట్ ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక్క ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఇది జపాన్‌లోని ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంటుకు సమీపంలో ఉన్న ఓన్హామా ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతుంది.
ఈ ప్లాంట్‌ను జర్మనీకు చెందిన రసాయన కంపెనీ మెర్క్ కెగా నిర్వహిస్తోంది. అయితే భూకంపం కారణంగా ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో సంభంవించిన పేలుడుతో అక్కడ నెలకొన్న ఆందోళనకర పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాకపోవడంతో.. ఈ ప్లాంటు ఇంత వరకూ పునఃప్రారంభానికి నోచుకోలేదు. ఈ విషయంపై మెర్క్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సంబంధించిన అనుమతులు ఎప్పుడు వస్తాయో తెలియదని చెప్పారు. మార్చి 11 నుచి ఈ ప్లాంటు మూసివేయబడి ఉంది.


Click it and Unblock the Notifications








