కార్లపై ప్రకటనలతో నెలకు రూ. 25,000 సంపాధించుకోవచ్చు

ఏదైనా ఒక ఉత్పత్తి ప్రజల వద్దకు చేరవేయాలంటే వ్యాపార ప్రకటనలే ప్రధాన మార్గం. మొన్న పత్రికలు, నిన్న టెలివిజన్లు, నేడు అంతర్జాలం (ఇంటర్నెట్), కంపెనీల ప్రకటనలకు ఇవే ప్రధాన ప్రసారమాధ్యమాలు. ఇవి కాకుండా.. కంపెనీలు స్వచ్ఛందంగా నిర్వహించే ఇతర ప్రచారాల ద్వారా కూడా తమ ఉత్పత్తుల గురించి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తుంటారు. అయితే.. ప్రస్తుతం ట్రెండ్ మారింది, ప్రకటనల స్టైల్ మారింది. సాధారణంగా పల్లెల్లోని బస్సులపై మనం ప్రభుత్వ, ప్రైవేటు ప్రకటనలను గమనిస్తుంటాం. ఇప్పుడు సిటీల్లోనూ ఈ సాంప్రదాయం మొదలైంది.
అయితే.. ఇక్కడ ప్రకటనలు సిటీ బస్సులపై కాదండోయ్.. సిటీలో సంచరించే కార్లపై. కార్లపై అడ్వర్టయిజింగ్‌లు ఇచ్చే కంపెనీలు ప్రస్తుతం బోలెడు ఉన్నాయి. క్యాష్‌డ్రైవ్, కార్‌పైసా, అటోమీటర్ వంటి ఎన్నో కంపెనీలు వ్యాపార ప్రకటనల కోసం కార్లపై స్థలాన్ని కొనుగోలు చేస్తున్నాయి. నగరాల్లో సంచరించే కార్లపై వ్యాపార ప్రకటన ఉండడం మూలంగా అది ఎక్కువమంది దృష్టిని ఆకర్షించి, సదరు ఉత్పత్తికి సంబంధించిన సమాచారం వేగంగా ప్రజల్లోకి వెళ్తుందని ఆ కంపెనీల అభిప్రాయం. ఇలా కార్లపై ప్రకటనలు చేయడం వల్ల వివిధ కంపెనీల ఉత్పత్తులకు ప్రచారం కావడంతో పాటు కారు ఓనర్లకు ప్రతి నెలా కొంత సొమ్ము అందుతుంది.
ఒక్కో కారు ప్రకటనపై సుమారు రూ. 20,000 వరకూ సంపాధించుకోవచ్చు. మరి దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలనే కదా మీ సందేహం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా.. కార్ అడ్వర్టైజింగ్ కంపెనీల వెబ్‌సైట్లలో రిజిస్టర్ చేసుకోవడమే. ఇందులో ముఖ్యంగా తాము రోజు ప్రయాణించే రూటు మరియు దూరాన్ని తెలియజేయాలి. ప్రతిరోజు కారు ప్రయాణించే కిలో మీటర్లను బట్టి డబ్బులు చెల్లిస్తారు. అలాగే కారుపై ప్రకటన సైజును బట్టి కూడా చెల్లింపు వేరు వేరుగా ఉంటుంది. ఉదాహరణకు కారు మొత్తంపై ప్రకటన ఉంటే ఒక రేటు, కేవలం డోర్ల వరకు మాత్రమే అయితే మరోరేటు, కారును వెనక భాగం లేదా ముందు భాగం అయితే ఇంకో రేటు ఉంటుంది.
ఇంకా కారుపై మనం కేటాయించే స్థలాన్ని బట్టి కూడా పరిహారం ఉంటుంది. దీన్నిబట్టే నెలకు రూ. 1,000 నుండి రూ. 25,000 కారు యజమానులు సంపాధించుకోవచ్చు. కారును లోన్‌లో కొన్న వారికి ఇది మంచి అవకాశం కాకపోతే.. దీని వెనుక చాలా తతంగమే ఉంది. వ్యక్తిగత కారు అయినా లేదా ప్రైవేట్ క్యాబ్ అయినా సరే.. రోజుకు ఎన్ని కిలో మీటర్లు తిరుగుతుందనే దానిపై చెల్లింపు ఆధారపడి ఉంటుంది. కారుపై ప్రకటన వేయించుకుని ఇంట్లో పెట్టుకుంటే చెల్లదు. వాణిజ్య వాహనాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అంటే రోజుకు ఎన్ని ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణిస్తే అంతా లాభం అన్నమాట.


Click it and Unblock the Notifications








