ముడి సరుకుల ధరల నెపంతో ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను మూడు నెలల్లోనే రెండోసారి పెంచి వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తమ వాహనాల ధరలను రూ. 15,000 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. అధిక కమోడిటీ ధరల కారణంగా అన్ని రకాల వాహనలపై ధరలను 1.5 శాతం నుంచి 2 శాతం మేర పెంచుతున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా అధ్యక్షుడు (ఆటోమోటివ్ అండ్ ఫామ్ ఎక్విప్‌మెంట్) పవన్ గియోన్కా తెలిపారు. మోడల్‌ను బట్టి ధరలు రూ. 7,000 నుంచి రూ. 15,000 వరకూ పెరుగుతాయని ఆయన చెప్పారు. పెరిగిన ధరలు గత వారం నుంచే అమలులోకి రానున్నాయని కంపెనీ పేర్కొంది.
స్కార్పియో, బొలెరో వంటి యుటిలిటీ వాహనాలతో పాటు త్రిచక్ర వాణిజ్య వాహనాలను, సెడాన్ మోడల్ కారు లోగాన్‌ను కూడా కంపెనీ తయారుచేసి విక్రయిస్తుంది. కాగా.. ఈ సంవత్సరంలో మహీంద్రా అండ్ మహీంద్రా తమ వహనాల ధరలను పెంచడం ఇది రెండోసారి. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి నెలలో ఎమ్ అండ్ ఎమ్ వాహన ధరలను 1.5 శాతం మేర పెంచింది. దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి కూడా.. ఇదే కారణంతో ఏప్రిల్ 4వ తేదీ నుంచి అన్ని మోడళ్ల ధరలను రూ. 1,100 నుంచి రూ. 9,000 మేర పెంచిన సంగతి తెలిసిందే.