మారుతి, హ్యుందాయ్, టాటా కంపెనీల మార్కెట్ వాటాలకు గండి..!

అయితే దేశీయ ఆటోమొబైల్ రంగంలో త్రిమూర్తులుగా ఉన్న మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్, టాటా మోటార్స్ కంపెనీలకు ఇప్పుడు తమ మార్కెట్ స్థానాలను నిలబెట్టుకోవడం పెద్ద తలనొప్పిగా మారుతోంది. భారత మార్కెట్లోకి కొత్తగా ప్రవేశిస్తున్న ఆటో కంపెనీలు దేశీయ దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఫోర్డ్ ఇండియా తమ చిన్న కారు ఫిగోతో మార్కెట్లో దూసుకుపోతుంది. అలాగే ఫోక్స్‌వ్యాగన్, జనరల్ మోటార్స్ వంటి కంపెనీలు కూడా కొత్త మోడళ్లతో భారత వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఫలితంగా భారత కార్ మార్కెట్లో నంబర్ స్థానంలో ఉన్న మారుతి సుజుకి ఇండియా ప్యాసింజర్ కారు సెగ్మెంట్‌లో 2009-10లో 50.09 శాతం వాటా ఉంటే 2010-11లో అది 48.74 శాతానికి పడిపోయింది. అయితే ఈ సమయంలో మారుతి దేశీయ విక్రయాలను మాత్రం గణనీయంగా పెంచుకుంది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో 7,65,533 కార్లను విక్రయించిన మారుతి 2010-11లో 9,66,477 విక్రయించింది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2010-11 ఆర్థిక సంవత్సరంలో మొత్తం దేశీయ కార్ల విక్రయాలు 29.73 శాతం పెరిగి 19,82,702 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకు మనుపు ఆర్థిక సంవత్సరంలో మొత్తం దేశీయ కార్ల అమ్మకాలు 15,28,337 యూనిట్లుగా ఉన్నాయి.
ఇకపోతే భారత్‌లో రెండవ అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉన్న హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా తమ మార్కెట్ వాటాలో తగ్గుదలను చవి చూసింది. 2009-10లో దేశీయ కార్ మార్కెట్లో 20.61 శాతంగా హ్యుందాయ్ వాటాలు 2010-11లో 18.10 శాతానికి పడిపోయాయి. 2010-11లో హ్యుందాయ్ 3,58,904 కార్లను విక్రయిస్తే.. అంతకు ముందు సంవత్సరంలో 3,14,967 కార్లను విక్రయించింది. కాగా.. మార్కెట్లో తృతీయ స్థానంలో ఉన్న టాటా మోటార్స్ కూడా తమ మార్కెట్ వాటాను దిగజార్చుకుంది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో 13.18 శాతంగా టాటా మోటార్స్ మార్కెట్ వాటాలు 2010-11లో 12.92 శాతానికి పడిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో 2,56,202 కార్లను టాటా మోటార్స్ విక్రయించగా.. 2009-10 ఆర్థిక సంవత్సరంలో 2,01,399 కార్లను విక్రయించింది.
మొత్తం మీద చూస్తే.. ఈ మూడు కంపెనీల మార్కెట్ స్థానాలు యథాతథంగా ఉన్నప్పటికీ మార్కెట్ వాటాల విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. విదేశీ కంపెనీలైన జనరల్ మోటార్స్ ఇండియా వాటాలు 4.62 శాతం నుంచి 4.40 శాతానికి పడిపోగా.. హోండా సియోల్ కార్స్ ఇండియా వాటాలు 4.01 శాతం నుంచి 2.97 శాతానికి పడిపోయాయి. ఇంతటి పోటీతత్వ మార్కెట్లో దేశీయ కంపెనీలు వెనకపడితే, కొన్ని విదేశీ కంపెనీలైన ఫోర్డ్, ఫోక్స్‌వ్యాగన్‌లు మాత్రం బాగానే లాభపడ్డాయి. ఫోర్డ్ అందిస్తున్న చిన్న కారు "ఫిగో", ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న చిన్న కారు "పోలో"ల ద్వారా ఈ కంపెనీలు ఇంతటి వృద్ధిని సాధించగలిగాయి.
2010-11లో ఫోర్డ్ 95,395 కార్లను విక్రయించి మార్కెట్ వాటాను 4.81 శాతానికి పెంచుకుంది. అదే 2009-10లో గమనిస్తే.. ఫోర్డ్ విక్రయాలు కేవలం 34,324 యూనిట్లుగా ఉండి 2.25 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక ఫోక్స్‌వ్యాగన్ కూడా తన 2010-11లో మార్కెట్ వాటాను 0.27 శాతం నుంచి 2.60 శాతానికి పెంచుకుంది. 2009-10 కేవలం 4,094 కార్లను మాత్రమే విక్రయించిన కంపెనీ 2010-11 ఏకంగా 51,608 కార్లను విక్రయించింది. పోలో, వెంటో కార్ల ద్వారానే ఫోక్స్‌వ్యాగన్ ఈ వృద్ధిని సాధించగలిగింది. 2010 ప్యాసింజర్ కార్ విభాగంలో 24 కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చయాని, 40 వరకూ కొత్తగా అప్‌గ్రేడ్ చేయబడిన మోడళ్లు వచ్చాయని ఎస్ఐఏఎమ్ అధ్యక్షుడు పవన్ గియెన్కా చెప్పారు.


Click it and Unblock the Notifications








