యూనియన్ ఎన్నికలను బహిష్కరించిన మానేసర్ కార్మికులు

ఈ నేపథ్యంలో మారుతి సుజుకి ప్లాంటులో ఇప్పటికే ఉన్న యూనియన్ (మారుతి ఉద్యోగ్ కామ్‌ఘర్ యూనియన్)కు జరుగనున్న ఎన్నికల్లో తాము పాల్గొనబోమని, ఈ యూనియన్‌ను గుర్తించే ప్రసక్తే లేదని, తమ కొత్త యూనియన్‌ను గుర్తించి తీరాల్సిందేనని మరోసారి వర్కర్లు తమ గళం విప్పారు. ప్రస్తుతం కంపెనీ గుర్తించిన ఒకేఒక్క యూనియన్ మారుతి ఉద్యోగ్ కామ్‌ఘర్ యూనియన్ (ఎమ్‌యూకెయూ). ఈ యూనియన్‌లో ఎక్కువగా గుర్గావ్ ప్లాంట్ వర్కర్లే ఉన్నారు. దీంతో ఎమ్‌యూకెయూలో మానేసర్ వర్కర్ల ప్రాబల్యం తగ్గి గుర్గావ్ వర్కర్ల పలుకుబడి ఎక్కువగా ఉంది.
మానేసర్ ప్లాంటు నుంచి ముగ్గురు అభ్యర్థులను యాజమాన్యమే ఎన్నుకుందని, ఎన్నికలు సంబంధించిన ఎలాంటి సన్నాహాలు లేవని, తమ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా ఇందులో పాల్గొనబోవడం లేదని మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్ఎస్ఈయూ) జనరల్ సెక్రటరీ శివ్ కుమార్ వెల్లడించారు. ఈ ఎన్నికలకు బదులు తమ యూనియన్ స్వంత ప్రణాళికలతో ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. హర్యానా ప్రభుత్వ కార్మిక శాఖలో తమ కొత్త యూనియన్ గుర్తింపును కోరుతూ ఎమ్ఎస్ఈయూ ఇప్పటికే ఓ ధరఖాస్తు కూడా అందజేసింది.
ఎమ్ఎస్ఈయూ కోసం వెరిఫికేషన్ విధానం కొనసాగుతోందని, ఒక్కసారి అది పూర్తయిన తర్వాత, త్వరలోనే తమ యూనియన్ నంబర్ రాగలదని భావిస్తున్నామని కుమార్ తెలిపారు. ఈ విషయంపై మారుతి సుజుకి ప్రతినిధిని సంప్రదించగా.. ఈ ఎన్నికలు యూనియన్ యొక్క అంతర్గత వ్యవహారమని, ఎన్నికల విధానానికి సంబంధించి మారుతి సుజుకి యాజమాన్యం కేవలం అడ్మినిస్ట్రేటివ్ మద్దతును మాత్రమే ఇస్తుందని తెలిపారు. కాగా.. గత నెలలో మానేసర్ ప్లాంటులో తలెత్తిన సమ్మె హర్యానా సర్కారు జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగింది. ఈ సమ్మె కారణంగా కంపెనీ 12,600 యూనిట్ల ఉత్పత్తిని నష్టపోయింది, దీని విలువ సుమారు రూ. 630 కోట్లు ఉండవచ్చనని అంచనా.


Click it and Unblock the Notifications








