ఇంకా వీడని సునామీ ఛాయలు.. కష్టాల్లో ఆటో కంపెనీలు

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. యూరప్‌లోని ఐదు ప్లాంట్లను టొయోటా తాత్కాలికంగా మూసివేయనుంది. అలాగే కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించనుంది. ఇలా ఉత్పత్తిని భారీగా నష్టపోతున్న కంపెనీలలో టొయోటా మాత్రమే కాకుండా.. మెర్సిడెస్ బెంజ్ మాతృసంస్థ అయిన డైమ్లర్, ఫోర్డ్, హోండా వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి. జపాన్ సునామీ తమ సప్లయ్ చైన్‌పై తీవ్ర ప్రభావం చూపునుందని డైమ్లర్ పేర్కొంది. అలాగే.. యూరప్‌లోని ఐదు ప్లాంట్లలో ఫోర్డ్ మోటార్ కంపెనీ ఉత్పత్తిని నిలిపివేసింది.
హోండా మోటార్స్ కంపెనీ కూడా విడిభాగాల కొరత కారణంగా పలు చోట్ల కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడం జరిగింది. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకిపై కూడా ఇది ప్రభావం చూపనుంది. ముఖ్యంగా మారుతి సుజుకి తొలిసారిగా భారత్‌లో విడుదల చేసిన దేశీయ లగ్జరీ కారు కిజాషి వినియోగదారుల చెంతకు రావడానికి మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కిజాషిని మారుతి మాతృ సంస్థ అయిన సుజుకీ మోటార్ కార్పోరేషన్ పూర్తిగా జపాన్‌లో తయారు చేసి భారత్‌లోకి దిగుమతి చేస్తుంది.
నిస్సాన్ అందిస్తున్న టీనా సెడాన్ కారు విషయంలోనూ ఇదే ప్రభావం కనపడనుంది. ఈ ప్రృకృతి భీభత్సం కారణంగా మారుతి సుజుకి గత నెలలో కోటి కార్ల ఉత్సవాలను రద్దు చేసుకోగా.. తమ చిన్న కారు "బ్రయో" విడుదలను హోండా వాయిదా వేసింది. అలాగే.. బెంగుళూరులోని రెండో ప్లాంటు ప్రారంభోత్సవాన్ని టొయోటా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందోనని ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే తాము నష్టాల బాట పట్టే అవకాశం ఉందని ఆటో కంపెనీలు వాపోతున్నాయి.


Click it and Unblock the Notifications








