భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి సరైన మౌలిక సదుపాయాలు లేని కారణంగా తమ ఎలక్ట్రిక్ కారును ఇక్కడి మార్కెట్‌కు తీసుకురాలేక పోతున్నామని అమెరికా ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ పేర్కొంది. ఇటీవల తమ ఎలక్ట్రిక్ కారును ఢిల్లీలో ప్రదర్శించడం ద్వారా ఇందుకు కావాల్సిన టెక్నాలజీ తమ వద్ద ఉందని నిరూపించుకున్నామని, కానీ భారత్‌లో మౌలిక సదుపాయాల కొరత కారణంగా ప్రత్యేకించి విద్యుత్తుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు సరపడినంత లేని కారణంగానే.. భారత్‌లో ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టే విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు జనరల్ మోటార్స్ ఇండియా ఉపాధ్యక్షుడు పి. బాలేంద్రన్ తెలిపారు.
ప్రస్తుతం దేశీయ అవసరాలకే విద్యుత్ సరిపోవడం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో కార్ బ్యాటరీ రీఛార్జింగ్ కోసం అధనంగా విద్యుత్తును ఉపయోగించడం కష్టమవుతుందని, ఈ పరిస్థితులే ఓ ఎలక్ట్రిక్ కారును భారత్‌లో విడుదల చేసేందుకు అడ్డంకులుగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. జనరల్ మోటార్స్ ఇటీవలే భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన కంపెనీ తొలి డీజిల్ కారును కోయంబత్తూర్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా బాలేంద్రన్ ఈ విషయాన్ని వెల్లడించారు.